Bihar: కల్యాణ మండపంలో రక్తదాన శిబిరం.. దాతలుగా బంధువులు!

24 Jan, 2024 12:28 IST|Sakshi

మన దేశంలో జరిగే పెళ్లి వేడుకల్లో కానుకలు ఇచ్చిపుచ్చుకోవడమనేది సాధారణమే. అయితే బీహార్‌లో విచిత్రమైన కానుకల డిమాండ్‌తో ఒక వివాహం జరిగింది. స్థానికంగా ఇది చర్చకు దారితీయడంతోపాటు పదిమందికీ ఆదర్శంగానూ నిలిచింది. 

బీహార్‌లోని ఔరంగాబాద్‌లో ఓ వివాహ వేడుకలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. రక్తదానం చేస్తేనే.. ఊరేగింపుగా వధువు ఇంటికి వస్తానని వరుడు కండీషన్‌ పెట్టాడు. ఇది విన్నవెంటనే వధువు తరపువారు మొదట ఆలోచనలో పడ్డారు. తరువాత వరుని మాటను మన్నించి, ఆడపిల్ల తరపువారంతా రక్తదానం చేసి, పెళ్లి ఘనంగా జరిపించారు.  

ఈ ఘటన ఔరంగాబాద్ జిల్లాలోని హస్పురాలో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి హస్పురాకు చెందిన అనీష్, అర్రాకు చెందిన సిమ్రాన్‌కు వివాహం నిశ్చయమయ్యింది. కాగా అనీష్ ఈ ‍ప్రాంతంలో అత్యధికంగా రక్తదానాలు చేయిస్తూ ‘రక్తవీర్’ అనే పేరు పొందాడు. తన పెళ్లి సందర్భంగా పదిమందితో రక్తదానం చేయించాలని అనుకున్నాడు. వెంటనే ఈ విషయాన్ని వధువు తరపు వారికి తెలియజేశారు. రక్తదానానికి సిద్ధమయితేనే ఈ పెళ్లి జరుగుతుందంటూ ఆడ పెళ్లివారికి కబురంపాడు. దీనికి ఆడపెళ్లివారంతా సమ్మతి తెలిపారు. 

 పట్నాలోని నిరామయ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ రంజన్ వచ్చి పెళ్లివారింట రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 70 మందికి పైగా బంధువులు రక్తదానం చేశారు. తన జీవితంలో తొలిసారిగా ఇలాంటి రక్తదాన శిబిరాన్ని చూశానని డాక్టర్ రాకేష్ తెలిపారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్‌కు చెందిన గణేష్ కుమార్ భగత్, అతని బృందం మాట్లాడుతూ రక్తం కొరతతో ఎవరూ చనిపోకూడదనే లక్ష్యంతోనే ఈ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. వివాహ వేడుకల్లో ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తే బాగుంటుందని పేర్కొన్నారు.
 

whatsapp channel

మరిన్ని వార్తలు