ఎంత బుల్లిగా ఉన్నావే.. ‘బ్రూకీసియా నానా’

3 Feb, 2021 09:10 IST|Sakshi

ప్రపంచంలోని అతి చిన్న సరీసృపంగా గుర్తింపు పొందిన ఊసరవెల్లి

ఈ ప్రపంచంలో అత్యంత చిన్నగా లేదా పెద్దగా ఉండే వస్తువులకైనా.. జీవులకైనా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఈ కోవకు చెందిన అతి చిన్న ఊసరవెల్లిని తాజాగా పరిశోధకులు గుర్తించారు. మడగాస్కర్‌లో  అత్యంత తక్కువ పరిమాణంలో ఉన్న మగ ఊసరవెల్లి ఒకదానిని జర్మనీ, మలగాసేకు చెందిన పరిశోధనా బృందం కనుగొంది. చాలా చిన్నగా ఉన్న ఈ ఊసరవెల్లి ప్రపంచంలోని అతి చిన్న సరీసృపంగా గుర్తింపు పొందింది. ఊసరవెల్లి ముక్కు నుంచి చివరి వరకు అర అంగుళం (13.5 ఎంఎం) మాత్రమే ఉంది. ఇది మన వేలి కొనమీద నిలబడితే చిన్న బొమ్మలా కనిపిస్తుంది. దీనిని గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఊసరవెల్లికి ‘బ్రూకీసియా నానా’గా నామకరణం చేశారు. 

తోకతో కలిపి కొలిస్తే ఈ ఊసరవెల్లి కేవలం 22 ఎంఎం(మిలీమీటర్లు) మాత్రమే ఉంది. అయితే ఈ జాతిలో ఆడ ఊసరవెల్లి తోకతో కలిపి కొలిస్తే 29 ఎంఎంగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. మైక్రో సిటీ స్కాన్స్, త్రీడైమెన్షనల్‌ ఎక్స్‌రేస్‌ సాయంతో  ఆడ ఊసరవెల్లిలో రెండు గుడ్లు గుర్తించినట్లు వివరించారు. ఇప్పటిదాక గుర్తించిన 51 ఇతర రకాల ఊసరవెల్లులతో పోలిస్తే ఇదే అత్యంత చిన్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. మడగాస్కర్‌ అరుదైన ప్రాణులకు ఆవాసమని, ఇప్పటిదాక ఈ ప్రాంతంలో 200కు పైగా జాతులను కనుగొన్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎంతో బుజ్జిగా ఉన్న ఈ బుల్లి ఊసరవెల్లి ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. 
 

మరిన్ని వార్తలు