భారత్‌లో పరిస్థితి తీవ్ర ఆందోళనగా ఉంది..సైన్యాన్ని దించండి

5 May, 2021 01:17 IST|Sakshi

అవసరమైతే సైన్యాన్ని రంగంలోకి దించండి

భారత్‌ ప్రభుత్వానికి అమెరికా నిపుణుడు ఫౌచీ సూచన 

భారత్‌లో కోవిడ్‌ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని వ్యాఖ్య

వాషింగ్టన్‌: భారత్‌లో కోవిడ్‌ తీవ్రత చాలా ఆందోళనకర స్థాయిలో ఉందని అమెరికా ఉన్నతస్థాయి ఆరోగ్య నిపుణుడు డాక్టర్‌ ఆంథోనీ ఫౌచీ వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు సర్వశక్తులూ వినియోగించు కోవాలనీ, తక్షణమే తాత్కాలిక కోవిడ్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వానికి ఆయన సూచించారు. అవసరమైతే సైన్యాన్ని కూడా రంగంలోకి దించాలన్నారు. కేవలం వైద్య సామగ్రి అందించడమే కాదు, వైద్య సిబ్బందిని కూడా భారత్‌కు పంపించాలని ఇతర దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

భారత్‌లో కోవిడ్‌ కేసులు మూడు నెలల్లోనే రెట్టింపై 2 కోట్లు దాటి పోవడంతోపాటు, మహమ్మారి బారిన పడి 2.20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలెర్జీ, ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌ డైరెక్టర్, అధ్యక్షుడు జో బైడెన్‌కు చీఫ్‌ మెడికల్‌ అడ్వైజర్‌ అయిన డాక్టర్‌ ఫౌచీ(80) పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు తెలిపారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఇన్ఫెక్షన్‌ వ్యాప్తిని నిలువరించేందుకు భారత్‌లో కొన్ని వారాలపాటైనా లాక్‌డౌన్‌ విధించడం మేలన్నారు.

‘కోవిడ్‌ వ్యాప్తి తీవ్రతతో భారత్‌ చాలా ఒత్తిడికి గురవుతోంది. అమెరికా మాదిరిగానే మిగతా దేశాలు కూడా భారత్‌కు సాయం అందించేందుకు ముందుకు రావాలి. భారత్‌లో కోవిడ్‌ చికిత్సలో ఉపయోగించే వైద్య సామగ్రి కొరత ఉన్న దృష్ట్యా ప్రపంచ దేశాలు అవసరమైన ఆ సామగ్రిని అందజేయాలి. దీంతోపాటు వైద్య సిబ్బందిని కూడా పంపించాలి’అని విజ్ఞప్తి చేశారు. ‘అదే సమయంలో, వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం పౌరులందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలి. భారత్‌లో అభివృద్ధి పరిచిన రెండు టీకాలతోపాటు, అమెరికా, రష్యాతోపాటు ఇందుకోసం ముందుకు వచ్చే మరే ఇతర దేశాలకు చెందిన సంస్థల నుంచయినా సరే కూడా టీకాలను సేకరించి సాధ్యమైనంత మందికి ఇవ్వడం తక్షణం ప్రారంభించాలి. టీకా ఇవ్వడం వల్ల ప్రస్తుతానికి సమస్య పరిష్కారం కాకపోవచ్చు. కానీ, కొన్ని వారాలపాటు వ్యాధి వ్యాప్తిని నిరోధించవచ్చు’అని ఫౌచీ పేర్కొన్నారు.

కరోనా మహమ్మారిని నిలువరించేందుకు భారత్‌ తక్షణం తీసుకోవాల్సిన చర్యలతోపాటు దీర్ఘకాలంలో చేపట్టాల్సిన వాటిని డాక్టర్‌ ఫౌచీ సూచించారు. వేల సంఖ్యలో కోవిడ్‌ బారినపడిన వారికి చికిత్స అందించేందుకు భారత ప్రభుత్వం ఖాళీగా ఉన్న స్థలాల్లో తక్షణం తాత్కాలిక ఆస్పత్రులను నిర్మించాలి. ఇందుకోసం సైన్యం సాయాన్ని తీసుకోవాలి. గత ఏడాది కోవిడ్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో చైనా ఇదే చేసింది’అని ఆయన చెప్పారు.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు