పైత్యం ఎక్కువైతే ఇలాంటివే జ‌రుగుతాయి

1 Aug, 2020 17:50 IST|Sakshi

సియోల్ : క‌రోనా వైర‌స్ జ‌నాల‌ను ఎంత భ‌య‌పెడుతుందో చెప్ప‌డానికి ఈ వార్తను ఉదాహ‌ర‌ణగా చెప్పుకోవ‌చ్చు. మ‌నం ముట్టుకునే ప్ర‌తీచోట వైర‌స్ ఉంటుందో లేదో తెలియ‌దు గాని... మ‌నం చేసే ప‌నులు ఒక్కోసారి తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. క‌రోనా వైర‌స్‌కు భ‌య‌ప‌డి మ‌నం తినే కూర‌గాయ‌లు నుంచి వాడే ప్ర‌తి వ‌స్తువును శుభ్రం చేసే  తీసుకుంటున్నాం. ఇది మంచిదే.. క‌రెన్సీ నోట్ల‌కు వైర‌స్ ఉంటుందా లేదా అన్న‌ది ప‌క్క‌న‌పెడితే.. ఒక‌వేళ ఉన్నా వాటిని ఒక‌సారి నీళ్ల‌లో ముంచి ఎండ‌లో పెడితే స‌రిపోతుంది. కానీ ఇక్క‌డ ఒక ప్ర‌బుద్దుడు వైర‌స్ సోకుంతుందేమోన‌ని భ‌య‌ప‌డి వాటిని వాషింగ్ మెషిన్‌లో వేశాడు. ఇంకేముంది మంచిగా ఉన్న క‌రెన్సీ నోట్ల‌న్నీ నిమిషాల్లో చిత్తుకాగితాల్లా మారిపోయాయి. వైర‌స్ రాకుండా శుభ్ర‌త పాటించ‌డం మంచిదే.. కానీ ఆ శుభ్ర‌త మ‌రీ ఎక్కువైపోతే ఇలాంటి ఘ‌ట‌న‌లే చోటుచేసుకుంటాయి.(పొగాకు నుంచి కోవిడ్‌ వ్యాక్సిన్‌?)

ఈ ఘ‌ట‌న ద‌క్షిణ‌కొరియాలోని సియోల్‌లో చోటుచేసుకుంది. సియోల్‌కు చెందిన ఒక వ్య‌క్తికి త‌న కుటుంబ‌స‌భ్యుని అంత్య‌క్రియ‌లు జ‌రిపించ‌మ‌ని అత‌ని బంధువులు, మిత్రులు 50వేల వాన్ (కొరియా క‌రెన్సీ) అంద‌జేశారు. మ‌న ఇండియ‌న్ క‌రెన్సీలో దీని విలువ సుమారు 3వేల రూపాయ‌లు. అయితే వారు ఇచ్చిన డ‌బ్బుకు క‌రోనా వైర‌స్ ఉందన్న అనుమానం అత‌నికి వ‌చ్చింది. వాషింగ్ మెషిన్‌లో ఆ నోట్ల‌ను వేస్తే వైర‌స్ సోకకుండా డిస్ ఇన్ప్‌క్ట్ చేస్తుంద‌ని భావించాడు.అంతే ఆ నోట్ల‌న్నీ తీసి వాషింగ్ మెషిన్‌లో వేశాడు. ఒక్కరౌండ్ స్పిన్ అవ‌గానే నోట్ల‌ను బ‌య‌టికి తీసి చూడ‌గా చాలా వ‌రకు నోట్లు చిరిగిపోయి ఉన్నాయి.

దీంతో ఆ వ్య‌క్తి ప‌రుగున బ్యాంకుకు వెళ్లి అసలు విష‌యం చెప్పి స‌హాయం చేయాల‌ని కోరాడు. అయితే బ్యాంకు అధికారులు ఆ నోట్ల‌ను ప‌రిశీలించి ఇవి చెల్ల‌వ‌ని.. ఏ స‌హాయం చేయ‌లేమ‌ని చేతులెత్తేశారు. దీంతో బాధితుడు ల‌బోధిబోమంటూ ఎలాగైనా త‌న‌ను ఆదుకోవాల‌ని విన్న‌వించుకున్నాడు. అధికారులు ఈ విష‌యాన్ని మేనేజ‌ర్ సియో జున్ వోన్ దృష్టికి తీసుకెళ్లారు. నోట్ల‌లో చాలా వ‌ర‌కు చిరిగిన‌వి ఉన్నాయ‌ని.. మంచి నోట్ల‌ను ప‌రిశీలించి చూడ‌గా కేవ‌లం 507 వాన్‌లు మాత్ర‌మే బాగున్నాయ‌ని చెప్పి బాధితుడికి అంతే మొత్తం ఇచ్చి అక్క‌డినుంచి పంపించేశారు. ద‌య‌చేసి క‌రెన్సీ నోట్ల‌ను వాషింగ్ మెషిన్‌, ఓవెన్ల‌లో వేయొద్ద‌ని ప్ర‌జ‌ల‌కు బ్యాంకులు విజ్ఞ‌ప్తి చేశాయి.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు