ట్రాఫిక్‌ పోలీస్‌.. ఇక 24/7 రోడ్ల మీదే

10 Mar, 2024 09:16 IST|Sakshi

ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు సమగ్ర ప్రణాళిక

అదనంగా 2,500 మంది సిబ్బంది నియామకానికి నిర్ణయం

ఫ్రీ లెఫ్ట్‌ బ్లాక్‌లు, వాహనాల బ్రేక్‌ డౌన్‌ల పరిష్కరించడమే వీరి పని

సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా వినియోగించేలా అవగాహన

సాక్షి, హైదరాబాద్: నగరవాసికి నిత్యం నరకప్రాయంగా మారిన ట్రాఫిక్‌ నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గంటల తరబడి నగరరోడ్లపై చిక్కుకుపోయి తిప్పలు పడుతున్న వాహనచోదకులకు ఊరట కలిగించేందుకు, పనిలో పనిగా వాయు, శబ్ద కాలుష్యానికి చెక్‌ పెట్టేందుకు పోలీసు శాఖ సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తోంది. అదనపు సిబ్బందితోనే వాహనాల రద్దీని అదుపు చేయడం సాధ్యమవుతుందని గుర్తించింది. ఈ మేరకు అదనపు ట్రాఫిక్‌ సిబ్బందిని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ ట్రై కమిషనరేట్లకు కలిపి అదనంగా 2,500 మంది ట్రాఫిక్‌ సిబ్బంది అవసరమని గుర్తించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 24/7 రోడ్ల మీదనే ఉంటూ వాహనాలు, ట్రాఫిక్‌ రద్దీని క్రమబద్ధీకరించడమే ఈ అదనపు సిబ్బంది పని.

►ఇటీవల పోలీసుఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించి నగర ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌కు 1,000, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్లకు 1,500 మంది అదనపు ట్రాఫిక్‌ సిబ్బందిని నియమించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.

ట్రాఫిక్‌ రద్దీ ఇలా..
ప్రధానంగా రహదారులపై ఫ్రీ లెఫ్ట్‌ బ్లాక్‌లు, వాహనాల బ్రేక్‌ డౌన్‌లే నగరంలో ట్రాఫిక్‌ సమస్యలకు ప్రధాన కారణాలని పోలీసులు గుర్తించారు. దీంతో ఆయా అంశాలపై తక్షణమే స్పందించేందుకు ఈ అదనపు ట్రాఫిక్‌ పోలీసులు రోజంతా రోడ్లపైనే ఉంచాలని నిర్ణయించారు. ఈ సిబ్బంది ప్రత్యేక ప్రణాళికలతో వర్షాకాలంలో రోడ్లపై ఎదురయ్యే సమస్యలను కూడా పరిష్కరించనున్నారు. ట్రాఫిక్‌ నిర్వహణలో భాగంగా ఇప్పటికే రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌లపై గ్రేటర్‌ ట్రాఫిక్‌ విభాగం కఠినంగా వ్యవహరించడం ప్రారంభించింది. ద్వి, మూడు చక్రాల వాహనాలకు రూ.200, నాలుగు, అంతకంటే ఎక్కువ చక్రాల వాహనాలకు రూ.700 చొప్పున జరిమానాలు విధిస్తోంది. అలాగే ట్రావెల్‌ బస్సులు, భారీ వాహనాలు నగర రోడ్లపై నిర్దేశిత సమయాల్లోనే వచ్చేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. దీంతో రోడ్లపై వాహనాల కదలికలు సాఫీగా, వేగంగా జరుగుతాయని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.

వ్యక్తిగత కార్ల వినియోగాన్ని తగ్గించేలా..
వాహనదారులు, కాలనీవాసుల సూచనల మేరకు అవసరమైన చోట యూ టర్న్‌లు, కూడళ్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇవి స్వల్ప కాలిక పరిష్కారం మాత్రమేనని, రోజూ నగర రోడ్లపైకి వస్తున్న వందలాది వాహనాలను తగ్గిస్తేనే శాశ్వత పరిష్కారం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత కార్ల వినియోగాన్ని తగ్గించి, సాధ్యమైనంత వరకు ప్రజారవాణా వ్యవస్థను వినియోగించేలా అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఎక్కువమంది ప్రజలు మెట్రో, బస్సులలో ప్రయాణిస్తే రోడ్లపై వాహనాల రద్దీ తగ్గడంతోపాటు వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని వివరించనున్నారు.

Election 2024

మరిన్ని వార్తలు