కరోనా వ్యాక్సిన్‌ : ఫైజర్‌ పురోగతి

9 Nov, 2020 18:14 IST|Sakshi

 తుది దశ ఫలితాల్లో 90శాతం విజయవంతం : ఫైజర్‌

 చివరి దశ  ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలను ప్రకటించిన తొలి సంస్థగా ఫైజర్

"ఇది చారిత్రక క్షణం " :  ఫైజర్

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సిన్‌ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇందుకోసం శాస్త్రవేత్తలు, వివిధ ఔషధ సంస్థలు వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెచ్చేందుకు భారీ కసరత్తు చేస్తున్నాయి. దాదాపు పదికిపైగా వ్యాక్సిన్లు చివరి దశ ప్రయోగాల్లో ఉన్న సమయంలో ఫైజర్ ప్రకటన ఊరటనిస్తోంది. వ్యాక్సిన్‌ తుది దశ పరీక్షల ఫలితాల్లో పురోగతి సాధించామంటూ ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఫైజర్‌​ సోమవారం కీలక విషయాన్ని ప్రకటించింది. దీంతో చివరి దశ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలను ప్రకటించిన మొట్టమొదటి సంస్థగా ఫైజర్ నిలిచింది. (కరోనా టెస్ట్  : 90 నిమిషాల్లోనే ఫలితం)

కోవిడ్-19 నివారణలోతమ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తోందని  చివరి ట్రయల్స్‌ ద్వారా తెలుస్తోందని ప్రకటించింది. జర్మన్ ఔషధ తయారీదారు బయోన్‌టెక్‌తో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన ఫైజర్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఎలాంటి వైరస్ లక్షణాలు లేని ట్రయల్ వాలంటీర్లలో వ్యాధిని నివారించడంలో 90 శాతం కంటే ఎక్కువ ప్రభావవంతంగా తమ వ్యాక్సిన్‌ ఉందని తాజా విశ్లేషణలో తేలిందని తెలిపింది. తీవ్రమైన ఇతర భద్రతా సమస్యలేవీ గమనించలేదని పేర్కొంది. ఈ ఫలితాలు మరింత నిర్ధారణైతే, అత్యంత ప్రభావవంతమైన మీజిల్స్ వ్యాక్సిన్లతో సమానంగా తమ కరోనా వ్యాక్సిన్‌ ఉంటుందని వ్యాఖ్యానించింది. 

కరోనా మహమ్మారి సంక్షోభ పరిస్థితిలో ఒక  ఏడాదిలోనే వ్యాక్సిన్‌తో ముందుకు వచ్చామని, ఇది ఎవ్వరూ సాధించని గొప్ప లక్ష్యమని  "ఇది చారిత్రక క్షణం" అని ఫైజర్‌ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టీకా పరిశోధన, అభివృద్ధి అధికారి కాథరిన్ జాన్సెన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఇది ప్రధాన విజయమని  బయాన్‌టెక్‌ సీఈవో ఉగుర్ సాహిన్ తెలిపారు. తమ వ్యాక్సిన్‌ రోగనిరోధకత ప్రభావం కనీసం ఒక సంవత్సరం పాటు ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. సిఫారసు చేయబడిన రెండు నెలల భద్రతా డేటాను సమీక్షించిన ఫైజర్ ఈ నెల చివరిలో రెండు మోతాదుల వ్యాక్సిన్ అత్యవసర అధికారం కోసం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌ను కోరాలని యోచిస్తోంది. ఈ సంవత్సరం చివరి నాటికి 15 నుంచి 20 మిలియన్ల మోతాదులను తయారు చేస్తుందని కంపెనీ అధికారులు తెలిపారు. 2021 చివరికి 130 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని సరఫరా చేసేందుకు సిద్దమవుతున్నామన్నారు.

కాగా  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడుగా ట్రంప్‌పై‌ బైడెన్‌ విజయం సాధించిన  రోజుల వ్యవధిలోనే ఈ శుభవార్త అందడం విశేషం. నవంబర్ 3న ఎన్నికల రోజుకు ముందు టీకా సిద్ధంగా ఉంటుందని ట్రంప్ పదేపదే నొక్కి వక్కాణించడం గమనార్హం. తమ పరీక్షలన్నీ విజయవంతమైతే అక్టోబర్ నాటికి రెగ్యులేటరీ అనుమతులు లభిస్తాయని, నవంబరు నాటికి  వ్యాక్సిన్‌ సిద్దంగా ఉంటుందని ఫైజర్ సీఈఓ డాక్టర్ ఆల్బర్ట్ బౌర్లా ఇప్పటికే ప్రకటించారు. 5 కోట్ల మందికి 15 వేల కోట్ల రూపాయలకు వ్యాక్సిన్‌ను విక్రయించేందుకు అమెరికా ప్రభుత్వంతో ఫైజర్ ఒప్పందం కూడా కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. పదకొండు టీకాల ప్రయోగాలు చివరి దశలో ఉండగా, వీటిలో నాలుగు అమెరికానుంచే ఉన్నాయి. మరోవైపు త్వరలోనే ప్రారంభ ఫలితాలు రావచ్చని అమెరికా ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ భాగస్వామ్యంతో వ్యాక్సిన్‌ రూపొందిస్తున్న అమెరికా బయోటెక్ కంపెనీ మోడెర్నా ఇటీవల ప్రకటించింది. 

మరిన్ని వార్తలు