ఆలోచనలు భేష్‌... ఆచరణ?

21 Dec, 2022 00:54 IST|Sakshi

అవును. నాలుగేళ్ళ చర్చోపచర్చల తర్వాత ప్రపంచ జీవవైవిధ్య పరిరక్షణ ఒప్పందం (సీబీడీ)పై ఆలోచన ముందుకు కదిలింది. ఏకంగా 190కి పైగా దేశాలు ఈ ఒప్పందం చేసుకోవడం, ఘనంగా 23 భారీ లక్ష్యాలు అందులో ప్రస్తావించడం కచ్చితంగా చరిత్రాత్మకం. ఈ భారీ ఆలోచనకు కీలక మైన ఆచరణే ఇక మిగిలింది.

కెనడాలోని మాంట్రియల్‌లో ఐక్యరాజ్య సమితి సారథ్యంలో జరిగిన జీవవైవిధ్యంపై భాగస్వామ్యపక్షాల 15వ సదస్సు (కాప్‌15) అక్షరాలా ఒక మైలురాయి. అయితే, ఐరాస పెద్దలే అన్నట్టు అన్నీ సత్వరం అమలుచేసి, పురోగతి సాధిస్తేనే విజయం సాధ్యం. అందుకే, ఈ చరిత్రాత్మక పరిణామంపై ఏకకాలంలో ఇటు ఆశలూ, అటు అనుమానాలూ తలెత్తుతున్నాయి.  

డిసెంబర్‌ 7 నుంచి 19 వరకు జరిగిన ‘కాప్‌15’లో 196 దేశాల అధికారిక ప్రతినిధులు, 10 వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. మొన్న నవంబర్‌ 20న ఈజిప్ట్‌లో 27వ ఐరాస పర్యావరణ సదస్సు (కాప్‌ 27) ముగిసిందో లేదో, ఈ జీవవైవిధ్య సదస్సు జరిగింది. ప్రకృతిని కాపాడకుండా, పునరుద్ధరించకుండా భూతాపోన్నతిని 1.5 డిగ్రీలకే పరిమితం చేయడం కుదిరేపని కాదు.

అలా జీవవైవిధ్య సదస్సులు కీలకం. అయితే తుపానులు, కరిగిపోతున్న హిమానీనదాలతో పర్యావరణ సంక్షోభం కళ్ళకు కట్టినట్టు, జీవవైవిధ్య నష్టం తెలియదు. అందుకే, తీవ్రంగా పరిగణించక తప్పు చేస్తుంటారు. ఈ సదస్సులకు దేశాధినేతలెవరూ హాజరు కారు. సీబీడీ నిబంధనలు, లక్ష్యాలపై పర్యవేక్షణా తక్కువే. వెరసి పర్యావరణ సదస్సులంత ప్రచారం, రాజకీయ పటాటోపం కనిపించవు.

నిజానికి, మూడు దశాబ్దాల క్రితమే 1992లో రియో డిజెనీరోలో జరిగిన ధరిత్రి సదస్సులోనే 150 మంది ప్రభుత్వ నేతలు సీబీడీపై తొలిసారి సంతకాలు చేశారు. జీవవైవిధ్య పరిరక్షణ దాని ప్రధాన ఉద్దేశం. ఆపైన ఆ ఒప్పందానికి మొత్తం 196 దేశాలు ఆమోదముద్ర వేశాయి. అమెరికా మాత్రం ఆమోదించలేదు. అలాగని సంక్షోభం లేదని కాదు.

రానున్న రోజుల్లో 34 వేల వృక్ష జాతులు, 5200 జంతు జాతులు అంతరించిపోతాయని ఐరాస అంచనా. ప్రపంచంలోని పక్షిజాతుల్లో ప్రతి ఎనిమిదింటిలో ఒకటి కనుమరుగవుతుందట. అలాగే, భౌగోళిక జీవవైవిధ్యానికి ఆలవాలమైన సహజ అరణ్యాల్లో దాదాపు 45 శాతం ఇప్పుడు లేవు. ఇందులో అధికభాగం గత శతాబ్దిలో సాగిన విధ్వంసమే. తలసరి కర్బన ఉద్గారాల పెరుగుదల, ఉష్ణోగ్రతల్లో మార్పులకు ఇది కారణమని గుర్తించట్లేదు. అదే సమస్య. ఈ నేపథ్యంలో జీవవైవిధ్య నష్టాన్ని నివారించి, 2030 నాటి కల్లా ప్రకృతిని మళ్ళీ దోవలో పెట్టడమే లక్ష్యంగా తాజా ‘కాప్‌15’ జరిగింది. 

