కరోనా చైనా శాస్త్రవేత్తల సృష్టే.. అందుకే ఆ మౌనం

30 May, 2021 18:33 IST|Sakshi

- వెల్లడించిన నూతన అధ్యయనాలు

- సహజ వైరస్‌గా నమ్మించేందుకు కుయుక్తులు 

లండన్‌: కరోనా వైరస్‌ సహజంగా వచ్చింది కాదని... దాన్ని చైనా శాస్త్రవేత్తలు ల్యాబ్‌లో రూపొందించారని యూరప్‌ శాస్త్రవేత్తలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. కృతిమంగా ల్యాబ్‌లో తయారు చేసి దాన్ని సహజంగా వచ్చినట్టు నమ్మించేందుకు రివర్స్‌ ఇంజనీరింగ్‌ పద్దతిని పాటించారంటూ వివరిస్తున్నారు. ‍ బ్రిటీష్‌ ప్రొఫెసర్‌ అంగూస్‌  డాల్‌గ్లైయిష్‌, నార్వేజియన్‌ సైంటిస్ట్‌ బిర్గెన్‌ సోరేన్‌సెన్‌ చేపట్టిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైనట్టు డెయిల్‌ మెయిల​పత్రికలో కథనం వచ్చింది. 

వూహాన్‌ ల్యాబ్‌ నుంచే
కరోనా వైరస్‌ సహజంగా వచ్చిందని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవని యూరోపియన్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గెయిన్‌ ఆఫ్‌ ఫంక‌్షన్స్‌ పేరుతో చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా వూహాన్‌లోని ల్యాబ్‌లో ఈ వైరస్‌ను శాస్త్రవేత్తలు తయారు చేశారని వారు ఆరోపిస్తున్నారు. చైనా గుహల్లో ఉన్న గబ్బిలాల నుంచి సేకరించిన కరోనా వైరస్‌తో తాము పరిశోధనలు చేశామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌ను ల్యాబ్‌లోనే రూపొందించారని చెప్పడానికి తమ వద్ద గట్టి ఆధారాలు ఉన్నాయని ప్రకటించారు. 

డాటాను నాశనం చేశారు
ఉద్దేశపూర్వకంగానే చైనా శాస్త్రవేత్తలు ఈ వైరస్‌ను తయారు చేశారని, దీనికి సంబంధించిన డాటాను సైతం మాయం చేశారని యూరప్‌ పరిశోధకులు ఆరోపిస్తున్నారు. వూహన్‌ ల్యాబ్‌లోనే వైరస్‌ తయారైందంటూ ఎన్ని ఆరోపణలు వచ్చినా చైనా సైంటిస్టులు మౌనం వహిస్తున్నారు తప్పితే ... సరైన వివరణ ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. 22 పేజీల తమ పరిశోధన పత్రాలు ఇ‍ప్పటికే సైంటిఫిక్‌ జర్నల్స్‌లో ప్రచురితమైనా చైనా నుంచి ఖండన లేదన్నారు. 

పాజిటివ్‌ ఛార్జీలు
కరోనా వైరస్‌ స్పైక్స్‌కి పాజిటివ్‌ ఛార్జీతో ఉన్నాయని.. నెగటివ్‌ చార్జీతో ఉండే మానవ శరీర భాగాల వైపు ఇవి ‍త్వరగా ఆకర్షితం అవుతున్నాయని, అందుకే వైరస్‌ వ్యాప్తి వేగం, శరీరంపై ప్రభావం ఎక్కుగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు ఒక్కో వైరస్‌పై పాజిటివ్‌ ఎనర్జీ ఉన్న స్పైక్‌లు నాలుగు వరకు ఉంటున్నాయని, సహజ సిద్ధంగా అయితే మూడుకు మించి పాజిటివ్‌ స్పైక్‌లు ఉండడానికి వీళ్లేదంటున్నారు.  చైనా శాస్త్రవేత్తలే కృతిమంగా నాలుగు పాజిటివ్‌ ఛార్జీ  స్పైకులు ఉండేలా కరోనా వైరస్‌కి మార్పులు చేశారని వెల్లడిస్తున్నారు. కరోనా వైరస్‌  చైనాలో బ్రేక్‌ అవుట్‌ అవగానే రెట్రో ఇంజనీరింగ్‌ ద్వారా ఆ వైరస్‌ సహజంగా వచ్చినట్టుగా నమ్మించే ప్రయత్నం చేసిందన్నారు. కరోనా వైరస్‌ సహజంగా వచ్చింది కాదని, వూహన్‌ ల్యాబ్‌ నుంచే పుట్టిందనే ఆరోపణలు ఏడాది కాలంగా వస్తున్నాయి. అయితే యూరోపియన్‌ శాస్త్రవేత్తలు గట్టి ఆధారాలతో చైనాపై విమర్శలు ఎక్కు పెట్టారు. 
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు