‘కరోనా’ అంటే ఎందుకు భయం పోయింది?

24 Nov, 2020 16:55 IST|Sakshi

మాస్కులు ధరించడం మానేశారేందుకు?

ఉద్దేశాలకు, ప్రవర్తనకు మధ్య వ్యత్యాసమే కారణమా?

లండన్‌: ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రాణాంతక కరోనా వైరస్‌ రెండో విడత దాడి కొనసాగుతోందని, తగిన ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే ప్రస్తుతానికున్న మార్గమని యూరప్‌ దేశాల ప్రభుత్వాలు మైకులు పట్టుకొని చెబుతున్నా ఆయా దేశాల ప్రజలు అంతగా పట్టించుకోవడం లేదు. బ్రిటన్‌లోనైతే రహస్య పార్టీలు, రేవ్‌ పార్టీలు జరుపుకుంటూనే ఉన్నారు. ఆరడుగుల దూరానికి అర్థం, స్వీయ నిర్బంధానికి నిర్వచనమే మారుపోయింది. ఇరుగు పొరుగు వారు కలసుకుంటూనే ఉన్నారు. పార్కుల వెంట, పబ్బుల వెంట తిరగుతూనే ఉన్నారు. ఎక్కువ మంది మాస్కులు కూడా ధరించడం లేదు. ఎందుకు..?

బ్రిటన్‌ ప్రజల ఉద్దేశాలకు, వారి ప్రవర్తనకు మధ్య వ్యాత్యాసం ఉండడం వల్లనే కరోనా కట్టడికి క్రమక్షిణ తప్పుతోందని, దీన్ని ఆంగ్లంలో ‘ఇంటెన్షన్‌–బిహేవియర్‌ గ్యాప్‌’ అంటారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రజలు ముందు జాగ్రత్త హెచ్చరికలన్నీ పెడ చెవిన పెడుతున్నారన్న కారణంతో వదిలి పెట్టరాదు, పదే పదే పటిష్టంగా హెచ్చరికలు చేస్తుంటేనే ప్రజల ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఇందుకు మంచి ఉదాహరణ వియత్నాం ప్రభుత్వం. కరోనా జాగ్రత్తల పట్ల మంచి అవగాహన కల్పించడానికి అక్కడి ప్రభుత్వం అన్ని మాధ్యమాలను ఉపయోగించుకొని విస్తృతంగా ప్రచారం చేయడం కలసి వచ్చిందని, పర్యవసానంగా కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గింది. మృతులు కూడా గణనీయంగా తగ్గాయి. (చదవండి: ప్రపంచానికి శనిలా పట్టుకుంది!)

వియత్నాం ప్రచారంలో ఓ పాప్‌ సాంగ్‌ కూడా విస్తృతంగా తోడ్పడింది. ఈ విషయంలో జర్మనీ, న్యూజిలాండ్‌ దేశాలు కూడా విజయం సాధించడానికి వాటి పటిష్టమైన కమ్యూనికేషన్ల వ్యవస్తే కారణమని ‘పీఆర్‌ ప్రొఫెషనల్స్‌’ సర్వేలో తేలింది. ప్రజల మైండ్‌ సెట్‌ మారడానికి ‘కమ్యూనికేషన్‌’ అత్యంత ముఖ్యమైనదని మానసిక శాస్త్రవేత్తలు ఎప్పుడో తేల్చారు. రిస్క్‌ ఎక్కువగా ఉన్న విమానయానం, చమురు పరిశ్రమల్లో అప్రమత్తత, ముందస్తు జాగ్రత్తల గురించి ఎక్కువగా ప్రచారం చేయాల్సి ఉంటుంది. సింగపూర్‌ ప్రభుత్వం అక్కడి పౌరులందరికి ‘ఎలక్ట్రానిక్‌ ట్రేసింగ్‌ టోకెన్లు’ పంచింది.

బ్రిటన్‌లో కూడా ఎన్‌హెచ్‌ఎస్, కోవిడ్‌–19 యాప్‌ను ప్రవేశపెట్టగా 1.86 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అయితే ఇంగ్లండ్, వేల్స్‌లో 30 శాతం ప్రజల వద్దనే స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి. కరోనా వైరస్‌ నుంచి పొంచి ఉన్న ముప్పు గురించి పదే పదే హెచ్చరించడం వల్ల ప్రయోజనం ఉండదని, అది ప్రజల హృదయాల్లో నాటుకునేలా సమాచారాన్ని తీసుకెళ్లడం, ప్రజలు తమ ప్రవర్తనను మార్చుకునేంతగా ఆకట్టుకోవడం అవసరమని కమ్యూనికేషన్ల నిపుణులు సూచిస్తున్నారు. (చదవండి: యూరప్‌లో థర్డ్‌ వేవ్‌)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు