సీఎం సార్‌... ఆశీర్వదించండి

7 Sep, 2023 04:31 IST|Sakshi
ఎంపికైన విద్యార్థులతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

అమెరికాలో చదువుకుని వస్తాం

ఆంధ్రప్రదేశ్‌ గురుకులం విద్యార్థులు అరుదైన అవకాశం చేజిక్కించుకున్నారు. అగ్రరాజ్యం అమెరికా వెళ్లి అక్కడ 10 నెలలు ఉండి పాఠాలు చదువుకోబోతున్నారు. ఈ గొప్ప అవకాశం వారి జీవితాలను మార్చనుంది.
ఇందుకు కారణమైన ఏ.పి. సీఎం వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం అంటున్నారు.
‘ఏ.పి గురుకులాలను సి.ఎం గారు ఆధునికంగా తీర్చిదిద్దడం వల్లే మాకు ఈ అవకాశం దక్కింది’ అంటున్నారు. ‘కెనడీ లుగర్‌–యూత్‌ ఎక్స్ఛేంజ్‌ అండ్‌ స్టడీ ప్రోగ్రామ్‌’ కింద అమెరికా వెళ్లిన విద్యార్థుల మనోగతాలు...

మా దేశానికి అధ్యయానికి రండి అంటూ అగ్రదేశం అమెరికా నుంచి వచ్చిన ఆహ్వానం ఏ.పి. గురుకుల పాఠశాలల్లో సీనియర్‌ ఇంటర్‌ చదువుతున్న ఐదుగురు విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది. నెలకు కనీసం రూ.10 వేలు కూడా సంపాదన లేని కుటుంబాల నుంచి వచ్చిన ఈ విద్యార్థులు అమెరికాను చూడటమే కాదు అక్కడ పది నెలలు ఉండి చదువుకునే అవకాశం పొందడం వారి జీవితాలను మార్చనుంది.

ఇలా పేదపిల్లలకు పెద్ద అవకాశం దక్కడం వెనుక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన చదువుల మహాయజ్ఞం కీలకపాత్ర పోషించిందన్నది జగమెరిగిన సత్యం. ‘నాడు–నేడు’తో రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలు అధునాతంగా మారిపోవడంతోపాటు అన్ని వసతులూ సమకూరాయి. ఇంగ్లిష్‌ విద్య, నాణ్యమైన విద్యాబోధన, డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు, ఆన్‌లైన్‌ క్లాసులు, ట్యాబ్‌లు వంటి ఎన్నో సౌకర్యాలతో పేదపిల్లల పెద్ద చదువుకు కొత్త బాటలు పరుస్తున్నారు.

తొమ్మిది దశల వడపోత
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో అంతర్జాతీయ అవగాహనలో భాగంగా యూనైటెడ్‌ స్టేట్స్‌ (యూఎస్‌) గత కొన్నేళ్లుగా ‘కెన్నడీ లుగర్‌–యూత్‌ ఎక్సే ్చంజ్‌ అండ్‌ స్టడీ (కేఎల్‌ – వైఈఎస్‌) ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రతి యేటా ఎంపికైన విద్యార్థులు పది నెలలపాటు అమెరికాలో ఉంటారు. దీనికి ఎంపిక కావాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని విద్యాసంస్థలకు చెందిన విద్యార్థుల నుంచి గట్టి పోటీ ఉంటుంది.

మొదట బయోడేటా నుంచి చివరి ఇంటర్వ్యూల వరకు తొమ్మిది దశల్లో కఠినతరమైన వడపోత కొనసాగు తుంది. దాదాపు తొమ్మిది నెలలపాటు కొనసాగే అన్ని అర్హత పరీక్షల ప్రక్రియను విజయవంతంగా దాటుకుని రాష్ట్రానికి చెందిన ఎస్సీ గురుకుల విద్యార్థులు డి.నవీన, ఎస్‌. జ్ఞానేశ్వరరావు, రోడా ఇవాంజిలి, బి.హాసిని, సీహెచ్‌. ఆకాంక్షలు అవకాశాన్ని దక్కించుకున్నారు. వారంతా ఇటీవలే అమెరికాకు పయనమై వెళ్లారు. వారిని అక్కడ ఎంపిక చేసిన పాఠశాలలోచేర్పిస్తారు. ఆ విద్యార్థులు పరీక్షలు, క్రీడలతోపాటు మొత్తం పాఠశాల ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. ఆ విద్యార్థులకు అమెరికాలో ఎంపిక చేసిన కుటుంబాలు అతిథ్యం ఇస్తాయి. విద్యార్థులు ఒక్కొక్కరికీ దాదాపు 200 డాలర్లు (సుమారు రూ. 16,500) నెలవారీ ఆర్థిక తోడ్పాటు (స్టైపెండ్‌)ను అందిస్తారు.

సీఎంకు కృతజ్ఞతలు
2023–24 విద్యా సంవత్సరానికి ‘కెన్నడీ లుగర్‌–యూత్‌ ఎక్సే ్చంజ్‌ అండ్‌ స్టడీ’ కోసం ఆఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణాసియాలోని 38 దేశాల విద్యార్థులను ఎంపిక చేశారు. వారిలో మన దేశానికి చెందిన 30 మంది ఎంపిక కాగా ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ఐదుగురు విద్యార్థులు ఉండటం గర్వకారణం. వీరికి కావలసిన నిత్యావసరాలు, దుస్తులు, బ్యాగులు, మొబైల్‌ఫోన్‌ల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ శాఖ ఆర్థికసాయం అందిస్తోంది.

కేఎల్‌–వైఈఎస్‌ ప్రోగ్రామ్‌లో అమెరికా చదువులకు వెళ్తున్న ఐదుగురు విద్యార్థులు డి. నవీన, ఎస్‌.జ్ఞానేశ్వరరావు, రోడా ఇవాంజిలి, బి.హాసిని, సీహెచ్‌ ఆకాంక్ష సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఆగస్టు 31న కలిశారు. వారితోపాటు గతేడాది అమెరికా వెళ్లి కోర్సు పూర్తిచేసుకుని వచ్చిన విద్యార్థులు కె.అక్ష, సి.తేజ కూడా సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల కుటుంబ నేప«థ్యం తదితర వివరాలను సీఎం  అడిగి తెలుసుకున్నారు. యూఎస్‌ఏ లో చదువులు పూరై్త వచ్చిన తర్వాత కూడా వారి చదువులు కొనసాగించేలా నిరంతరాయంగా వారిని పర్యవేక్షించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఒక్కో విద్యార్థికి ప్రోత్సాహకంగా రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వారికి ట్యాబ్‌లను అందజేశారు.

థాంక్యూ సీఎం సార్‌
అమెరికా చదువులకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. విద్యా వ్యవస్థలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేపట్టిన విప్లవాత్మక చర్యల వల్లే నాకు ఈ అవకాశం దక్కింది. విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం పెదగంట్యాడ మా ఊరు. మా నాన్న ప్రవీణ్‌ రాజ్‌ నెలకు రూ.7 వేలు సంపాదించే ప్రైవేటు ఉద్యోగి. తల్లి సుకాంతి గృహిణి. ఇల్లు గడవడమే కష్టమైన పరిస్థితిలో గురుకులం ద్వారా ప్రభుత్వం నాకు మంచి విద్యావకాశాలు కల్పించింది.
– రోడా ఇవాంజిలి, మధురవాడ గురుకులం, విశాఖ జిల్లా.

విద్యాలయాల్లో మెరుగైన సదుపాయాలు
మా వంటి పేద వర్గాల పిల్లలు చదివే విద్యాలయాలను సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎంతో బాగా తీర్చిదిద్దారు.  ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లి మా గ్రామం. మా నాన్న దార కేశయ్య పదవ తరగతి చదివి వ్యవసాయ పనులతో నెలకు రూ.10 వేలు సంపాదిస్తాడు. ఐదవ తరగతి చదివిన అమ్మ ఆదిలక్ష్మమ్మ గృహిణి. పేదరికం కారణంగా ప్రకాశం జిల్లా మార్కాపురం గురుకులంలో 5 వ తరగతిలో చేరిన నేను ప్రస్తుతం సీనియర్‌ ఇంటర్‌ చదువుతున్నా.
– డి.నవీన, మార్కాపురం గురుకులం

ఆనందంగా ఉంది
ప్రభుత్వ గురుకులంలో చదివే నేను అమెరికా చదువులకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు, ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. విజయవాడ గుణదల ప్రాంతం మాది. మా నాన్న చొక్కా సురేష్‌ అటెండర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మా అమ్మ వనజ గృహిణి.
– సీహెచ్‌ ఆకాంక్ష, ఈడ్పుగల్లు ఐఐటీ– ఎన్‌ఐటీ అకాడమి, కృష్ణా జిల్లా

పేద పిల్లల చదువులకు సీఎం శ్రద్ధ చూపిస్తున్నారు
పేద పిల్లల ఉన్నత చదువుల కోసం సీఎం వైఎస్‌ జగన్‌ శ్రద్ధ చూపిస్తున్నారు. పేదవర్గానికి చెందిన నేను అమెరికా చదువులకు ఎంపిక అయ్యానంటే మా చదువులకు సీఎం సార్‌ అందించిన ప్రోత్సాహమే కారణం. చాలా సరదాగా మాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న సీఎం గారు మాకు రూ.లక్ష సాయం, ట్యాబ్‌లు అందించారు. సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం, మల్లెనిపల్లి మా గ్రామం. మా నాన్న నరసింహులు ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. తల్లి నాగమణి గృహిణి.
–హాసిని బలిగా, ఈడ్పుగల్లు ఐఐటీ– నీట్‌ అకాడమి, ఎస్సీ గురుకుల

కలలో కూడా  ఊహించలేదు
నేను అమెరికా చదువుకు ఎంపిక అవుతానని కలలో కూడా ఊహించలేదు. ప్రభుత్వం, ఉపాధ్యాయులు అందించిన సహకారం వల్లే ఈ అవకాశం దక్కింది. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం జి.కొత్తూరు మా ఊరు. మా నాన్న ఎస్‌.కృష్ణ మృతి చెందడంతో అమ్మ రాము రోజువారీ కూలీగా నెలకు ఆరు వేలు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. 2017లో గురుకులంలో 6వ తరగతిలో చేరి ప్రస్తుతం సీనియర్‌ ఇంటర్‌ చదువుతున్నాను.
– ఎస్‌. జ్ఞానేశ్వరరావు, శ్రీకృష్ణాపురం గురుకులం, విశాఖ జిల్లా.

– యిర్రింకి ఉమమాహేశ్వరరావు, సాక్షి ప్రతినిధి, అమరావతి

మరిన్ని వార్తలు