ఆస్ట్రాజెనెకా టీకా: రక్తం గడ్డకట్టి ఏడుగురు మృతి

4 Apr, 2021 05:18 IST|Sakshi

రక్తం గడ్డకట్టే సమస్యతో ఏడుగురు మృతి

టీకా సురక్షితమేనంటున్న యూకే ఔషధ నియంత్రణ సంస్థ

లండన్‌: యూకేలో ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టిన సమస్యలతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని యూకే ఔషధ నియంత్రణ సంస్థ నిర్ధారించింది. మార్చి 24వ తేదీ వరకు 1.81 కోట్ల మంది వ్యాక్సిన్‌ తీసుకుంటే 30 మందిలో రక్తం గడ్డ కట్టే సమస్య తలెత్తిందని, వారిలో ఏడుగురు మరణించారని మెడిసన్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఏ) వెల్లడించింది. కోట్లాది మంది వ్యాక్సిన్‌ తీసుకుంటే కొంతమందిలో ఏదో ఒక దుష్ప్రభావం కనిపించడం సాధారణంగా జరిగేదేనని ఆ సంస్థ తెలిపింది.

ఈ వ్యాక్సిన్‌ అత్యంత సురక్షితమని, నిర్భయంగా అందరూ టీకా తీసుకోవచ్చునని స్పష్టం చేసింది. ఈ వ్యాక్సిన్‌తో యాంటీ బాడీలు బాగా ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొంది. రక్తం గడ్డ కట్టే సమస్య కేవలం ఈ వ్యాక్సిన్‌ ద్వారా వచ్చిందా లేదా వారిలో మరేమైనా అనారోగ్య సమస్యలున్నాయా అన్న దానిపై విచారణ జరుపుతోంది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారత్‌లోని పుణేలో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ కోవిషీల్డ్‌ పేరుతో ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్‌తో భారత్‌లో ఎలాంటి సైడ్‌ అఫెక్ట్‌లు కనిపించలేదు.

>
మరిన్ని వార్తలు