అదిగో అయోధ్య... అల్లదిగో అయోధ్య

18 Jan, 2024 11:21 IST|Sakshi

రాముడు శ్రీరాముడు సకల గుణాభిరాముడు రాఘవుడు... ఇన్ని నామాంతరాలు ఉన్న ఆ దశరథ రాముడు... ఆ రోజున తెల్లవారుజామునే మేల్కొన్నాడు... సరయూ జలాలలో అభ్యంగన స్నానం ఆచరించాడు... అల్లలాడుతున్న అలకలను సరిచేసుకున్నాడు...సూర్య వంశ చిహ్నంగా నుదుటన రవి తిలకం ధరించాడు రవికులుడు... చల్లని వెన్నెలలు చిలకరించే రాజీవాక్షాలకు నల్లని కాటుక అలదాడు..సీతమ్మకు ఆనవాలుగా పంపిన అంగుళీయకాన్ని వేలికి ధరించాడు... 

తన పట్టాభిషేక సమయానికి సిద్ధం చేయించిన వస్త్రాలు ధరించాడు.. నాడు భరతుడు సింహాసనం మీద ఉంచి పరిపాలన కొనసాగించిన పాదుకలలో పాదాలుంచాడు... బాల్యంలో చందమామ కావాలి అని మారాము చేసినప్పుడు అద్దంలో చందమామను చూపిన ఆ అద్దంలో ఇప్పుడు ఈ రామచంద్రుడు తన ముఖ బింబాన్ని చూసుకుని... చిరునవ్వులు చిందిస్తూ... గడప దాటి బయటకు అడుగు పెట్టబోతున్నాడు... సరిగ్గా అదే సమయానికి... గుమ్మం ముందర కవి సమూహం లోపలకు వస్తూ కనిపించారు.

వారికి వినమ్రపూర్వకంగా నమస్కరించి, లోపలకు ఆహ్వానించి, సముచిత స్థానాలు చూపి, ఆసీనులను చేసి, తాను కూడా గౌరవముద్రలో సింహాసనం అధిరోహించాడు..
అందరూ విశ్రాంతులైన పిదప... ‘వాల్మీకి మహర్షీ! మహానుభావులంతా ఒక్కసారే విచ్చేశారు. కారణం తెలుసుకోవచ్చా’ అని వినమ్రంగా ప్రశ్నించాడు. వాల్మీకి తన గుబురు శ్మశ్రువుల మాటు నుంచి చిన్నగా నవ్వుతూ, ‘ఏమయ్యా! నువ్వు ఇంత తొందరగా ఏదో పని మీద బయలుదేరినట్టున్నావు. విషయం తెలుసుకోవచ్చా’ అన్నాడు ఏమీ ఎరగనట్లు.

‘మహర్షీ! ఏమీ ఎరగనట్లు ప్రశ్నిస్తున్నారు. మీరే కదా నా కథను లవకుశల ద్వారా గానం చేయించి ప్రపంచానికి పరిచయం చేసింది. నాకు ఎంతటి మంచి లక్షణాలు ఉండాలో కూడా మీరే నిర్దేశించారు కదా. అటువంటి మీకు నేను ఎప్పుడు, ఎక్కడకు వెళ్తానో తెలియదా. నా నోటితో చెప్పించాలనే  ఆలోచన కాకపోతేను’ అన్నాడు వాల్మీకి మహర్షితో చనువుగా.

‘నాకు తెలుసు రామా! నీ వినయం, విధేయత, గౌరవం... అన్నీ. ఈ రోజు ఇక్కడకు వచ్చినవారిని గమనించావా. వీరంతా నీ కథను ఇన్ని వేల సంవత్సరలుగా సజీవంగా ఉంచిన మహానుభావులు. నేను రాసిన కథను యథాతథంగా ఉంచకుండా, వారికి తోచిన కల్పనలు కూడా చేశారు. వీరందరికీ నువ్వంటే ప్రీతి. అందుకే వారి మనసుకి నచ్చిన విధంగా నిన్ను కీర్తించారు.

