ఫిరాయింపులే మహా‘ప్రసాదం’

11 Jun, 2021 03:41 IST|Sakshi

ఇంకో ఏడాదిలోగా ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ వారి వలలో ఒక చేప పడింది. ఆనవాయితీ ప్రకారం ఆ చేపను మీడియా ముందు ప్రదర్శించారు. ప్రదర్శన ఢిల్లీలో నిర్వ హించారు. సాక్షాత్తు బీజేపీ జాతీయ అధ్యక్షులు హాజరై సదరు చేపను స్వీకరించారు. ఈ హడావుడి ప్రకారం చూస్తే దొరికింది వాటమైన సొరచేపేనన్న విశ్వాసం కలగడం సహజం. నిజమే.. ఆ చేప పేరు జితిన్‌ ప్రసాద. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు. ఆ పార్టీకి అదే అత్యున్నత స్థాయి కమిటీ. కేంద్రమంత్రిగా కూడా మన్మోహన్‌ కేబినెట్‌లో పనిచేశారు. వాళ్ల నాన్నగారు జితేంద్ర ప్రసాద కూడా కాంగ్రెస్‌లో అత్యున్నత పదవులు అలంకరించారు. పదేళ్లపాటు ఇద్దరు ప్రధానమంత్రులకు రాజకీయ సలహాదారుగా వ్యవహరించారు. ఇన్ని అర్హతలున్న జితిన్‌ను సొరచేప కేటగిరిలోనే వేసుకోవాలి కదా! కానీ ఎన్నికల ట్రాక్‌ రికార్డు చూస్తే భిన్నాభిప్రాయం కలుగుతుంది. 2014 లోక్‌సభ, 2017 యూపీ అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఘోరంగా ఓడిపోయారు. మూడోసారి డిపాజిట్‌ కూడా దక్కలేదు. ఈ లెక్కన చూస్తే సొరచేప మాదిరి హడావుడి చేసేటంత దృశ్యం జితిన్‌కు లేదు. పిత్త పరకకు ఎక్కువ, బొచ్చెకు తక్కువ అనుకోవలసి వస్తుంది. సీనియర్, జూనియర్‌ ప్రసాదలకు కాంగ్రెస్‌ పార్టీ బోలెడన్ని అవకాశాలను కల్పించింది. కిరీటాలు, భుజ కీర్తులను మార్చి మార్చి అలంకరించింది. వీరు ఉత్తరప్రదేశ్‌కి చెందిన బ్రాహ్మణ వర్గం వారు కావ డమే అందుకు కారణం. జాతీయ రాజకీయాలలో ఉత్తరప్రదేశ్‌ కీలకం. అక్కడి సామాజిక సమీకర ణల ప్రకారం బ్రాహ్మణ వర్గం ముఖ్యమైనది. తండ్రీ కొడుకులిద్దరికీ కాంగ్రెస్‌ పార్టీ ఎంత సాధి కారతను ప్రసాదించినా యూపీ బ్రాహ్మణ వర్గం మాత్రం ఈ ప్రసాదాలను కళ్లకద్దుకోలేదు. కాంగ్రెస్‌పార్టీ లక్నో పీఠానికి దూరమై ముప్పయ్‌ మూడేండ్లు గడిచిపోయాయి. యూపీ కాంగ్రెస్‌ అధి కార వైరాగ్యానికి గల ముఖ్య కారణాల్లో ఆ పార్టీకి బ్రాహ్మణ వర్గం దూరం కావడం మొదటిది. దూరమైన తన సామాజిక వర్గాన్ని మళ్లీ కాంగ్రెస్‌ దరి చేర్చడానికి ప్రసాదలు చేసిందేమీలేదు. 


