క్రీస్తు బలియాగం వెనుకున్న పరమార్థం ఇదే..!

29 Mar, 2024 06:58 IST|Sakshi

క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానాల వెనుక దేవుని దివ్య సంకల్పం ఉంది. దీన్నే సువార్త అంటారు. సువార్త దేవుని సంకల్పంతో ఎప్పుడూ ముడిపడే ఉంటుంది. పూర్వపు దేవుని సంకల్పం చెప్పక దాన్ని దాటవేసే సువార్త అసలు లెస్సయైన లేఖనానుసార సువార్తగా ఎప్పటికీ కానేరదు. సువార్త పుట్టుకకు ఆయువుపట్టు వంటి దేవుని ప్రణాళికను చాలా పకడ్బందీగా, పటిష్టంగా వివరించకున్ననూ అది సువార్త కాదు. సత్యవాక్యం అనే రక్షణ భాగ్యపు సువార్త ప్రకటన అపొస్తలుల బోధకు లోబడే ఉండి తీరాలి. 

వారపు ప్రప్రథమ దినం అనే ప్రతి ఆదివారం నాడు యెడతెగక దేవుని ఆరాధనలో భాగంగా జరిగే రొట్టె విరుచుట అనేది క్రీస్తు బలియాగానికి గుర్తు. క్రీస్తు పస్కా బలి పశువుగా, వధకు సిద్ధమైన గొఱె<పిల్లగా అనాదిలోనే దేవుని చేత నిర్ణయించబడినవాడు. అది క్రీస్తు మరణంతో నెరవేరుటను నేడు మనం చూస్తున్నాం. క్రీస్తు వారి నలగగొట్టబడిన శరీరానికి గుర్తుగా రొట్టెను, మానవాళి కొరకు చిందించబడిన పవిత్ర రక్తానికి గుర్తుగా ద్రాక్షరసాన్ని... ఇలా రెండింటిని కృతజ్ఞతాపూర్వక ్ర΄ార్థనలతో తీసుకుంటూ ప్రభువు వచ్చువరకు ఇలా చేస్తూ క్రీస్తు సిలువ యాగాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంది క్రీస్తు ప్రభువు వారి సంఘం. నిజానికి ఇది భోజనం, పానం కాదు. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ సంబంధిత ఆత్మానందం

ఇహమందు కాక ఈ లోక సంబంధులుగా కాక పరలోక సంబంధులుగా సంఘమనే దేవుని రాజ్యంలో జరుపుకొనే పండుగ. సంఘ భవనంలోనే ఇది జరిగినా కూడ సత్య లేఖనాల సారం ప్రకారంగా ఇది ఇహమందు అద్వితీయ సత్యదేవుడు, ఆయన నియమించిన రాజు ప్రధాన యాజకుడైన క్రీస్తు వారి సమక్షంలో జరిగే అత్యున్నత సంఘ కార్యక్రమం. సంఘం అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారని అర్థం. ఇట్టి ఆదివారపు దేవుని ఆరాధనతో సంఘం పరిశుద్ధంగా, ఆత్మ సంబంధంగా అన్నింటా బలపడుతూ ఉంటుంది.

ఈ జగత్తుకు పునాది వేయక పూర్వమే దేవుని ఆలోచనలలో ఉన్న క్రీస్తు బలియాగం అనే ‘పథక రచన’ గూర్చి ఎంతగా  చెప్పుకొన్నా, అది తక్కువే. తన ప్రజల పాప పరిహారార్థం అద్వితీయ జ్ఞానసంపన్నుడైన దేవుడు అనాదిలోనే క్రీస్తు పరిశుద్ధ రక్తానికి రూపకల్పన చేయడం జరిగింది. అప్పటికి ఇంకా మానవ సృష్టి జరగలేదు. భూలోకమే లేదు. భూమి మీద మనుష్యుల జాడే లేదు. రూపమే లేదు. దీన్నే క్రీస్తు కేంద్రంగా చేయబడిన దేవుని నిత్య సంకల్పంగా చెబుతారు. క్రీస్తు లేకుంటే దేవునికి సంకల్పమే లేదు అనేంత ఉన్నతం గా దీన్ని గూర్చి చెప్పుకోవడం మాత్రం అసాధారణం. తండ్రియైన యెహోవా దేవుడు తన నీతిని బట్టి సంతోషం గలవాడై ఘనపరచి గొప్ప చేసిన ఉపదేశ క్రమం సంబంధిత సంకల్పాన్ని మించిన భావజాలం లేదా భావ సంపద మరొకటి లేదంటారు.

దేవుని దృష్టి కోణంలో  దేవుని మనస్సుతో దేవుని గ్రంథాన్ని లోతుగా అధ్యయనం చేసే వారికి ఒక విషయం తేటగా అర్థం అవుతుంది. అదేమిటంటే, దేవుడు అన్యాయం చేయుట అసంభవం అనునదే. ఈ సత్యాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకొన్నవారే ఆత్మ సంబంధులు. బలిని కాక కనికరమునే కోరే దేవుడు ప్రారంభంలో జంతుబలులను ఏర్పాటు చేసినా కూడా యుక్త కాలాన తన సొంత కుమారుడను బలిగా ఆర్పించుట ద్వారా ఇలా పాపవ్యాప్తి నివారణకు మేలైన శాశ్వత పరిష్కారం కనుగొని జంతు బలులకు చరమగీతం పలికాడు. యూదులకు చాలా సహజంగా సామాన్యంగా చెప్పే సత్యం ఒకటుంది. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. ఇది నమ్మే యూదులు మెస్సీయ బలిని కనులారా చూడటం ద్వారా విస్మయానికి గురయ్యారు.

మహాదేవుని సంకల్పానికి బహు ముగ్ధులై ఐశ్వర్య భయంతో వినయ సంపన్నులైన వారంతా తలలు వంచి దేవుని ΄ాదాల చెంత సాగిలపడ్డారు. మానవాళి అంతా పుట్టారు కాబట్టి చని΄ోతారు. యేసుక్రీస్తు మరణించడానికే పుట్టాడంటూ పండిత పెద్దలు పదే పదే చెబుతుంటారు. ఇదే ఆయన జీవితం ప్రత్యేకత. ఇలాంటి జీవితం ఈ భూమి మీద ఏ ఒక్కరికీ లేదన్నదే సుసమాచారం. క్రీస్తు ఈ లోకానికి చెప్పశక్యం కాని ఒక వరంగాను ఆయన సాహసోపేత విధేయత తాలూకు ప్రాణత్యాగం మానవాళి పాలిట శుభవార్తగానూ చరిత్రకెక్కిందనేది గమనార్హం. బాల్యం నుండే కాక, మూడున్నర సంవత్సరాల తన యౌవన కాలమంతా దేవునికి వెచ్చించి విధేయుడైన వాడై తన్ను తాను దేవునికి అర్పణగా సమర్పించుకున్నాడు. ‘నీ చిత్తమే సిద్ధించును గాక!’ అంటూ మరణానికి ఎదురుగా వెళ్ళిన అరుదైన జీవితం క్రీస్తు ప్రభువుది.

లోక పాపాలను మోసుకొనిపోయే దేవుని గొఱె పిల్లగా, పస్కా బలి పశువుగా క్రీస్తును అభివర్ణిస్తుంది పరిశుద్ధ బైబిలు. దేవునికి అవిధేయులైన మానవాళి పాపాలు గొఱె పిల్లపై మోపబడ్డాయి. ఫలితంగా గొఱె పిల్ల మరణించింది. క్రీస్తుకు ఇందుకొరకే శరీరం ఇవ్వబడింది లేదా అమర్చబడింది. దేవుని ప్రజల పాపాలకు ప్రతిగా వారి పక్షాన సిలువలో క్రీస్తు శరీరాన్ని శిక్షకు గురి చేయడం ద్వారా దేవుని ప్రజలు తమ తమ పాపాల నుంచి విమోచించబడి పరిశుద్ధులయ్యారు. క్రీస్తు మరణం వెనుక దాగిన సువిశేష పరమార్థం ఇదే.

మానవ ప్రారంభ ఆదాము అనే ఒకని అవిధేయత ద్వారా లోకంలోనికి పాపం ప్రవేశించింది. కడపటి ఆదాము అనే ఒకని విధేయత ద్వారా యావత్తూ అవిధేయ మానవాళికి రక్షణ భాగ్యం సం్ర΄ాప్తించింది. వారంతా కొత్త జన్మతో నూతన సృష్టిగా పరివర్తన చెందారు. ఆ కడపటి ఆదామనే క్రీస్తు సాహసోపేత జీవిత విధానమే ఎల్లరకు పరిశుద్ధ జీవితాలను అనుగ్రహించింది.ఈ దిగువ గల యెషయా భవిష్యత్‌ ప్రవచనం దాని వర్ణన అత్యున్నతమైన క్రీస్తు విధేయత జీవిత సారాన్ని అసాధారణ రీతిలో వెల్లడి చేయుట అనేది మనస్సు పెట్టి గమనించదగ్గది. బలియాగంలో క్రీస్తు చూపిన విధేయత ఇప్పటికీ వేనోళ్ళ కొనియాడబడుతునే ఉండుట బహు ఆశ్చర్యకరం! ఈ ప్రవచనం క్రీస్తు నందు 
నెరవేరింది.

‘‘అతడు దౌర్జన్యము నొందెను
బాధింపబడినను అతడు నోరు తెరువలేదు
వధకు తేబడు గొఱెపిల్లయు
బొచ్చు కత్తిరించు వాని యెదుట గొఱె<యు
మౌనముగా నుండునట్లు
అతడు నోరు తెరువ లేదు
అన్యాయపు తీర్పు నొందిన వాడై
అతడు కొనిపోబడెను
అతడు నా జనుల యతిక్రమమును బట్టి
మొత్తబడెను గదా’’ 

ఒకనాడు దేవుడు ఆజ్ఞాపించి చేయమన్న ఇహలోక భూ భౌతిక సంబంధ పండుగల కంటె మిన్నగా  ఆత్మ సంబంధ పండుగను ఒకటి నిర్ణయించి నేడు ఉన్నతంగా ఆచరించమని తన గ్రంథం ద్వారా ఆజ్ఞాపిస్తున్నాడు. అదే క్రీస్తు పస్కా పండుగ. ఇది హృదయానందానికి సంబంధించినది. ఇది ఎక్కడా ప్రసిధ్ధి చెందినట్టుగా బహు ప్రాచుర్యంలో ఉన్నట్టుగా లోకంలో కనబడదు. క్రీస్తు పస్కా పండుగ ఒకటి ఉందనేది లోకానికి తెలియదు. ఎందుకంటే ఇది ఆత్మసంబంధమైనది. దేవుని రాజ్యం దానిని పొందిన వారి అంతరంగానికి మాత్రమే అందే కార్యం. ఇది తన తోటి వారికి, పక్కవారికి, అన్యులకు ఏనాడూ అంతు చిక్కని కార్యం. ఇది జీవం గల దేవుని సంఘంలో క్రీస్తును బట్టి క్రీస్తు ద్వారా క్రీస్తునందు జరిగే ఉన్నతమైన కార్యక్రమం. 

ఈ అరుదైన సృష్టిలో,  బిడ్డను నవ మాసాలు మోసిన కన్న తల్లి అతన్ని భూమి మీద విడిచి పెట్టి కన్ను మూసింది. అతడు పెద్దవాడై తన తల్లి పట్ల నిత్యమూ కృతజ్ఞతాభావం కలిగిన వాడై ఆమె ఆలోచనలు, ఆశయాలు అన్వేషిస్తూ వాటి సాధనలో నిత్యమూ నిమగ్నమవడమే కాకుండా, తన తల్లి వలె ఏ ఒక్కరూ రక్త హీనతతో చనిపోకుండా పుష్ఠినిస్తూ బలవృద్ధి కలుగజేసే బహు మేలైన ఉచిత సేంద్రీయ సహజాహార పంపిణీకి దృఢ సంకల్పంతో నడుం కట్టాడు. తన తల్లి మరణాన్ని ఒక పండుగగా, వేడుకగా మలిచే పనిలో సత్క్రియలయందాసక్తితో అతడు సమాజంతో ప్రేమలో పడ్డాడు.

‘ఆమె మరణించి మనకు దూరం కాలేదు. ఇదిగో ఇక్కడే ఉంది నవ్వుతూ అన్న భావనను కుటుంబంలోను, బంధు మిత్రులలోనూ ఆమె కొడుకు కలుగజేసిన వైనం అతనిదైన సృజనాత్మక కళాత్మక పనితనమనే చెప్పాలి. అది చూసి ఊరు ఊరంతా ఆ మహాతల్లి త్యాగం వూరికే పోతుందా అనే వారే అంతటా. తన మాతృమూర్తి ప్రేమను అతడు సెలబ్రేట్‌ చేయబూనే వైవిధ్య విధానానికి తెరలేపడం వలన అంతా మంత్ర ముగ్ధులయ్యేలా అది ఊరంతా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అమ్మ అజెండా సాధనే ధ్యేయంగా పిల్లవాడి ప్రయాసకు అంతా జత కలిశారు. యేసు ప్రాణ త్యాగం అచ్చు ఇలాంటిదే. సెలబ్రేట్‌! జీసస్‌ సెలబ్రేట్‌!
– జేతమ్‌ 

(చదవండి: Good Friday 2024 ప్రాముఖ్యత, ‘హ్యాపీ గుడ్ ఫ్రైడే' విషెస్‌ చెప్పకండి!)

Election 2024

మరిన్ని వార్తలు