శాస్త్రీయ నృత్యంతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు! అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు!

13 Mar, 2024 11:52 IST|Sakshi

భరత నాట్యం నుంచి కూచిపూడి వరకు భారతీయ శాస్త్రీయ నృత్యాలలో వ్యాయామానికి సమానమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ తరం శాస్త్రీయ నృత్యాలపై ఆసక్తి ప్రదర్శిస్తోంది. నృత్య సాధనతో ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకుంటుంది. ముంబైలో ఎంబీఏ చేస్తున్న శివానీ దీక్షిత్‌కు ఏ చిన్న పనిచేయాలన్న బద్దకంగా అనిపించేది. దీని వల్ల చదువు కూడా దెబ్బ తినే ప్రమాదం ఏర్పడింది. తన కజిన్‌ సలహా ప్రకారం అయిష్టంగానే భరతనాట్యం నేర్చుకోవడం మొదలు పెట్టింది. మొదట్లో ఎలా ఉన్నా ఆ తరువాత మాత్రం భరతనాట్యంపై దీక్షిత్‌లో అంతకంతకూ ఇష్టం పెరుగుతూపోయింది.

‘నేను ఎప్పుడూ వ్యాయామాలు చేయలేదు. అయితే భరతనాట్యం వల్ల ఎన్నో వ్యాయామాలు ఒక్కసారే చేస్తున్నట్లుగా అనిపించింది. బద్దకాన్ని వదిలించుకున్నాను. మనసు తేలిక అయినట్లుగా ఉంది’ అంటుంది శివానీ దీక్షిత్‌. ‘అధిక బరువుతో బాధ పడుతున్న నాకు కథక్‌ నృత్యం కాంతి కిరణంలా కనిపించింది. కథక్‌ నృత్య సాధనతో బరువు తగ్గడం సంతోషంగా ఉంది. కథక్‌ డ్యాన్స్‌ అనేది మచ్‌ మోర్‌ దెన్‌ ఏ వెయిట్‌ లాస్‌ ఎక్సర్‌సైజ్‌ అనేది నా అభిప్రాయం. బరువు తగ్గడానికే కాదు బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ల విషయంలోనూ కథక్‌ ఉపయోగపడుతుంది’ అంటుంది కోల్‌కతాకు చెందిన ఇరవై రెండు సంవత్సరాల నయనిక.

బరువు తగ్గడానికి ఉపయోగపడే ఒడిస్సీ, జాజ్, కాంటెంపరీ వెస్ట్రన్‌ డ్యాన్స్‌లను కలిపి ఒక డ్యాన్స్‌ ఫామ్‌ రూపొందించినట్లు తెలుసుకున్న నయనిక ప్రస్తుతం ఆ సమ్మేళన నృత్యరూపం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉంది. ‘కేవలం బరువు తగ్గడానికే  కాదు ఏకాగ్రతను పెంచడంలో,  జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో శాస్త్రీయ నృత్యాలు ఉపయోగపడతాయనే విషయాన్ని నృత్యసాధన ద్వారా  స్వయంగా తెలుసుకున్నాను.  శాస్త్రీయ నృత్యకదలిలకు చేతులు, కళ్ల మధ్య సమన్వయం అవసరం. ఇది ఆటోమెటిగ్‌గా ఏకాగ్రతను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది’ అంటున్నాడు బెంగళూరు చెందిన ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ సందేష్‌ సృజన్‌.

శివానిక్‌ దీక్షిత్, నయనిక, సందేశ్‌ సృజన్‌ల మాటలు శాస్త్రీయ నృత్యాల పట్ల యువతరం చూపుతున్న ఆసక్తికి అద్దం పడతాయి. ‘మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన శాస్త్రీయ నృత్యాల జాబితా పెద్దది. ప్రతి నృత్యానికి తనదైన వేషధారణ, అలంకరణ, సంగీతం ఉంటాయి. శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకునే విధానం చాలా కఠినమైనది. దీనికి తగిన సమయం, శక్తి అవసరం. శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడానికి ఆసక్తి మాత్రమే కాదు అంకితభావం చాలా ముఖ్యం, నృత్యం అనేది శారీరక, మానసిక ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. శాస్త్రీయ నృత్య రూప శైలి ఒకదానికొకటి భిన్నంగా ఉన్నప్పటికీ అభ్యాస ప్రక్రియ కండరాలను బలోపేతం చేస్తుంది.

భరతనాట్యం, కూచిపూడి, మోహినియాట్టంలాంటి శాస్త్రీయ నృత్యరూపాలను సాధన చేయడం ద్వారా  మజిల్‌ ఇంప్రూమెంట్‌ ఉంటుంది. రెగ్యులర్‌ ప్రాక్టీస్‌ శరీరంలోని ఆక్సిజన్‌ స్థాయులను పెంచడంలో సహాయపడుతుంది’ అంటుంది ప్రోఫెషనల్‌ క్లాసికల్‌ డ్యాన్సర్, ట్రైనర్‌ కీర్తి దివాకరన్‌.  కేరళ కొచ్చీలోని వైనవి నృత్యకళాక్షేత్రం వ్యవస్థాపకురాలు కీర్తి.‘డ్యాన్సింగ్‌ అనేది న్యూరో–మస్క్యులార్‌ బ్యాలెన్స్‌ను వృద్ధి చేయడంలో సహాయపడుతుంది’ అంటుంది క్లాసికల్‌ డ్యాన్సర్, ట్రైనర్, కోజికోడ్‌లోని గౌరీశంకరం క్లాసికల్‌ డ్యాన్స్‌ థెరపీ ఇన్‌స్టిట్యూట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా. ప్రియా మేనన్‌.