పర్యావరణ మార్పులపై 2015లో జరిగిన ప్యారిస్‌ ఒప్పందం ఎలాంటిదో, జీవవైవిధ్య పరిరక్షణకు ఈ ‘కాప్‌15’ మాంట్రియల్‌ ఒప్పందం అలాంటిదని విశ్లేషకుల మాట. పారిశ్రామికీక రణకు ముందు నాటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే భూతాపోన్నతి 2 డిగ్రీల సెల్సియస్‌ మించరాదనీ, అసలు 1.5 డిగ్రీల లోపలే ఉండేలా ప్రయత్నించాలనీ దేశాలన్నీ అప్పట్లో ప్యారిస్‌ ఒప్పందంలో ఏకగ్రీవంగా అంగీకరించాయి.

ఇప్పుడీ మాంట్రియల్‌ ఒప్పందంలో భాగంగా ‘30కి 30’ అంటూ, 2030 నాటికి 30 శాతం భూ, సముద్ర ప్రాంతాలను పరిరక్షించాలని నిర్దేశించుకున్నాయి. జీవ వైవిధ్య పరిరక్షణకు 2030కల్లా 20 వేల కోట్ల డాలర్లు సమీకరించాలని తీర్మానించాయి. పేదదేశాలకు చేరే మొత్తాన్ని 2025 కల్లా ఏటా కనీసం 2 వేల కోట్ల డాలర్లకు పెంచాలని యోచిస్తున్నాయి. 

విఫలమైన 2010 నాటి జీవవైవిధ్య లక్ష్యాల స్థానంలో మొత్తం 23 లక్ష్యాలను ఈ సదస్సు నిర్ణయించింది. అయితే, వివిధ దేశాలు తమ పరిస్థితులు, ప్రాధాన్యాలు, సామర్థ్యాలకు తగ్గట్టుగా వాటిని మలుచుకొనే స్వేచ్ఛనిచ్చారు. ఇది భారత్‌ చేసిన సూచనే. ఇక, వర్ధమాన దేశాల్లో వ్యవ సాయ, మత్స్యసబ్సిడీలు, పురుగుమందుల వినియోగంపై వేటు పడకుండా భారత్, జపాన్‌ తది తర దేశాలు కాచుకున్నాయి.

అయితే, లోటుపాట్లూ లేకపోలేదు. ప్రపంచంలోనే పెద్ద వర్షారణ్యా లున్న కాంగో లాంటి ఆఫ్రికన్‌ దేశాలు చమురు, సహజవాయు అన్వేషణ ప్రమాదంలో పడ్డాయి. అవి కొన్ని అంశాల్లో అసమ్మతి స్వరం వినిపించినా ఈ కొత్త ఒప్పందాన్ని ఖరారు చేశారు. వచ్చే 2030కి సహజ జీవ్యావరణ వ్యవస్థలు 5 శాతం వృద్ధి చెందేలా చూడాలన్న లక్ష్యాన్ని చివరలో తీసేయడమూ నష్టమే. నిర్దిష్ట లక్ష్యాలు లేకుంటే ఆశయాలు మంచివైనా ఆచరణలో విఫలమవుతాం. 

‘కాప్‌–15’ జీవవైవిధ్య ఒప్పందపు సంకల్పంతోనే సరిపోదు. ఒప్పందానికి ఊ కొట్టిన దేశాలు తీరా దాన్ని పాటించకున్నా చర్యలు తీసుకొనే అవకాశం లేదు. అందుకే, 23 లక్ష్యాల సాధనపై అను మానం, ఆందోళన. గతంలో జీవవైవిధ్య ప్రణాళికల అమలులో ప్రపంచ దేశాలు ఘోరంగా విఫల మయ్యాయి. 2010లో జపాన్‌లోని ఐచీలోనూ ఇలాగే 20 లక్ష్యాలను 2020 నాటికల్లా అందుకోవా లని పెట్టుకున్నాం. కానీ, వాటిలో ఒక్కటీ సాధించలేదు. మరోసారి అలాంటి అప్రతిష్ఠ రాకూడదు. 

తక్షణం కార్యరంగంలోకి దూకాలి. పరిమితవనరుల్ని యథేచ్ఛగా వాడుతూ, కర్బన ఉద్గారా లకు కారణమవుతున్న ధనిక పాశ్చాత్య ప్రపంచానికి ముకుతాడు వేయాలి. జంతుజాలాన్నీ, పశు పోషణతో అడవుల నరికివేత సాగుతున్న అమెజాన్‌ వర్షారణ్యాల్నీ కాపాడుకోవాలంటే ఆ దేశాల ఆహారపుటలవాట్లు మారాలి. మూలవాసుల హక్కుల్ని గౌరవించాలన్న మాటా ఆహ్వానించదగ్గదే. దశాబ్దాల క్రితమే చేయాల్సిన పనికి ఇప్పటికైనా నడుం కట్టడం మంచిదే. ప్రపంచం కలసికట్టుగా నడవాల్సిన వేళ కెనడా, చైనాల సహ ఆతిథ్యంలో ఈ సదస్సు, ఒప్పందం శుభపరిణామాలే! 

మరిన్ని వార్తలు