నిన్ను నెత్తిన పెట్టుకుని నేటికీ ‘రామాయణం’ అనే కావ్యాన్ని ‘రామ’ అనే తారక మంత్రాన్ని ఇంకా పచ్చిగా, లేతగా, తడి ఆరకుండా ఉంచారు... అని వాల్మీకి పారవశ్యంతో పలుకుతుంటే, రాముని శరీరం పులకించిపోయింది. రామా! నీకు ఒక్కొక్కరినీ మరోసారి పరిచయం చేస్తాను. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్లే సంతోషంలో ఉన్నావు. అందువల్ల నేను పరిచయం చేస్తేనే కాని వారిని నువ్వు జ్ఞప్తికి తెచ్చుకోలేవు.... అంటూ పండిత పరిషత్తు వైపునకు తల పరికించాడు.

ఇదిగో మొట్టమొదటగా చెప్పవలసిన వ్యక్తి కాళిదాసు. ఈయన కవికుల గురువు. నీ గొప్పదనాన్ని ‘రఘువంశం’ అనే కావ్యంగా వెలయించాడు. మీ కుటుంబాన్ని ఎంత గొప్పగా ప్రస్తుతించాడో తెలుసా. ఆ కవిత్వమంతా ఇప్పుడు చెప్పనులే. రేఖామాత్రంగానే పరిచయం చేస్తాను. ఇక ఆ పక్కన కూర్చున్న కవి భవభూతి. ఉత్తర రామ చరిత రచించి అందరి కంట నీరు పెట్టించాడు.

ఆ పక్కనే ఉన్న భాసుడు ‘ప్రతిమ’ అనే నాటకాన్ని రచించాడు. ఆయనకు నా రామాయణంలోని కొన్ని విషయాలు నచ్చలేదు. అందుకని ఆయన కొన్ని కల్పనలు చేశాడు.కైకేయి దుర్బుద్ధికాని, లక్ష్మణుడు అవాచ్యకాలు పలకలడం కాని ఇందులో కనపడదు. దశరథ ప్రతిమా కల్పనం, దశరథ శ్రాద్ధ కలనం వంటి కొన్ని అంశాలు ఇందులోని కొత్త విషయాలు. అర్థమైందా ఈ కవి విలక్షణత. ఆయనకు కైకమ్మను నిందించాలనిపించలేదు.

సరే – ఇంక ఆ పక్కన చూడు... మురారి. ఆయనకు నా పేరు కూడా చేరింది. బాల వాల్మీకి అని పిలుస్తారు. ఎన్నో గురుకుల క్లేశాలు అనుభవించి, చివరకు కవికులంలో స్థానం సంపాదించాడు. ఆ మహానుభావుడు.. నీ తండ్రి దశరథుడిని ఎంత గొప్పగా ప్రశంసించాడో తెలుసా. ఆయనట ఏకంగా దిక్పాలకులను తన ఇంటి ముంగిట్లో బంధించేశాడు. అంటే వారికి పని లేకుండా నీ తండ్రి గారే ముల్లోకాలను సుభిక్షంగా పరిపాలించాడట.

అబ్బో ఈ కవి గురించి ఎంత చెప్పినా చాలదు. ఆయన మార్గమే వేరు. నీకు ముందు ముందు ఇటువంటి మార్గంలో వెళ్లిన మరో ఇద్దరిని గురించి చెబుతానులే.  ఇక తెలుగు కవులలోకి వస్తే...  అబ్బో... బోలెడు మంది.. తెలుగులో ఆది కావ్యం రచించిన నన్నయ మొదలుగా నిన్నమొన్నటి ఉషశ్రీ వరకు ఎంత మంది ఎంత అందంగా నీ కావ్యాన్న రచించారో. 

కవిత్రయంలో మొదటివాడైన నన్నయభట్టు మహానుభావుడు  భారత ఆంధ్రీకరణేకాకుండా నీ కథను ‘రాఘవాభ్యుదయం’ పేరిట తెలుగువారికి అందించాడు. ఆ కవిత్రయంలో రెండవ వాడైన తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’ పేరున తొట్టతొలి ప్రబంధ కావ్యాన్ని, ఒక్క వచనం కూడా లేకుండా పూర్తి పద్యంలో రచించాడు. కవిత్రయంలో మూడవ వాడైన ఎరన్ర కూడా రామాయణం కావ్యాన్ని రచించాడు.  ఇక మంత్రి భాస్కరుడు ‘భాస్కర రామాయణం’, కుమ్మరి మొల్ల ‘మొల్ల రామాయణం’, గోన బుద్ధారెడ్డి ‘రంగనాథ రామాయణం’ రచించారు.

వారంతా నీ పట్ల ప్రేమానురాగాలను కురిపిస్తున్న కన్నులతో ఎంత భక్తిగా కూర్చున్నారో చూడు. ఇక వీరందరిదీ ఒక ఎత్తయితే... ఆ మురారిలాగే నిరంకుశుడైన కవి ‘కవి సమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ’. ఆ మహానుభావుడు నీ క్రీగంటి చూపు కోసం చూస్తున్నాడు. అటు వైపుగా ఒక్కసారి నీ తల త్రిప్పు. ఈయన నీ కథను ‘రామాయణ కల్పవక్షం’ పేరున రచించి, తెలుగులో మొట్టమొదటి జ్ఞానపీఠ సత్కారాన్ని అందుకున్నాడు.

ఇంకా ఎన్నో సత్కారాలు ఉన్నాయిలే. నిన్ను తనకు కావలసిన విధంగా ప్రస్తుతించుకున్నాడు.  ఇక ఈ సభకు హాజరైన చివరివాడు ‘ఉషశ్రీ’. మురారి పంథాలో విశ్వనాథ కావ్యరచన చేస్తే, ఆ విశ్వనాథ చేత ‘ఇది ఉషశ్రీ మార్గము’ అనిపించుకుని, నిన్ను నెత్తిన పెట్టుకుని ఊరేగాడు. వాడు త్యాగ్య వాగ్గేయకారుడైతే, వీడు వాక్కావ్యకారుడు. తన నోటితో నీ కథను అందంగా చెబుతూ, తన కలంతో కూడా అంతే అందంగా నిన్ను ప్రస్తుతించాడు. 

ఇంతమంది కవులు నీ కోసం నిరీక్షిస్తుంటే... నువ్వు నీ బాల రామ ప్రతిష్ఠ కోసం పరుగులు తీయడం న్యాయమేనా. అందుకే నిన్ను లోపలకు పిలిచాను. వీరందరికీ నీ తియ్యని ఆశీర్వచనాలు కావాలి.. అంటూ వాల్మీకి పలుకుతుంటే... మరో నలుగురు పరుగుపరుగున లోపలకు ప్రవేశించారు. వారిలో ప్రథముడు కంచర్ల గోపన్న... అయ్యా! వాల్మీకి మహర్షీ! నన్ను మరచిపోతే ఎలాగయ్యా.. అంటూ పాదాల మీద వాలాడు.

వాల్మీకి ఆ గోపన్నను దగ్గరగా తీసుకుని, ‘రామభద్రా! వీడు నీ కోసం భద్రాద్రిలో ఆలయం నిర్మించాడు. నీ పేరున కీర్తనలు రచించి, గోపన్న నామాన్ని రామదాసుగా మార్చుకున్నాడు. నీ కోసం కారాగారం పాలయ్యాడు. ఎన్నో దెబ్బలు తిన్నాడు. అయితేనేం, నీ గురించి ఎన్నో మంచి మంచి కీర్తనలు రచించాడు... అంటుంటే, రామదాసు శ్రీరాముని పాదాల ముందు సాష్టాంగపడ్డాడు.

ఇదిగో ఈ మహానుభావుడిని చూడు. ఈయన త్యాగయ్య. నీ మీద ఎన్ని కీర్తనలు రచించాడు. ‘మా జానకి చెట్టపట్టగా మహరాజువైతివి’ అని ఆ తల్లి సీతమ్మను తన గుండెల్లో పొదివిపట్టుకున్నాడు.. అని త్యాగయ్య గురించి పలుకుతుంటే, ఆ మహానుభావుడు తన చేతిలోని తంబురను శ్రీరాముని చేతికిచ్చాడు. ఆ రాముడు తన విల్లును పక్కన పెట్టి, తంబురనే విల్లుగా ధరించాడు. అంతే ఆ దశ్యం చూసిన కొంటె బొమ్మల బాపు... గబగబ అయిదు నిమిషాలలో కవుల కొలువును, తంబుర రాముడిని తన రేఖలలో నింపేశాడు.

ఆ పక్కన ముసిముసి నవ్వులతో బాపుని అంటిపెట్టుకున్న ముళ్లపూడి రమణ.. శ్రీరామా! ఓ ఫైవ్‌ లెటర్స్‌ అప్పు ఇస్తావా నిన్ను పొగడటానికి... అంటూ ఆయన పాదాల ముందు మోకరిల్లాడు. ఈసారి రాముడు కాదు, వాల్మీకి పరవశించిపోయాడు. నేను 24 వేల శ్లోకాలతో రామకథను కొన్ని వేల సంవత్సరాల క్రితం రచిస్తే, నేటికీ నా రాముడిని అందరూ అక్షరాలలో బంధిస్తూనే ఉన్నారు.

‘రామా! ఇది నా గొప్పతనం కాదు. ఇది నీ గొప్పదనం. నీ వ్యక్తిత్వ ఔన్నత్యం. నీ తండ్రి దశరథుడు నేర్పిన సంస్కారం గొప్పదనం.మా జన్మలు ధన్యమయ్యాయయ్యా. ఇక నువ్వు నీ బాల విగ్రహ ప్రతిష్ఠ చూడటానికి బయలుదేరు. మేమంతా నీ వెంట వస్తాం. అక్కడ అయోధ్యలో ‘రామాయ రామభద్రాయ రాచంద్రాయ వేధసే’ అంటూ రామాయణ గాథ ఉషశ్రీ గళం వినిపిస్తున్నారట.

‘మన ఉషశ్రీ ధన్యుడయ్యాడు. నీ ఎదుట గళం వినిపించే అదృష్టం అతడిని మాత్రమే వరించింది. అతడి మాటలలోనే నా ఉపన్యాసం ముగిస్తాను. స్వస్తి’ అంటూ వాల్మీకి ముగింపు పలికాడు. అందరూ నెమ్మదిగా అయోధ్య వైపుగా బయలుదేరబోతున్నారు.  చకచక అడుగులు వేస్తూ ఉషశ్రీ వేగంగా వెళ్లడం గమనించిన రాముడు, ‘మహర్షీ! మనం కూడా బయలుదేరాలయ్యా. వాడు కాలాంతకుడు. సమయ పాలన వాడి ఆత్మ. నా బాలరామ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు కదా.

ఆ వ్యాఖ్యానం వీడి గళం నుంచే వెలువడబోతోంది. వాడితో పాటు వాడికి ‘ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇలా ఉండాలి’ అని మార్గదర్శనం చేసిన జమ్మలమడక మాధవరామ శర్మ కూడా ఈ పాటికి అక్కడికి చేరి ఉంటాడు. వేగంగా పదండి’ అని పలికాడు. అదిగో అయోధ్య. అదిగో రాముడు. అదిగో మన కవిపండితులు. అదిగో మన తెలుగువారు.

జై శ్రీరామ్‌...

(జనవరి 22, 2024 సోమవారం నాడు బాలరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా సృజన రచన.  - డా. పురాణపండ వైజయంతి)

>
మరిన్ని వార్తలు