చైనాలో ‘డెల్టా’ కలవరం.. మరోసారి లాక్‌డౌన్‌

3 Aug, 2021 01:31 IST|Sakshi

బీజింగ్‌: కరోనా డెల్టా వేరియంట్‌ డ్రాగన్‌ దేశం చైనాను వణికిస్తోంది. సోమవారం 55 కొత్త కేసులు నమోదయ్యాయి. 20కిపైగా నగరాలు, పదికిపైగా ప్రావిన్స్‌ల్లో డెల్లా వేరియంట్‌ ఉనికి బయటపడింది. దీంతో డెల్టా వేరియంట్‌న వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తోంది. నాన్‌జింగ్‌లో రష్యా నుంచి వచ్చిన విమానాన్ని శుభ్రం చేసిన 9 మంది ఎయిర్‌పోర్టు కార్మికులకు డెల్టా వేరియంట్‌ సోకినట్లు నిర్ధారణ కావడం గమనార్హం. బీజింగ్‌సహా పెద్ద నగరాల్లో కరోనా పరీక్షల సంఖ్యను భారీగా పెంచారు.

హునాన్‌ ప్రావిన్స్‌లోని జుజౌ సిటీలో సోమవారం లాక్‌డౌన్‌ విధించారు. దీంతో 10.2 లక్షల మంది ఇళ్లకే పరిమితమయ్యారు. బీజింగ్‌లో డెల్టా వేరియంట్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి బీజింగ్‌లోకి పర్యాటకులు రాకుండా ఆంక్షలు విధించారు. ఇక పర్యాటక ప్రాంతమైన జాంగ్‌జీజియాజీలో శుక్రవారం లాక్‌డౌన్‌ అమలు చేశారు. చాంగ్‌పింగ్‌లోనూ గత వారం లాక్‌డౌన్‌ విధించారు.

తాజాగా హైనన్, హెనాన్‌ ప్రావిన్స్‌ల్లో కొత్త కేసులు అధికంగా బయటపడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కోవిడ్‌–19 ఒరిజినల్‌ వెర్షన్‌ కంటే డెల్టా వేరియంట్‌ మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణులు ఇప్పటికే గుర్తించారు. కరోనా వ్యాక్సినేషన్‌ నెమ్మదిగా సాగుతున్న వియత్నాం, థాయ్‌లాండ్, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాల్లో ఈ వేరియంట్‌ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. జపాన్, దక్షిణ కొరియాలోనూ డెల్టా వేరియంట్‌ కేసులు పెరుగుతున్నాయి. డెల్టా నియంత్రణకు ఆస్ట్రేలియా ప్రయత్నిస్తోంది. పెద్ద నగరమైన సిడ్నీలో చాలారోజులుగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.  

మరిన్ని వార్తలు