ఈ నేపథ్యంలో జితిన్‌ప్రసాద కాంగ్రెస్‌ పార్టీలో ఉండి ఆ పార్టీకి ఒరగబెట్టేదేమీలేదు. పోయి నంత మాత్రాన నష్టం జరగడానికి ఆ పార్టీలో మిగిలింది కూడా ఏమీలేదు. ఇదీ స్థూలంగా జితిన్‌ ప్రసాద రాజకీయ జన్మ వృత్తాంతము. ఏ ప్రయోజనాన్ని ఆశించి ఎన్నికల ముందు ‘ఏక్‌ ఝలక్‌’ మాదిరిగా జితిన్‌ షోను బీజేపీ నిర్వహించింది? నరేంద్రమోదీ, అమిత్‌షా టీమ్‌ బీజేపీ జాతీయ నాయకత్వాన్ని చేపట్టినప్పటి నుంచి పొలిటికల్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ను ఒక వ్యూహంగా రూపొం దించారు. గతంలో రాష్ట్ర స్థాయిలో ఈ వ్యూహాన్ని టీడీపీ నాయకుడు చంద్రబాబు అనుసరించేవారు. దాని వలన ఆయనకు కొన్ని తాత్కాలిక ప్రయోజనాలు దక్కిన మాట వాస్తవం. ఈ ఫిరాయింపులనే ప్రధానాస్త్రంగా ప్రయోగించి మొన్నటి పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీ పోరాడింది. తృణమూల్‌ కాంగ్రెస్‌లో దాదాపు నెంబర్‌ టూగా చెలామణైన ముకుల్‌ రాయ్‌తో సహా అనేకమంది ప్రముఖులకు బీజేపీ కాషాయ తీర్థం పోసి కమలం పువ్వులతో అలంకరించింది. 34 మంది అధికార పార్టీ ఎమ్మె ల్యేలు తమవైపు ఫిరాయించేలా గ్రంథం నడిపింది. విపరీత ప్రచార పటాటోపంతో అధికార తృణ మూల్‌ కాంగ్రెస్‌ ‘ఖేల్‌ ఖతం’ (ఆటముగిసింది) అనే భ్రాంతిని కల్పించింది. ఖేలాహోబే (ఆటా డుదాం) అంటూ ఎదురుతిరిగిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించగలిగింది. ఎంత ప్రచార  హోరు సృష్టించినా బెంగాల్‌లో బీజేపీ గెలవలేకపోయింది. మరి యూపీలోనూ అదే గేమ్‌ను ఎందుకు ఎంచుకున్నట్టు? బీజేపీ నాయకుల అంతరంగం మరో విధంగా ఉండవచ్చు. బెంగాల్‌లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు 2016లో జరిగిన ఎన్నికల్లో, ఆ పార్టీకి పట్టుమని పదిశాతం ఓట్లు పడలేదు. ముగ్గురు మాత్రమే గెలవగలిగారు. మరి ఐదేళ్లు తిరిగేసరికి 79 సీట్లను, 36 శాతం ఓట్లను ఎలా సాధించగలిగింది. తమ వ్యూహం వల్లనే అధికారపు అంచులదాకా చేరుకోగలిగామని బీజేపీ విశ్వసిస్తున్నట్టు ఆ పార్టీ యూపీ సన్నాహాల తీరును బట్టి అర్థమవుతుంది.


బెంగాల్‌లో ఐదారేళ్లకు పూర్వం బీజేపీకి పెద్దగా బలం లేదు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ వారి దాడుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున కిందిస్థాయి సీపీఎం కార్యకర్తలు, సానుభూతిపరులు బీజేపీలో చేరారు. అందువల్ల 2016లో బీజేపీ బలం 10 శాతం ఓట్లకు పెరిగింది. ఆ తరువాత ఫిరాయింపులపై ఫోకస్‌ పెట్టడం, మమతా బెనర్జీకి తామే ప్రత్యామ్నాయంగా ఫోకస్‌ చేసుకోవడం కలసి వచ్చింది. మరి ఉత్తరప్రదేశ్‌లో బలంగా ఉన్న బీజేపీకి ఫిరాయింపుల అవసరం దేనికి? యోగీజీ సర్కారుపై ప్రజల్లో విముఖత ఏర్పడుతున్నట్లు వస్తున్న వార్తలు నిజమేనా? మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖిలేశ్‌ పార్టీ మెరుగైన ఫలితాలు రాబట్టడం కలవరం కలిగిస్తున్నదా? ఈ కారణంగానే బీజేపీ ఫిరాయింపు రాజకీయాలకు తెర తీసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం రాజకీయ ఎత్తుగడలకోసం, వ్యూహాలకోసం ఎడాపెడా ఫిరాయింపులకు పాల్ప డితే మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నట్లు భావించగలమా? కొన్ని విలువల కోసమో సిద్ధాంతాల కోసమో, ఉమ్మడి ఆశయాల సాధన కోసమో, రాజకీయ విధేయతలను మార్చుకోవ డాన్ని అర్థం చేసుకోవచ్చు. అది కూడా కొన్ని పద్ధతులకూ, ప్రమాణాలకూ, సంప్రదాయాలకూ అను గుణంగా ఉండాలి. కేవలం అధికారమే పరమావధిగా జరిగే ఫిరాయింపుల వల్ల ఎల్లవేళలా ఫలితాలు సాధించలేరు సరికదా, మన ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రమాదంలోకి తోసినవారవుతారు. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు