ఈశాన్య సరిహద్దు్దల్లో మత్తు మహమ్మారి

27 Jan, 2024 03:50 IST|Sakshi

ఇండియా–మయన్మార్‌ సరిహద్దులను కంచెతో మూసేస్తామని ఇటీవల కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. ఇరుదేశాల మధ్య ఉన్న 1,643 కిలోమీటర్ల సరిహద్దు గుండా ఈశాన్య రాష్ట్రాల్లోకి మత్తు పదార్థాలు, ఆయుధాలు సరఫరా అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అఫ్గానిస్తాన్‌ను దాటి మయన్మార్‌ ప్రపంచంలో అత్యధిక నల్లమందు ఉత్పత్తిదారుగా అవతరించిందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.

ఆ సాగుకు కావాల్సిన నీరు, ఎరువులు, మూలధన పెట్టుబడులు, కొనుగోలుదారులు, మార్కెటింగ్, హవాలా లాంటి కార్యకలాపాలన్నీ ఒక వ్యవస్థీకృత నెట్‌వర్క్‌గా ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటుగా, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సమాజాన్ని జాగృతం చేస్తే తప్ప ఈ ప్రమాదాన్ని అరికట్టలేం.

కాలాడాన్‌ మల్టీ మోడల్‌ ట్రాన్సిట్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా మయన్మార్‌లోని సీత్త్వే పోర్ట్‌ను మిజోరం రాజధాని ఐజ్వాల్‌తో కలిపే ప్రణాళికలో ముఖ్యమైన పాలేత్వా పట్టణాన్ని సాయుధ తిరుగుబాటు గెరిల్లా గ్రూపు ఆరగాన్‌ ఆర్మీ స్వాధీనం చేసుకుందన్న వార్తలు... ఇండియా –మయన్మార్‌ సరిహద్దులను కంచెతో మూసేస్తాం అన్న కేంద్ర హోంమంత్రి ప్రకటన... ఈ రెండు కూడా భారతదేశ భద్రతతో ముడిపడిన అంశాలు. అలాగే ఇటీవల మణిపుర్‌లో చెలరేగిన జాతుల మధ్య ఘర్షణతో కూడా కొంత సంబంధం ఉన్న విషయాలు.

 2003 డిసెంబర్‌లో వెలువడిన ‘యునైటెడ్‌ నేషన్స్ ఆఫీస్‌ ఆన్‌ డ్రగ్స్‌ అండ్‌ క్రైమ్‌’ నివేదిక ప్రకారం, అఫ్గానిస్తాన్‌ను దాటి మయన్మార్‌ ప్రపంచంలో అత్యధిక నల్లమందు ఉత్పత్తిదారుగా అవతరించింది. అఫ్గానిస్తాన్‌లో నల్లమందు సాగుపై తాలిబన్‌ ప్రభుత్వం తీసుకొంటున్న కఠిన చర్యల ఫలితంగా అక్కడి ఉత్పత్తిలో గణనీయమైన తరుగుదల కనిపిస్తుండగా, మయన్మార్‌లో పెరుగుతోందన్న వార్తలు సరిహద్దు పంచుకుంటున్న భారత్‌ లాంటి దేశాలకు కలవరం కలిగించేదే.

దశాబ్దాలపాటు మయాన్మార్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత, సాయుధ తిరుగుబాటు... నల్లమందు (ఓపియం) ఉత్పత్తి పెరగడా నికి కారణమయ్యాయి. పేదరికంతో బాధపడుతున్న రైతులకు నల్ల మందు సాగు పరిస్థితులు మెరుగుపరుచుకునేందుకు ఒకే ఒకమార్గంగా అవతరించింది. కిలోకు సుమారు 23 వేల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఒక కోటి పదిలక్షల హెక్టార్ల సాగు చేయదగిన భూమి ఉన్న మయన్మార్‌లో దాదాపు 47,000 హెక్టార్లు అంటే 0.5 శాతం భూమిలో నల్లమందు పండుతోంది. దీనివల్ల గతేడాది 1080 మెట్రిక్‌ టన్నుల నల్లమందు ప్రపంచ మార్కెట్లోకి విడుదలైంది.

ఇది 2022లో ఆ దేశం ఉత్పత్తి చేసిన నల్లమందు కన్నా సుమారు 36 శాతంఅధికం. ఇదే సమయంలో ఎకరానికి సగటు ఉత్పత్తి 19 నుండి 22 కిలోలకు పెరిగింది. సాగులో అధునాతన పద్ధతులు అవలంబిస్తున్నా రనీ, ఆయా ప్రాంతాలను నియంత్రిస్తున్నవారి సహాయం లేకుండా ఇది సాధ్యపడదనీ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం వ్యాపారం విలువ సుమారు రెండు బిలియన్‌ డాలర్లు. ఈ నల్లమందు ద్వారా ఉత్పత్పయ్యే హెరాయిన్, మార్ఫీన్, కోడెయిన్‌ వంటి మత్తు పదార్థాల ద్వారా సుమారు పది బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఇది మయన్మార్‌ స్థూల జాతీయోత్పత్తిలో 2–4 శాతం.

మయన్మార్‌లో ముఖ్యంగా మూడు రాష్ట్రాలైన షాన్, చిన్, కాచి న్‌లలో నల్లమందు సాగు నిరాటంకంగా జరుగుతోంది. థాయిలాండ్, లావోస్‌ దేశాలను ఆనుకుని ఉండే షాన్‌లో 1750ల లోనే నల్లమందు సాగు మొదలైంది. క్రమంగా ఆ ప్రాంతం మొత్తం విస్తరించి, ఇర వయ్యో శతాబ్దం నాటికి గోల్డెన్‌ ట్రయాంగిల్‌ రూపంలో అవతరించడమే గాక, ప్రపంచంలో సగం నల్లమందు ఆధారిత మత్తుపదార్థాలు ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగింది. ఈ ఒక్క రాష్ట్రంలోనే సుమారు 80 శాతం ఉత్పత్తి జరుగుతుంటే, భారత్‌ను ఆనుకొని ఉండే చిన్, కాచిన్‌ రాష్ట్రాలు మిగిలిన ఇరవై శాతం ఉత్పత్తి చేస్తున్నాయి.

ఈ రాష్ట్రాలలోని టాహం, ఫాలం, తుఎంసెంగ్‌ ప్రాంతాల మీదుగా మయన్మార్‌తో సుమారు 510 కిలోమీటర్ల కంచె లేని సరిహద్దు కలిగి వున్న మిజోరంలోని ఛాంఫై, మణిపుర్‌లోని మొరెహ్, టాము ప్రాంతాల ద్వారా నల్లమందు భారత్‌లోకి చేరుతోంది. మయన్మార్‌తో సుమారు 1,600 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్న భారత్‌పై, ముఖ్యంగా మిజోరం, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలపై దీని ప్రభావం పడుతుందనడంలో సందేహం లేదు. 

వివిధ జాతులకు చెందిన సాయుధ పోరాట సంస్థలతో పాటు కొన్ని మిలిటరీ విభాగాలు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం, ఆయుధాల కొనుగోలు కోసం ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో భాగం పంచుకుంటున్నారు. కాచిన్‌ ప్రాంతంలోని కాచిన్‌ ఇండిపెండెన్స్ ఆర్మీ, ఆరగాన్‌ ఆర్మీ, యునైటెడ్‌ వా స్టేట్‌ ఆర్మీ వాటిలో కొన్ని మాత్రమే. అలాగే చిన్‌ రాష్ట్రం నుండి కార్యకలాపాలు సాగిస్తున్న చిన్‌ నేషనల్‌ ఆర్మీ, చిన్‌ నేషనల్‌ డెమోక్రాటిక్‌ ఫోర్స్, చిన్‌ ల్యాండ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ లాంటి కొన్ని సాయుధ సంస్థలతో పాటు, సరిహ ద్దులకు ఇరువైపులా కార్యకలాపాలు సాగిస్తున్న కుకీ నేషనల్‌ ఆర్మీ కూడా ఈ వ్యవహారాల్లో భాగం కావడం ఆందోళన కలిగించేదే.  

సరి హద్దు దేశాలపై తిరుగుబాటు దారులకు వ్యతిరేకంగా ఒత్తిడి తేవ డానికి మయన్మార్‌ మిలిటరీ జుంటా కూడా ఈ నల్లమందు అక్రమ రవాణాలో భాగం పంచుకుంటోందని ఆ దేశానికి చెందిన ‘నేషనల్‌ యూనిటీ కన్సల్టేటివ్‌ కౌన్సిల్‌’ సభ్యుడు యు మయూన్గ్‌ మయూన్స్ ఆరోపిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌లో చైనీస్‌ డ్రగ్‌ కార్టెల్స్‌ పాత్ర చెప్పుకో దగినది. డ్రగ్స్‌ను అటు ఆగ్నేయాసియా మార్కెట్లలోకి తరలిస్తూ, ఇటు థాయిలాండ్‌ నుంచి మయన్మార్, బంగ్లాదేశ్‌లోని కాక్స్‌ బజార్‌ మీదుగా ఈశాన్య రాష్ట్రాల్లోకి ఆయుధాల్ని సరఫరా చేస్తున్నాయి.

ఈశాన్య ప్రాంతానికి చెందిన సాయుధ వేర్పాటు దళాలుఇంతకు ముందు నిధుల సేకరణకు బ్యాంకు దోపిడీలు, టీ గార్డెన్లు, వ్యాపార సముదాయాల నుండి అక్రమ వసూళ్లు, ప్రజల వద్ద పన్నులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల నుండి డబ్బు గుంజడాలు లాంటివి చేస్తుండేవి. ఈ నిధులను మయన్మార్‌లోని కాచిన్‌ వేర్పాటు వాద వర్గాల నుండి ఆయుధాలు కొనుగోలు కోసం వెచ్చిస్తుండేవి. అవి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాలుపంచుకునేవి కాదు. కానీ గత కొన్నేళ్లుగా ఈ ధోరణిలో మార్పువస్తోంది. ఈ వ్యవహారాలను పరిశీలిస్తే, నాలుగు విషయాలు గోచరిస్తాయి.

ఈశాన్య రాష్ట్రాల్లోని కొండ, మారుమూల ప్రాంతాల్లో నల్లమందు, గంజాయి సాగు పెరుగుతోంది. హెరాయిన్, యాంఫేట మిన్‌ లాంటి మత్తు పదార్థాలు చిన్న పరిమాణాల్లో ఈశాన్య రాష్ట్రాలకు వస్తున్నాయి. కొన్ని రకాల ఫార్మాస్యూటికల్స్‌ ఈశాన్య రాష్ట్రాల నుండి మయన్మార్‌లోకి రవాణా అవుతున్నాయి. యాంఫేటమిన్‌ లాంటి మత్తు పదార్థాలు ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ఫెడ్రిన్, సూడోపె డ్రిన్‌ లాంటివి మయన్మార్‌కు ఈశాన్య రాష్ట్రాల నుండి వెళ్తున్నాయి. అంటే సరిహద్దులకు ఇరు వైపులా సాగుతున్న వ్యవహారం ఇది!

పశ్చిమాన అఫ్గానిస్తాన్, వాయవ్య పాకిస్తాన్, మధ్య ఆసియాతో కూడిన ‘గోల్డెన్‌ క్రెసెంట్‌’కూ... తూర్పున మయన్మార్, థాయిలాండ్, లావోస్‌లతో కూడిన ‘గోల్డెన్‌ ట్రయాంగిల్‌’కూ మధ్యలో ఉన్న భారత్‌ మాదక ద్రవ్యాలకు అతిపెద్ద ఆకర్షణీయమైన మార్కెట్‌. మత్తు పదా ర్థాలను ఏమాత్రం సహించని(జీరో టోలెరెన్స్‌) విధానాన్ని కేంద్ర ప్రభుత్వ స్వీకరించింది. దీనిలో భాగంగా 2016లో నార్కో కోఆర్డి నేషన్‌ సెంటర్, కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం2019లో జాయింట్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ఏర్పాటైనాయి. ‘నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్స్’ చట్టం 1985లో భాగంగా బీఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, అస్సాం రైఫిల్స్‌కు డ్రగ్స్‌ వ్యతిరేక చర్యలు తీసుకోవడానికి అధికారం కల్పించారు.

ఇప్పటివరకూ సుమారు ఒకటిన్నర లక్షల కిలోల మత్తు మందులను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేస్తే, అందులో నలభై వేల కిలోలు ఒక్క ఈశాన్య రాష్ట్రాల్లోవే. ప్రభుత్వాలే కాకుండా వివిధ రంగాల ప్రజలు కూడా సమాజాన్ని జాగృతం చేస్తేనే మత్తు మహమ్మారిని అరికట్టగలం. కొన్ని సినిమాల్లో చూపిస్తున్న విధంగా డ్రగ్స్‌ సేవించడం, సైకోల్లా ప్రవర్తించడమే హీరోయిజంగా యువత భావిస్తే మనం కేవలం నిట్టూర్పు విడవాల్సి వస్తుంది.


- వ్యాసకర్త అసోసియేట్‌ ప్రొఫెసర్, దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన విభాగం, జేఎన్‌యూ ‘ 79089 33741

- డాక్టర్‌ గద్దె ఓంప్రసాద్‌

whatsapp channel

మరిన్ని వార్తలు