బస్సు లోయలో పడి 45 మంది మృతి

30 Mar, 2024 05:28 IST|Sakshi

కేప్‌ టౌన్‌: ఈస్టర్‌ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న వారిని బస్సు ప్రమాదం కబళించింది. దక్షిణాఫ్రికాలోని లింపొపొ ప్రావిన్స్‌లో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోగా ఒక్క చిన్నారి గాయాలతో సజీవంగా బయటపడింది. బోట్స్‌వానాకు చెందిన వీరంతా దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈస్టర్‌ ఉత్సవాలకు వెళ్తున్నారు. అదుపు తప్పిన బస్సు కొండప్రాంతంలోని ఎంమట్లకలా వద్ద వంతెన బారియర్లను ఢీకొట్టింది. ఆ పక్కనే ఉన్న 164 అడుగుల లోతైన లోయలో పడిపోయింది.

ముక్కలైన బస్సులో భారీగా మంటలు చెలరేగి కొందరు సజీవ దహనం కాగా, మరికొందరు దూరంగా పడిపోయారు. ఘటనలో డ్రైవర్‌ సహా మొత్తం 45 మంది ప్రాణాలు కోల్పోగా ఎనిమిదేళ్ల చిన్నారి మాత్రమే సజీవంగా బయటపడింది. మంటల్లో కొందరి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో నుజ్జయిన బస్సులో ఇరుక్కుపోయాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎనిమిదేళ్ల చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పొరుగు దేశం బొట్స్‌వానాకు చెందిన బాధితులంతా దక్షిణాఫ్రికాలోని మోరియా పట్టణంలో ఘనంగా జరిగే ‘జియోన్‌ క్రిస్టియన్‌ చర్చి’ ఈస్టర్‌ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫొసా బొట్స్‌వానా అధ్యక్షుడు మసిసితో ఫోన్‌లో మాట్లాడారు. ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అన్ని విధాలుగా సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈస్టర్‌ పండుగ రద్దీ సమయంలో రోడ్డు ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలని దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను సైతం చేపట్టినప్పటికీ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

బ్రిడ్జి పై నుంచి కింద పడి నేలను ఢీకొట్టిన తర్వాత బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. దీంతో ప్రమాదంలో మరణించిన కొందరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మాడిపోయాయి. కొన్ని మృతదేహాలు శిథిలాల కింద చిక్కుకుపోగా మరికొన్ని చెల్లాచెదురుగా పడిపోయాయి.  ఘటనా స్థలంలో రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు బోట్సువానా నుంచి మొరియా పట్టణానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది.  

ఇదీ చదవండి.. ప్రముఖ సైకాలజిస్ట్‌ కన్నుమూత

Election 2024

మరిన్ని వార్తలు