సైబర్‌ దాడుల కలకలం.. ఇంటర్నెట్‌ ఉన్నా ఉన్నట్లుండి ఆఫ్‌లైన్!

5 Mar, 2022 14:18 IST|Sakshi

ఉక్రెయిన్‌ పరిణామాల నేపథ్యంలో సైబర్‌ దాడుల కలకలం కొనసాగుతోంది. భారీగా బ్యాంకింగ్‌, ప్రభుత్వ ముఖ్యంగా రక్షణ వ్యవస్థకు సంబంధించిన వెబ్‌సైట్లపై పడుతున్నారు హ్యాకర్లు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం యూరప్‌ వ్యాప్తంగా వేలమంది ఇంటర్నెట్‌ యూజర్లకు ఒక్కసారిగా ఆఫ్‌లైన్‌ షాక్‌ తగిలింది. 

యూరప్‌లో జర్మనీ, ఫ్రాన్స్‌, హంగేరీ, గ్రీస్‌, ఇటలీ, పోలాండ్‌ దేశాల్లోని తమ క్లయింట్‌లకు ఇంటర్నెట్‌ సేవలకు విఘాతం ఏర్పడిందని, ఈ మేరకు 40వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని, ఇదేం సాంకేతిక సమస్యకాదని ఒక ప్రకటన విడుదల చేసింది శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల కంపెనీ బిగ్‌బ్లూ‌. మరోవైపు ఆరెంజ్‌ కంపెనీ(నోర్‌డెంట్‌) కూడా 9వేల మంది ఫ్రాన్స్‌ సబ్‌స్క్రయిబర్లు ఇబ్బంది పడినట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. వీటితో పాటు మరో ఆరు ప్రధానమైన ఇంటర్నెట్‌ సేవల కంపెనీలు సైతం సేవలకు విఘాతం కలిగినట్లు ప్రకటన విడుదల చేశాయి.    

మరోవైపు బుధవారం కూడా ఇదే తరహాలో ఇబ్బందులు ఎదురయ్యాయని, ఇది కచ్చితంగా సైబర్‌ దాడులేనని యూఎస్‌కు చెందిన వయాశాట్‌ ప్రకటించింది. ప్రధానంగా హ్యాకర్లు శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలపైనే దృష్టి సారిస్తుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇదిలా ఉండగా.. యుద్ధ పరిస్థితుల్లో ఉక్రెయిన్‌లో కొత్త డేటా-నాశన వైరస్‌ని సైబర్‌ సెక్యూరిటీ కంపెనీలు గుర్తించాయి. అయితే దీని వాస్తవ ప్రభావాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు