చలికాలంలో డైఫ్రూట్స్‌ తింటున్నారా? దీనిలోని విటమిన్‌-ఈ వల్ల..

2 Jan, 2024 15:50 IST|Sakshi

చలికాలంలో ముఖం పొడిబారిపోవడమూ, పెదవులు పగలడం, ముఖంపై ముడతలు రావడం చాలా సాధారణం. మామూలు సమయాల్లో కంటే చలికాలంలో చర్మానినికి ఎక్కువ కేర్‌ అవసరం. ఈ సీజన్‌లో చర్మంలో తేమ లేకపోవడంతో కాస్తంత గీరగానే తెల్లటి చారికలు పడటం కనిపిస్తుంది. అందుకే చలికాలంలో చర్మం తాజాగా, ఆరోగ్యంగా ఉంచేందుకు ఏం చేయాలంటే..

కొబ్బరినూనె, తేనె కలిపి పెదవులపై రాసి, మసాజ్ చేయాలి. రోజులో కొన్నిసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పెదవులు పొడిబారడం, పగుళ్ల సమస్యలు తగ్గి, మృదువుగా అవుతాయి.

► రెండు టేబుల్ స్పూన్ల తేనెలో, రెండు టీ స్పూన్ల పచ్చి పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, గొంతుకు, మెడకు ప్యాక్ వేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.

► చలికాలంలో ఉదయం, సాయంత్రం మంచుకురుస్తున్నా... మధ్యాహ్నపు ఎండ తీక్షణంగా గుచ్చుతున్నట్టుగా ఉంటుంది. ఈ మంచుకూ, మధ్యాహ్నపు ఎండకూ నేరుగా ముఖచర్మం ఎక్స్‌పోజ్‌ కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఈ కాలంలో ఉండే మంచు, పొగ కలిసిన కాలుష్యం...స్మాగ్‌లోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. తేలికపాటి వ్యాయామం వల్ల ముఖానికి తగినంత రక్తప్రసరణ జరిగి ముఖం తాజాగా మారుతుంది. 

► స్నానానికి అరగంట ముందు ఒంటికి ఆలివ్‌ లేదా కొబ్బరి నూనె పట్టించాలి. స్నానానికి మాయిశ్చరైజింగ్‌ సబ్బు/గ్లిజరిన్‌ బేస్‌డ్‌ సబ్బు మంచిది.

► రోజూ రెండు లీటర్లకు తక్కువ కాకుండా నీటిని తాగాలి. అసలే చల్లటి వాతావరణం కారణంగా ఈ కాలంలో నీటిని తాగడం తగ్గుతుంది. కాబట్టి చర్మం పటుత్వాన్ని , తేమను కోల్పోయి మరింత గరుగ్గా కనిపిస్తుంది. అందుకే తగినంత నీరూ తాగాలి. పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆకుపచ్చటి రంగులో ఉండే ఆకుకూరలు (గ్రీన్‌లీఫీ వెజిటబుల్స్‌) ఎక్కువగా తినాలి. 

► ఈ సీజన్‌లో దొరికే పండ్లను తప్పక తీసుకోవాలి. ఇందులోని నీటిమోతాదులూ, పోషకాలూ, యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచి ముఖాన్ని తాజాగా కనిపించేలా చేస్తాయి. 
డ్రైఫ్రూట్స్‌ పరిమితంగా తీసుకుంటూ ఉండాలి. అందులో జీడిపప్పు వంటి కొవ్వులు ఎక్కువగా ఉండే నట్స్‌ కంటే బాదం పప్పు వంటి కొవ్వులు తక్కువగా ఉండే నట్స్‌ ఎక్కువగా తీసుకోవాలి.

చలికాలంలో విటమిన్‌-ఇ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.  విటమిన్‌ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, చర్మ సమస్యల నుంచి రక్షణ కల్పించే లక్షణాలు కలిగి ఉంటుంది. అంతేకాకుండా వృద్ధాప్యఛాయలు, ఎండవల్ల  కమిలిన చర్మానికి చికిత్సనందిస్తుంది. ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ను నిరోధించి ఇమ్యునిటీని పెంచడంతోపాటు చర్మ ఆరోగ్యాన్నిపెంపొందిస్తుంది. 

>
మరిన్ని వార్తలు