చైనా ఆయిల్‌ నౌకపై ‘హౌతీ’ల మిసైల్‌ దాడి

24 Mar, 2024 14:08 IST|Sakshi

వాషింగ్టన్‌: ఎర్ర సముద్రంలో వాణిజ్యనౌకలపై హౌతీలు దాడులు పెంచారు. తాజాగా శనివారం(మార్చ్‌ 23) యెమెన్‌ తీరానికి సమీపంలో చైనాకు చెందిన ఆయిల్‌ ట్యాంకర్‌ నౌక ఎంవీ హంగ్‌ పూ పై హౌతీలు బాలిస్టిక్‌ మిసైళ్లతో దాడి చేశారు. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ ముఖ్య కార్యాలయం సెంట్రల్‌ కమాండ్‌(సెంట్‌ కామ్‌) ఆదివారం(మార్చ్‌ 24) ఎక్స్‌(ట్విటర్‌)లో ధృవీకరించింది. పనామా ఫ్లాగ్‌తో నడుస్తున్న ఈ నౌకను చైనా యాజమాన్యం నిర్వహిస్తోంది.

ఆయిల్‌ ట్యాంకర్‌ నౌక భారత్‌లోని మంగళూరు పోర్టుకు రావాల్సి ఉంది.  ఈ దాడిలో నౌకలోని సిబ్బంది ఎవరూ గాయపడలేదు. నౌకలో మంటలు చెలరేగినప్పటికీ 30 నిమిషాల్లో వాటిని ఆర్పివేశారు. అనంతరం నౌక మళ్లీ ప్రయాణం ప్రారంభించింది. చైనా, భారత్‌ నౌకలపై ఎలాంటి దాడులు చేయబోమని చెప్పిన హౌతీలు తాజా దాడితో మాట తప్పారు.

కాగా ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా హౌతీ మిలిటెంట్లు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై గత కొంతకాలంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడుల కారణంగా ఆసియా నుంచి అమెరికా, యూరప్‌ వెళ్లే నౌకలకు దూరం పెరిగి ఖర్చు మోపెడవుతోంది. యెమెన్‌లోని హౌతీల స్థావరాలపై అమెరికా, బ్రిటన్‌లు ఎప్పటికప్పుడు దాడులు చేస్తన్నాయి. 

ఇదీ చదవండి.. ఉక్రెయిన్‌పై రష్యా మిసైళ్ల వర్షం.. అందుకు  ప్రతీకారమే !

Election 2024

మరిన్ని వార్తలు