విశ్వసుందరి పోటీల్లో సౌదీ ముద్దుగుమ్మ! ఇంతకీ ఎవరీమె..?

28 Mar, 2024 14:05 IST|Sakshi

ఇస్లాం సంప్రదాయవాదానికి చిరునామాగా నిలిచే సౌదీ అరేబియా నుంచి ఒక ముద్దుగుమ్మ మిస్‌ యూనివర్స్‌ పోటీలకు సిద్ధమైంది. సౌదీ నుంచి ఇలా ఒక అమ్మాయి అంతర్జాతీయ అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించడం చరిత్రలో ఇదే తొలిసారి. మలేసియాలో జరగనున్న విశ్వసుందరి పోటీల్లో సౌదీ తరఫున 27 ఏళ్ల మోడల్‌ రూబీ అల్ఖాతానీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ అందాల రాశికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. 

తొలి పార్టిసిపెంట్‌గా ఆమె..
సౌదీ అరేబియాలో మహిళలపై ఎలాంటి ఆంక్షలుంటాయో అందరికి తెలిసిందే. కఠిన ఆంక్షలతో ఫక్తు సంప్రదాయవాదిగా పేరుమోసిన 38 ఏళ్ల సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సౌద్‌ ఇటీవలి కాలంలో సౌదీని సంస్కరణల బాటలో పయనింపజేస్తున్నారు. ఇటీవలి కాలంలో పలు ఆంక్షల్ని సడలించి వార్తల్లో నిలిచారు. ఈ మేరకు ఆయన మహిళా డ్రైవర్లపై నిషేధం ఎత్తివేయడం, ఆహార్యం విషయంలో పెట్టిన నిబంధనల్ని సడలించడం, పురుషుల తోడు లేకుండా బయటికి వెళ్లే స్వేచ్ఛను అక్కడి మహిళలకు కల్పించడం.. వంటి పలు మార్పులు తీసుకొచ్చారు. అయితే అందాల పోటీల్లో పాల్గొనే విషయంలో కూడా నియమాల్ని సడలించడం విశేషం. ఎందుకంటే..ఇప్పటిదాకా అంతర్గతంగా జరిగే అందాల పోటీల్లో పాల్గొనేందుకు అక్కడి మహిళలకు అనుమతిచ్చిన ఈ దేశం.. తొలిసారి అంతర్జాతీయంగా జరిగే అందాల పోటీల్లో పాల్గొనేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

అంతేగాదు ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగబోయే ‘మిస్‌ యూనివర్స్‌’ పోటీల్లో ఈ దేశం కూడా పాలుపంచుకుంటోంది. విశ్వ సుందరి పోటీల్లో సౌదీ తరఫున 27 ఏళ్ల రుమీ అల్‌ ఖతానీ పోటీ పడనుంది. దీంతో ‘మిస్‌ యూనివర్స్‌’ పోటీల్లో పాల్గొననున్న తొలి సౌదీ అరేబియన్‌ మహిళగా రుమీ చరిత్ర సృష్టించనుంది. రుమీ రియాద్‌లో పుట్టి పెరిగింది. చిన్నతనం నుంచి ఎంతో ముద్దుగా, క్యూట్‌గా ఉండే ఆమెకు అందాల పోటీల్లో పాల్గొనాలన్నది చిరకాల కోరిక. అందువల్లే టీనేజ్‌ దశ నుంచే ఇటువైపుగా అడుగులు వేసి మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది.

కంటెంట్‌ క్రియోటర్‌గా..
అందాల పోటీలపై ఎంత మక్కువ ఉన్నా చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు రుమీ. దంత వైద్యంలో డిగ్రీ పట్టా పుచ్చుకుంది. కొత్త విషయాలు తెలుసుకోవడమన్నా, కొత్త భాషలు నేర్చుకోవడమన్నా ఈ ముద్దుగుమ్మకు చాలా ఇష్టమట! ఈ మక్కువతోనే అరబ్‌, ఫ్రెంచ్‌, ఇంగ్లిష్‌ భాషల్ని అనర్గళంగా మాట్లాడడం నేర్చుకున్న రుమీ.. మరిన్ని భాషలు నేర్చుకునే పనిలో ఉన్నానంటోంది. తన వ్యక్తిగత, కెరీర్‌ అనుభవాల్ని నలుగురితో పంచుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది రుమీ. ఈ క్రమంలోనే మోడల్‌గా తాను సాధించిన ఘనతల్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ నెటిజన్ల ప్రశంసలందుకుంది ఈ సౌదీ భామ. ఫ్యాషన్‌, అందం, లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై అందరిలో అవగాహన కల్పిస్తూ పోస్టులు పెడుతూ.. కంటెంట్‌ క్రియేటర్‌గా మంచి పేరు కూడా తెచ్చుకుంది. అంతేగాదు ఇన్‌స్టాలో కూడా ఆమెను 10 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

కుటుంబమే నా బలం..
ప్రయాణాలంటే ఈ అందాల ముద్దుగుమ్మకు మహా ఇష్టమట. తాను సందర్శించే దేశాలు, అక్కడి ప్రత్యేకతల్ని ఫొటోలు, రీల్స్‌ రూపంలో ఎప్పటికప్పుడూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంది. విభిన్న ఫ్యాషన్స్‌ని ఫాలో అవడం, కొత్త ఫ్యాషన్లను ట్రై చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది రుమీ. ఫ్యాషనబుల్‌ దుస్తుల్లో మెరిసిపోతూ రుమీ తీయించుకున్న ఫొటోషూట్స్‌ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయగా.. అవన్నీ వైరల్‌ అవుతుంటాయి. ఇలా ‘ఫ్యాషన్‌ క్వీన్‌’గానూ పేరు తెచ్చుకుందీ ఈ బ్యూటీ. తన వద్ద ఉన్న ఖరీదైన వస్తువులు, యాక్సెసరీస్‌, వాటికి సంబంధించిన ఫొటోల్నీ అందరితో పంచుకోవడానికి ఇష్టపడతుంది రుమీ. అంతేగాదు ఆమె వద్ద ఉన్న లగ్జరీ జ్యుయలరీ కలెక్షన్లను చూసి నెటిజన్లు ఫిదా అవుతుంటారు. తన కుటుంబమే తన బలం అని రుమీ తరచుగా చెబుతుంటుంది. అంతేగాదు తన కుటుంబ సభ్యులు, సోదరీమణులతో దిగిన ఫొటోల్ని కూడా సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తుంటుంది.

ఇక రుమీ ఇప్పటికే పలు అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. అలా ఆమె ‘మిస్‌ సౌదీ అరేబియా’, ‘మిస్‌ అరబ్‌ పీస్‌’, ‘మిస్‌ ఉమన్‌ సౌదీ అరేబియా’, ‘మిస్‌ యూరప్‌ సౌదీ అరేబియా’, ‘మిస్‌ ప్లానెట్‌ సౌదీ అరేబియా’, ‘మిస్‌ మిడిల్‌ ఈస్ట్‌ సౌదీ అరేబియా’, ‘మిస్‌ అరబ్‌ యునిటీ సౌదీ అరేబియా’, ‘మిస్‌ ఆసియా సౌదీ అరేబియా’.. వంటి ఎన్నో టైటిళ్లు దక్కించుకుంది. "ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సమానత్వంతో జీవించే హక్కు ఉంది. వయసు, స్త్రీ-పురుష భేదాలు, శక్తి సామర్థ్యాలు, ఆహార్యం/శరీరాకృతి పరంగా ఎవరూ వివక్షకు గురికాకూడదు. అప్పుడే వాళ్లు తామేంటో చూపించుకోగలరు.." అంటూ సోషల్‌ మీడియాలో స్ఫూర్తినింపే  పోస్టులను పెడుతుంటుంది.

కాగా, ఈ ఏడాది జరగబోయే ‘మిస్‌ యూనివర్స్‌’ పోటీల్లో తన దేశం తరఫున పాల్గొంటున్నందుకు ఆనందంలో మునిగితేలుతోంది ఈ ముద్దుగుమ్మ. అంతేగాదు ఈ ఏడాది మిస్‌ యూనివర్స్‌-2024 పోటీల్లో తన దేశానికి ప్రాతినిథ్యం వహించడం గర్వంగానూ సంతోషంగానూ ఉందని చెబుతోంది. ఈ ఏడాది తొలిసారిగా నా దేశం ఈ పోటీల్లో పోటీ పడుతుండడం, పైగా అందులో తానే తొలి పార్టిసిపెంట్‌ని కావడం ఎంతో సంతోషంగా అనిపించిందని సోషల్‌ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది రుమీ.

(చదవండి: హీరోయిన్‌లా కనిపించాలని వందకు పైగా సర్జరీలు! అందుకోసం..)


 

Election 2024

మరిన్ని వార్తలు