శాస్త్రీయ నృత్యరూపకాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అప్లైడ్‌ రిసెర్చ్‌ పేపర్‌ ప్రకారం... ఏదైనా వర్కవుట్‌ పదినిమిషాల ఒడిస్సీ డ్యాన్స్‌తో సమానం. డ్యాన్స్‌లో భాగంగా కాళ్ల నుంచి మెడ వరకు అన్నీ కదులుతాయి. గంట ఒడిస్సీ నృత్యం 250 కేలరీలు ఖర్చు కావడానికి కారణం అవుతుంది. ‘సైన్స్‌ అండ్‌ జర్నల్‌’లో ప్రచురితమైన రిసెర్చ్‌ పేపర్‌ ప్రకారం నాన్‌–డ్యాన్సర్‌లతో పోల్చితే కథక్‌ డ్యాన్సర్‌ల శరీర బరువు, బాడీ మాస్‌ ఇండెక్స్‌... మొదలైన వాటికి సంబంధించి  బాడీ కంపోజిషన్‌ మెరుగ్గా ఉంటుంది. కథక్‌ డ్యాన్స్‌లోని క్విక్‌ ఫుట్‌ వర్క్‌ వల్ల ఒత్తిడి మాయం అవుతుంది.

వ్యాయమాలతో కూడిన డ్యాన్స్‌ అనగానే ఒకప్పుడు జాజ్, లైన్‌ డ్యాన్స్, హిప్‌ హప్, సల్సా... మొదలైన వెస్ట్రన్‌ డ్యాన్స్‌లు మాత్రమే గుర్తొచ్చేవి. ‘ఎక్కడి దాకో ఎందుకు మన దగ్గరే బోలెడు శక్తిసంపద ఉంది’ అని గ్రహించిన యువతరం మన శాస్త్రీయ నృత్యాలకు దగ్గరవుతోంది. సాధన చేస్తోంది. ఆరోగ్య భాగ్యానికి చేరువ అవుతోంది.

బాడీ బయో మెకానిక్స్‌
బాడీ బయోమెకానిక్స్‌ను బాగా అర్థం చేసుకోవడం డ్యాన్సర్‌ కమ్యూనిటీకి ముఖ్యం అంటుంది మధుమతి బెనర్జీ. భరతనాట్య కళాకారిణీ అయిన బెనర్జీ ఎన్నో దేశాలలో ప్రదర్శనలు ఇచ్చింది. ఇండియన్‌ క్లాసికల్‌ అండ్‌ ఫోక్‌ మ్యూజిక్‌లో కూడా ప్రావీణ్యం సాధించింది. శాస్త్రీయ నృత్యాలు నేర్చుకోవడానికి అవసరమైన స్ఫూర్తిని యువతరానికి ఇస్తోంది.

నృత్యం ధ్యాన సాధనం..
‘రోల్‌ ఆఫ్‌ ఇండియన్‌ క్లాసికల్‌ డ్యాన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌’ పేరుతో రిమ్లీ భట్టాచార్య ఒక ఆర్టికల్‌ రాసింది. ‘భారతీయ శాస్త్రీయ నృత్యం మన విద్యా విధానంలో భాగంలో కావాలి. ఇది మన సంస్కృతికి సంబంధించిన  శక్తిరూపమే కాదు అద్భుతమైన ధ్యాన సాధనం కూడా. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ఏకాగ్రత, సృజనాత్మకతను పెంపొందించడానికి శాస్త్రీయ నృత్యం ఉపయోగపడుతుంది.

డ్యాన్స్‌ మూమెంట్స్‌తో శారీరక దృఢత్వం కలుగుతుంది. శరీరంపై నియంత్రణ పెరుగుతుంది. అంతర్గత భావాలను వ్యక్తీకరించే పద్ధతి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి’ అంటుంది రిమ్లీ భట్టాచార్య. మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో గోల్డ్‌ మెడలిస్ట్‌ అయిన రిమ్లీ ఎంబీఏ చేసింది. కార్పోరేట్‌ సెక్టార్‌లో పనిచేసింది. మానసిక ఆరోగ్యంపై ఎన్నో వ్యాసాలు రాసింది. ‘ఏ బుక్‌ ఆఫ్‌ లైట్‌’ పేరుతో పుస్తకం ప్రచురించింది. 

(చదవండి: నర్సు వెయిట్‌ లాస్‌ స్టోరీ..ఆ ఒక్క ఎక్స్‌ర్‌సైజ్‌తో జస్ట్‌ ఒక్క ఏడాదిలోనే..)

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers