నేటి నుంచి బాలాజీ కల్యాణోత్సవాలు

30 May, 2023 02:56 IST|Sakshi
బాల బాలాజీ స్వామి వారి ఆలయం

మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయం వార్షిక దివ్య తిరు కల్యాణ మహోత్సవాలకు ముస్తాబైంది. పచ్చని మామిడి తోరణాలు, చలువ పందిళ్లు, విద్యుత్‌ దీపాల కాంతులతో ఆలయం కల్యాణ శోభతో అలరారుతోంది. స్వామి కల్యాణ మహోత్సవాలు మంగళవారం నుంచి శనివారం వరకు అయిదు రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జ్యేష్ఠ శుద్ధ దశమి మంగళవారం స్వామి వారి కల్యాణోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. స్వామివారి తిరు కల్యాణం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి బుధవారం రాత్రి 9.15 గంటలకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పాంచరాత్ర ఆగమానుసారం కల్యాణోత్సవాలను నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ చిట్టూరి రామకృష్ణ, ఏసీ, ఈఓ డి.శ్రీరామవరప్రసాదరావు తెలిపారు.

గ్రామ చరిత్ర...

మూడున్నర దశాబ్దాల క్రితం అప్పన్న అనే బాలుడు తపస్సు చేసి తరించడం వల్ల ఈ గ్రామానికి ‘అప్పనపల్లి’ అని పేరు వచ్చిందని ప్రతీక. పూర్వం ‘అర్పణేశ్వరుడు’ అనే యతీంద్రుడు పలు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ వైనతేయ నదీ తీరాన ఇసుక మేటలు వేసిన ప్రశాంత స్థలంలో ముక్కంటిని ధ్యానిస్తూ శివ సాక్షాత్కారం పొందాడని, ఈ అర్పణ ఫలితాలు కాల క్రమేణా ‘అప్పనపల్లి’గా ప్రసిద్ధి చెందాయని మరో కథనం.

ఆలయ చరిత్ర...

శ్రీ బాలబాలాజీ స్వామి కొబ్బరి కొట్టులో వెలిశారు. 1960వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీ వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్టించారు. ఆలయ వ్యవస్థాపకుడు మొల్లేటి రామస్వామి పూర్వం కొబ్బరి కాయల వ్యాపారం చేసేవారు. ఆ వ్యాపారం నష్టాలతో నడుస్తుండడంతో తిరుమల శ్రీవారికి వ్యాపారంలో వాటా పెట్టారు. అప్పటి నుంచి ఆ వ్యాపారం లాభాల బాటలో పయనించింది. అప్పటి నుంచి లాభంలో 10 శాతం వాటాను తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామికి సమర్పించేవారు. ఆ కొబ్బరి కొట్టులో తిరుపతి నుంచి తీసుకువచ్చిన శ్రీవారి చిత్రపటాన్ని ప్రతిష్ఠించారు. ఆ విధంగా ప్రతిష్టించిన శ్రీబాల బాలాజీ స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తడం పెరిగింది. దీంతో నూతన ఆలయ నిర్మాణానికి రామస్వామి శ్రీకారం చుట్టారు.

నూతన ఆలయ నిర్మాణం

1970 మార్చి 18న నూతన ఆలయానికి శంకుస్థాపన జరిగింది. కొబ్బరి కొట్టులో ప్రతిష్ఠించిన శ్రీవారి చిత్రపటాన్ని అలాగే ఉంచి దానికి సమీపంలో నూతన ఆలయానికి రూపకల్పన చేశారు. కొత్తగుడిపై చిత్రీకరించిన గోవు–గొల్లవాడు, గీతోపదేశం వంటి అద్భుత చిత్రాలు భక్తులను పరవశింపజేస్తాయి. 1981లో దేవదాయశాఖ ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకుంది. దీనిపై కోర్టులో వ్యాజ్యాలు నడిచాయి. 1990 ఏప్రిల్‌ తొమ్మిదిన దేవాలయాన్ని దేవదాయ ధర్మాదాయ శాఖకు ధారాదత్తం చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. 1991 జూలై నాలుగున టీటీడీ ఉచితంగా సమర్పించిన మూలవిరాట్‌, సబ్సిడీపై కొనుగోలు చేసిన పద్మావతి, ఆండాళ్‌, గరుడాళ్వార్‌లను శ్రీమాన్‌ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు.

ఆలయానికి చేరుకునేది ఇలా...

స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులు రాజమహేంద్రవరం నుంచి వయా రావులపాలెం, గంటి మీదుగా తాటిపాక చేరుకోవాలి. రాజమహేంద్రవరం నుంచి ఆలయానికి 70 కిలోమీటర్ల దూరం. కాకినాడ నుంచి అమలాపురం, పాశర్లపూడి మీదుగా అప్పనపల్లి చేరుకునే వారికి 64 కిలోమీటర్లు. పైన పేర్కొన్న ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సు సదుపాయాలు ఉన్నాయి.

రేపు రాత్రి 9.15 గంటలకు దివ్య కల్యాణం

మరిన్ని వార్తలు