మనుషులు ఊరికే ఉండరు: హ్యాట్సాఫ్‌ సీతాదేవి!

27 May, 2021 14:35 IST|Sakshi

కొన్ని సంఘటనలు మనుషుల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. చెన్నైకి చెందిన 36 ఏళ్ల సీతాదేవిని కూడా ఒక సంఘటన ఇలాగే ప్రభావితం చేసింది. మే 1, 2021న ఆమె తన తల్లిని తీసుకుని పార్క్‌టౌన్‌లో ఉండే గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌కు వెళ్లింది. తల్లికి కరోనా వచ్చింది. ఆక్సిజన్‌ అందడం లేదు. ఆ సమయంలో కరోనా కేసులు చెన్నైలో ఉధృతంగా ఉన్నాయి. పేషెంట్లు చాలా మంది గవర్నమెంట్‌ హాస్పిటల్‌కు వచ్చి ఉన్నారు. సీతాదేవి ఎంత తొందర చేసినా ఆమెకు అడ్మిషన్‌ దక్కలేదు. కొన్ని గంటలపాటు హాస్పిటల్‌ బయటే శ్వాస అందక సీతాదేవి తల్లి బాధ పడింది.

ఇక లాభం లేదనుకుని వేరే హాస్పిటల్‌కు తీసుకెళ్లి చేర్చింది తల్లిని సీతాదేవి. అయితే ఆ వెంటనే ఆమె చనిపోయింది. సీతాదేవికి కోపం వచ్చింది. దుఃఖం వచ్చింది. హాస్పిటల్‌లో తన తల్లికి ఆక్సిజన్‌ అంది ఉంటే ఆమె బతికేది కదా అనిపించింది. అదే సమయంలో రోజూ ఎంతోమంది హాస్పిటల్‌లో అడ్మిషన్‌ కోసం వచ్చి ఆ తతంగం పూర్తయ్యే దాకా ఆక్సిజన్‌ అందక అవస్థలు పడుతున్నారని ఆమెకు అర్థమైంది. వారి కోసం ఏదైనా చేయాలని వెంటనే నిశ్చయించుకుంది.

ఆక్సిజన్‌ ఆటో
సీతాదేవి చెన్నైలో కొంత కాలంగా ఒక చిన్న ఎన్‌.జి.ఓ నడుపుతోంది. హెచ్‌ఐవి పేషెంట్ల కోసం పని చేస్తుందా ఎన్‌.జి.ఓ. వారి కోసమని ఒక ఆటోను ఏర్పాటు చేసిందామె. ఇప్పుడు కోవిడ్‌ పేషెంట్ల కోసం ఒక ఆక్సిజన్‌ ఆటోను నడపడానికి నిర్ణయించుకుంది. వెంటనే ఒక కొత్త ఆటోకు ఆక్సిజన్‌ సిలిండర్‌ బిగించి ఏ గవర్నమెంట్‌ హాస్పిటల్‌ బయట అయితే తల్లి ఆక్సిజన్‌ కోసం అవస్థ పడిందో అదే హాస్పిటల్‌ బయట ఆ ఆటోను నిలబెట్టసాగింది. హాస్పిటల్‌లో అడ్మిషన్‌ కోసం వచ్చిన పేషెంట్లు ఆక్సిజన్‌ అందక బాధపడుతుంటే ఈ ఆటో ఎక్కి ఆక్సిజన్‌ పెట్టుకోవచ్చు. పూర్తిగా ఉచితం.

ఎంతమంది వస్తే అంతమంది ఒకరి తర్వాత ఒకరు ఇక్కడ ఆక్సిజన్‌ పెట్టుకోవచ్చు. ఆక్సిజన్‌ ఆటో హాస్పిటల్‌ దగ్గరే ఎప్పుడూ ఉంటుంది. ఆక్సిజన్‌ సిలిండర్‌ ఖాళీ అయితే ఇంకో సిలిండర్‌ వెంటనే సిద్ధమవుతుంది. ‘నేను ఆక్సిజన్‌ ఆటో మొదలెట్టాక ఎంతోమంది ఆక్సిజన్‌ తీసుకుంటున్నారు. అచ్చు మా అమ్మలాంటి ఒకామె నా ఆటోలో కూచుని ఆక్సిజన్‌ పొంది బెడ్‌ కన్ఫర్మ్‌ అయ్యాక హాస్పిటల్‌లోకి వెళ్లింది. అంతవరకూ ప్రాణాలు కాపాడినందుకు ఆమె కళ్లల్లో కనిపించిన కృతజ్ఞత మర్చిపోలేను’ అంటుంది సీతాదేవి. మనుషులు కొందరు ఊరికే ఉంటారు. కొందరు ఊరికే ఉండలేరు. ఆ ఊరికే ఉండలేని వారి మానవత్వం వల్లే ఈ జగతి నడుస్తూ ఉంటుంది.

చదవండి: రికార్డు కోసం కాదు నా పిల్లల కోసం..

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు