కరోనా: మార్కెట్‌ మారింది..

30 Aug, 2020 10:22 IST|Sakshi

మార్కెట్‌ మారింది. జనాల కొనుగోలు ప్రాధాన్యాలూ మారాయి. మహమ్మారి దెబ్బకు జల్సాలకు కళ్లాలు పడ్డాయి. జనాల్లో ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. వస్తువులను కొనే ముందు ఆచి తూచి ఆలోచించే ధోరణి పెరిగింది. ‘కరోనా’ విజృంభణతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి అన్‌లాక్‌ పరిస్థితి వరకు చూసుకుంటే విపణి ధోరణిలోనూ వినిమయ వైఖరిలోనూ భారీ మార్పులే వచ్చాయి. మహమ్మారి కాలంలో ప్రజల కొనుగోలు తీరుతెన్నులే ఈ మార్పులకు అద్దం పడుతున్నాయి.

‘కరోనా’ వ్యాప్తి మొదలవడంతో ఈ ఏడాది మార్చి చివరివారంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించింది. ‘కరోనా’ వైరస్‌కు మందు లేదని, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా మాత్రమే దీనిని నివారించుకోవచ్చని విస్తృతంగా ప్రచారం చేసింది. పత్రికలు, టీవీ చానెళ్లు, వెబ్‌సైట్లలో పుంఖాను పుంఖాలుగా ‘కరోనా’ కథనాలు వస్తుండటంతో జనాల్లో సహజంగానే భయాందోళనలు వ్యాపించాయి. పరిస్థితిని అర్థం చేసుకున్న జనాలు ఎవరికి వారే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టారు. ‘లాక్‌డౌన్‌’ దెబ్బకు చాలా వ్యాపారాలు కుదేలయ్యాయి. చిరువ్యాపారులు చతికిలపడ్డారు. కార్మికులు ఉపాధి కోల్పోయారు. ప్రైవేటు కంపెనీల పరిస్థితి కూడా దిగజారడంతో వాటిలో పనిచేసే చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు.

ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేసి, అన్‌లాక్‌ ప్రకటించిన తర్వాత ప్రైవేటు కార్యాలయాలు తిరిగి పనిచేయడం మొదలైంది. లాక్‌డౌన్‌లో మూతబడ్డ వ్యాపారాలు తిరిగి ప్రారంభమయ్యాయి. చాలావరకు చిన్నా చితకా దుకాణాలు తెరుచుకున్నాయి. మార్కెట్‌ కార్యకలాపాలు తిరిగి మొదలైనా, లాక్‌డౌన్‌ దెబ్బకు ఉపాధి పోగొట్టుకున్న వారిలో చాలామందికి ఇంకెక్కడా ప్రత్యామ్నాయం దొరకని పరిస్థితులే ఉన్నాయి. పెద్దసంఖ్యలో జనం ఉపాధికి దూరం కావడంతో, జనాల కొనుగోలు శక్తి కూడా గణనీయంగా తగ్గింది. ఫలితంగా అన్‌లాక్‌ దశలో దుకాణాలు తిరిగి తెరుచుకున్నా, ఇదివరకటి స్థాయిలో లావాదేవీలు జరగడం లేదు. ‘కరోనా’ కారణంగా కొన్ని వస్తువులు, సేవలకు మాత్రం గిరాకీ తగ్గకపోగా, ఇదివరకటి కంటే పెరగడం విశేషం. మహమ్మారి కాలంలో జనాలు ఎక్కువగా వేటిపై ఖర్చు చేస్తున్నారంటే...

రోగనిరోధక సాధనాలు
‘కరోనా’ విజృంభణ మొదలైన నాటి నుంచి జనం ఆరోగ్య పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. రోగనిరోధకతను పెంచుకోవడానికి పనికి వస్తాయనుకున్న వస్తువులను విరివిగా కొనుగోలు చేస్తున్నారు. ‘కరోనా’ విజృంభణ తర్వాత ముఖ్యంగా సంప్రదాయ ఆయుర్వేద ఉత్పత్తులకు గిరాకీ బాగా పెరిగింది. రోగ నిరోధకతను పెంచే ‘చ్యవనప్రాశ’ అమ్మకాలు ఏప్రిల్‌–జూన్‌ మధ్య కాలంలో ఊహించని రీతిలో పెరిగాయి. ప్రముఖ ఆయుర్వేద కంపెనీలు ఉత్పత్తి చేసే ‘చ్యవనప్రాశ’ అమ్మకాలు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ మూడు నెలల్లోనే ఏకంగా 283 శాతం, బ్రాండెడ్‌ తేనె అమ్మకాలు 39 శాతం పెరిగినట్లు ‘నీల్సన్‌’ అధ్యయనంలో వెల్లడైంది. 

వ్యక్తిగత శుభ్రత ఉత్పత్తులు
‘కరోనా’ వైరస్‌ నిరోధానికి భౌతిక దూరం పాటించడంతో పాటు వ్యక్తిగత శుభ్రత అత్యంత కీలకమనే దానిపై ప్రజలందరిలోనూ అవగాహన పెరిగింది. దీంతో వ్యక్తిగత శుభ్రతకు అవసరమయ్యే సబ్బులు, షాంపూలు, లిక్విడ్‌ హ్యాండ్‌వాష్‌లు, వాషింగ్‌ పౌడర్లు, డిటర్జెంట్లు, ఇంటి శుభ్రతకు అవసరమయ్యే బాత్రూమ్‌ క్లీనర్లు, ఫ్లోర్‌ క్లీనర్లు వంటి ఉత్పత్తుల అమ్మకాలు ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ మధ్య కాలంలో గణనీయంగా పెరిగాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే, ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో ఈ ఉత్పత్తుల అమ్మకాలు దాదాపు 48 శాతం పెరిగినట్లు ‘ఆక్సెంచ్యూర్‌ కన్జూమర్‌ పల్స్‌’ అధ్యయనం వెల్లడించింది.

ప్యాకేజ్డ్‌ చిరుతిళ్లు
లాక్‌డౌన్‌ దెబ్బకు వీధుల్లోని పానీపూరీ వ్యాపారాలు, పకోడీ బజ్జీ వ్యాపారాలు మూతబడ్డాయి. అన్‌లాక్‌లో ఇవి తెరుచుకున్నా, వీటి జోలికి వెళ్లడానికి భయపడే జనాలే ఎక్కువగా ఉంటున్నారు. చిరుతిళ్లకు అలవాటు పడ్డవారు వీధుల్లోని బళ్లలో దొరికే చిరుతిళ్లకు బదులు ప్యాకేజ్డ్‌ చిరుతిళ్లను విరివిగా కొంటున్నారు. ఇన్‌స్టంట్‌ నూడుల్స్, ఓట్స్, కార్న్‌ఫ్లేక్స్, బిస్కట్లు, రస్కులు, చాక్లెట్లు వంటి వాటి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. వీటి అమ్మకాలు ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ మధ్య కాలంలో 10.7 శాతం పెరిగాయి. జనాలు ఆరుబయటకు వచ్చి తినడం కంటే ఇంట్లోనే తినడానికి ప్రాధాన్యమిస్తున్నారని, అందుకే ప్యాకేజ్డ్‌ ఆహార పదార్థాల అమ్మకాలు బాగా పెరిగాయని ‘ఎమ్కే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌’ వెల్లడించింది.

గృహోపకరణాలు
మన్నిక గల గృహోపకరణ వస్తువుల అమ్మకాలు సాధారణంగా నిలకడగానే ఉంటాయి. పండగ పర్వాల వంటి ప్రత్యేక సందర్భాల్లో వీటి అమ్మకాలు కాస్త పెరుగుతూ ఉంటాయి. ‘కరోనా’ కాలంలో వీటి అమ్మకాలు అమాంతంగా పెరగడం విశేషం. మిక్సర్లు, జ్యూసర్లు, మైక్రోవేవ్‌ ఓవెన్లు, టోస్టర్లు, డిష్‌ వాషర్లు, వాక్యూమ్‌ క్లీనర్లు వంటి గృహోపకరణాల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది జూలైలో ఏకంగా నాలుగు రెట్లు పెరిగాయి. జనాల్లో వ్యక్తిగత ఆరోగ్య స్పృహ పెరగడంతో ముఖ్యంగా డిష్‌వాషర్ల అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. తమ వద్ద ఉన్న సరుకుకు మించి డిష్‌వాషర్ల కోసం ఆర్డర్లు వెల్లువెత్తుతుండటంతో హావెల్స్‌ ఇండియా లిమిటెడ్‌ సహా చాలా కంపెనీలు డిష్‌ వాషర్లకు కొత్తగా ఆర్డర్లు తీసుకోవడాన్ని నిలిపివేశాయంటే గృహోపకరణాలకు డిమాండ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

వినియోగదారుల పొదుపుమార్గం
‘కరోనా’ మహమ్మారి వ్యాప్తి దేశంలో మొదలైనప్పటి నుంచి వినియోగదారులు పొదుపుమార్గం పట్టారు. ఇదివరకటిలా వినోదాలు, విలాసాల కోసం చేసే ఖర్చులను దాదాపుగా తగ్గించేసుకున్నారు. దేశంలోని సుమారు 90 శాతం వినియోగదారులు నిత్యావసరాల కొనుగోలుకే అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. తక్షణ అవసరం లేని వస్తువుల కొనుగోలును మానుకుంటున్నారని, లేదా వాయిదా వేసుకుంటున్నారని ‘ఆక్సెంచ్యూర్‌’ నిర్వహించిన ‘కన్జూమర్‌ పల్స్‌’ అధ్యయనంలో వెల్లడైంది. ‘కరోనా’ మహమ్మారి వినియోగదారుల వైఖరిని సమూలంగా మార్చేసిందని, ఈ మార్పు దీర్ఘకాలం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది.


‘కరోనా’ మహమ్మారి కారణంగా మారిన వినియోగదారుల ప్రాధాన్యాల మేరకు వారి అవసరాలను తీర్చడం ద్వారా వారిని ఆకట్టుకోవడానికి వివిధ బ్రాండ్ల ఉత్పత్తిదారులు కూడా తమ మార్కెటింగ్‌ పద్ధతులను మార్చుకుంటున్నారు. ‘కరోనా’ దెబ్బకు వినియోగదారుల షాపింగ్‌ అలవాట్లు కూడా మారిపోయాయి. వీలైనంత వరకు ఇళ్లకే పరిమితమవుతున్న వినియోగదారులు, అవసరమైన వస్తువులను ఇళ్లకు దగ్గర్లోని దుకాణాల్లోనే కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఇదివరకటి మాదిరిగా వారాంతాల్లో దూరంలో ఉన్న షాపింగ్‌మాల్స్‌కు వెళ్లి షాపింగ్‌ చేసే అలవాటును జనాలు దాదాపుగా మానుకున్నారు.

డిజిటల్‌ సేవలు
‘కరోనా’ దెబ్బకు భౌతికదూరం అనివార్యం కావడంతో జనాలు ఎక్కువగా డిజిటల్‌ సేవలపై ఖర్చు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ క్లాస్‌లు, వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కోసం తప్పనిసరిగా ఇళ్లలో ఇంటర్నెట్‌ కనెక్షన్లు పెట్టించుకుంటున్నారు. ఇళ్లలో ఇంటర్నెట్‌ వాడకం తప్పనిసరి కావడంతో ఇంతవరకు డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ వంటి పరికరాలు లేకుండా నెట్టుకొచ్చిన వాళ్లు సైతం వీటిని కొనుగోలు చేయడం ప్రారంభించడంతో డెస్క్‌టాప్, లాప్‌టాప్, ట్యాబ్‌ పరికరాలకు గిరాకీ బాగానే పెరిగింది. ఇవన్నీ ఒక ఎత్తయితే, సినిమా థియేటర్లు మూతబడటంతో వినోదానికి అలవాటు పడ్డ జనాలు వినోదం కోసం ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) సేవలపై ఆధారపడుతున్నారు.


గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ మధ్య కాలంలో నెట్‌ఫ్లిక్స్‌ యూజర్ల సంఖ్య 45 శాతం పెరిగింది. అమెజాన్‌ ప్రైమ్, బిగ్‌ఫ్లిక్స్, ఆల్ట్‌ బాలాజీ, జీ 5 వంటి మిగిలిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు కూడా యూజర్లు దాదాపు ఇదే స్థాయిలో పెరుగుతూ వస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. సినిమాలను నేరుగా విడుదల చేసే పరిస్థితులు లేకపోవడంతో చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారానే విడుదల చేస్తున్నారు.

వినిమయ వైఖరిలో  కీలక మార్పులు
‘కరోనా’ మహమ్మారి కాలంలో వినిమయ ధోరణిలో చాలా మార్పులే వచ్చాయి. దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాతి నుంచి అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైన కాలం వరకు వినియోగదారుల వినిమయ సరళిలో వచ్చిన కీలకమైన మార్పులపై అధ్యయనాలు జరిపిన మార్కెటింగ్‌ సంస్థలు కొన్ని ముఖ్యమైన అంశాలను గుర్తించాయి. అవి:

  • వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు బ్రాండ్ల ఎంపికలో నాణ్యతకు, భద్రతకు, నమ్మకానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇదివరకటితో పోలిస్తే, ఈ అంశాలకు ప్రాధాన్యమిచ్చే వారి సంఖ్య ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ మధ్య కాలంలో 71 శాతం పెరిగింది.
  • ఇదే కాలంలో వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు ఆరోగ్యంపై ఇదివరకటి కంటే మరింతగా శ్రద్ధ తీసుకుంటున్నామని, ఆహార వృథాను చాలావరకు అరికట్టడానికి ప్రయత్నిస్తున్నామని దాదాపు 85 శాతం వినియోగదారులు వివిధ సర్వేల్లో చెప్పారు.
  • బ్రాండ్ల ఎంపిక విషయంలో వాటి ధరలను ఆచి తూచి పరిశీలిస్తున్నట్లు 75 శాతం మంది చెబుతున్నారు.
  • ఇదివరకటి కంటే ఇప్పుడు స్థానిక ఉత్పత్తులకు, స్థానిక బ్రాండ్లకే తాము ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు 79 శాతం వినియోగదారులు చెబుతున్నారు. 
  • భౌతిక దూరం అనివార్యమైనందున బంధు మిత్రులు ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో బంధుమిత్రులతో సంబంధాలు కొనసాగించడానికి దాదాపు 71 శాతం మంది వీడియో కాల్స్, వీడియో కాన్ఫరెన్స్‌లపైనే ఆధారపడుతున్నారు. మరో ఆరు నెలలు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వారంతా అభిప్రాయపడుతున్నారు. 
  • ‘కరోనా’ వైరస్‌ నిరోధానికి రష్యా ఇప్పటికే వ్యాక్సిన్‌ను తీసుకొచ్చింది. మరిన్ని దేశాల్లో వ్యాక్సిన్‌ ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నాయి. కొద్ది నెలల్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా, తద్వారా ‘కరోనా’ తగ్గుముఖం పట్టినా సరే వినియోగదారులు ప్రస్తుతం కొనసాగిస్తున్న ధోరణి మరికొంత కాలం ఇలాగే కొనసాగే సూచనలు ఉన్నాయని ‘ఆక్సెంచ్యూర్‌’ అధ్యయనం అభిప్రాయపడుతోంది.

బంగారాన్ని కుదువ పెడుతున్నారు...
‘కరోనా’ మహమ్మారి దెబ్బకు జనాలు ఆచి తూచి ఆరోగ్య స్పృహతో ఖర్చు చేస్తుండటం ఒకింత మంచి పరిణామమే అయినా, ఇందులో నాణేనికి మరోవైపు కూడా ఉంది. ఉపాధి పోవడంతో అనుకోని ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న చాలామంది బంగారాన్ని కుదువ పెడుతున్నారు. మరో ఉపాధి దొరికే వరకైనా రోజువారీ అవసరాలు తీర్చుకోవడం కోసం బంగారం కుదువ పెట్టి అప్పులు తీసుకునే వారి సంఖ్య ఏప్రిల్‌–జూన్‌ నెలల మధ్య కాలంలో గణనీయంగా పెరిగింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసుకుంటే, ఈ ఏడాది వీరి సంఖ్య 57 శాతం వరకు పెరిగినట్లు దేశంలోనే అతి పెద్ద గోల్డ్‌లోన్‌ ఫైనాన్సింగ్‌ సంస్థ ‘ముత్తూట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌’ వెల్లడించింది.


వినియోగదారుల పొదుపుమార్గం
‘కరోనా’ మహమ్మారి వ్యాప్తి దేశంలో మొదలైనప్పటి నుంచి వినియోగదారులు పొదుపుమార్గం పట్టారు. ఇదివరకటిలా వినోదాలు, విలాసాల కోసం చేసే ఖర్చులను దాదాపుగా తగ్గించేసుకున్నారు. దేశంలోని సుమారు 90 శాతం వినియోగదారులు నిత్యావసరాల కొనుగోలుకే అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. తక్షణ అవసరం లేని వస్తువుల కొనుగోలును మానుకుంటున్నారని, లేదా వాయిదా వేసుకుంటున్నారని ‘ఆక్సెంచ్యూర్‌’ నిర్వహించిన ‘కన్జూమర్‌ పల్స్‌’ అధ్యయనంలో వెల్లడైంది. ‘కరోనా’ మహమ్మారి వినియోగదారుల వైఖరిని సమూలంగా మార్చేసిందని, ఈ మార్పు దీర్ఘకాలం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. ‘కరోనా’ మహమ్మారి కారణంగా మారిన వినియోగదారుల ప్రాధాన్యాల మేరకు వారి అవసరాలను తీర్చడం ద్వారా వారిని ఆకట్టుకోవడానికి వివిధ బ్రాండ్ల ఉత్పత్తిదారులు కూడా తమ మార్కెటింగ్‌ పద్ధతులను మార్చుకుంటున్నారు. ‘కరోనా’ దెబ్బకు వినియోగదారుల షాపింగ్‌ అలవాట్లు కూడా మారిపోయాయి. వీలైనంత వరకు ఇళ్లకే పరిమితమవుతున్న వినియోగదారులు, అవసరమైన వస్తువులను ఇళ్లకు దగ్గర్లోని దుకాణాల్లోనే కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఇదివరకటి మాదిరిగా వారాంతాల్లో దూరంలో ఉన్న షాపింగ్‌మాల్స్‌కు వెళ్లి షాపింగ్‌ చేసే అలవాటును జనాలు దాదాపుగా మానుకున్నారు.

మరిన్ని వార్తలు