Disease X: కోవిడ్‌ను మించిన వ్యాధి మనల్ని కబళిస్తుందా?

23 Jan, 2024 11:44 IST|Sakshi

మొన్నటి వరకూ ప్రపంచాన్ని కోవిడ్-19 వణికించింది. దీని నుంచి కాస్త దూరవుతున్నామనేంతలోనే ఇప్పుడు మరొక ప్రాణాంతక వ్యాధి సమస్త మానవాళిని చుట్టుముట్టేలా  ఉంది. ప్రపంచవ్యాప్తంగా త్వరగా వ్యాపించగల  ఈ కొత్త వ్యాధికి ‘డిసీజ్ ఎక్స్‌’ అనే పేరు పెట్టారు. కరోనా మాదిరిగానే ఈ వ్యాధి కూడా మనిషి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ప్రాణాలను కూడా మింగేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2016లోనే ఈ వ్యాధి పేరును మొదటిసారి ప్రకటించింది. భవిష్యత్తుకు ముప్పుగామారిన ఈ వ్యాధి విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తీవ్రంగా హెచ్చరించింది.

2019లో కోవిడ్-19 వేగంగా వ్యాపించడం వల్ల అనేక దేశాలలో బాధితులకు సహాయం చేయడానికి తగినంత మంది వైద్యులు, నర్సులు, మందులు, పరికరాలు అందుబాటులో లేక  అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పటికీ కోవిడ్-19 ప్రపంచానికి పెద్ద సమస్యగానే ఉంది.

కొందరు శాస్త్రవేత్తలు డిసీజ్ ఎక్స్‌ వ్యాధి నుంచి మానవాళిని రక్షించేందుకు వ్యాక్సిన్లను తయారు చేసేందుకు కృషి చేస్తున్నారు. కోయలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇన్నోవేషన్స్ అనే గ్రూప్‌ వ్యాక్సిన్‌ తయారీకి కృషిచేస్తోంది. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ కొత్త వ్యాధి గురించి సమగ్రంగా తెలుసుకున్న తర్వాత వ్యాక్సిన్లను తయారీ సులభమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

అంచనాలకు అందని డిసీజ్ ఎక్స్‌ 
డిసీజ్ ఎక్స్‌ ఎంత ఘోరంగా  ఉండనుందో ఇప్పటికీ శాస్త్రవేత్తలు అంచనావేయలేకపోతున్నారు. ఇది తేలికపాటి జలుబు మాదిరిగా ఉండవచ్చు లేదా కోవిడ్-19 కంటే చాలా ప్రాణాంతకం కావచ్చని వారు భావిస్తున్నారు. ఏ సూక్ష్మక్రిమి దీనికి కారణంగా నిలుస్తున్నదో, దానిని ఏ విధంగా కనుగొనాలో, ఎటువంటి చికిత్స అందించాలో వైద్యులకు కూడా అంతుచిక్కడం లేదు. అందుకే  ఈ వ్యాధి విషయంలో అప్రమత్తత అవసరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. డిసీజ్ ఎక్స్ వ్యాధి సోకిన బాధితుడు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఆ డ్రాప్స్ ద్వారా వ్యాధి వ్యాపించవచ్చు. బాధితుడు తాకిన వస్తువులపై నిలిచిన సూక్ష్మక్రిములు ద్వారానూ ఈ వ్యాధి సంక్రమించవచ్చు. ఈ వ్యాధి క్రిములను మోసే కీటకాల నుంచి కూడా వ్యాప్తి  చెందవచ్చంటున్నారు వైద్య శాస్త్రవేత్తలు. 

జంతువుల నుంచి..
డిసీజ్ ఎక్స్ అనేది కోతులు, కుక్కలు తదితర జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దీనిపై పూర్తి స్థాయిలో సమాచారం లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఒక ఊహాజనిత వ్యాధి. దీని కారణంగా ప్రపంచం మొత్తం మీద తీవ్రమైన అంటువ్యాధులు సంభవించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. రాబోయే కాలంలో జంతువుల నుంచి మానవులకు సోకే పలు రకాల వ్యాధుల్లో ఇదీ ఒకటి కానుంది. అంటువ్యాధులను వ్యాప్తి చేయడంలో ఇది కీలక పాత్ర పోషించనుందని ప్రపంచ ఆరోగ్యం సంస్థ చెబుతోంది.

ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న పలు వైరస్‌లు గతంలో కంటే వేగంగా రూపాంతరం చెందుతున్నాయని, ఇవి మనుషులపై తీవ్ర ప్రభావం చూపించవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. వాటిలో ఏదైనా వైరస్‌ మహమ్మారిగా రూపాంతరం చెందవచ్చని కూడా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

డిసీజ్ ఎక్స్‌ సోకినపుడు బాధితునికి జ్వరం, నరాల తిమ్మిరి, మెడ నొప్పి, వెన్నునొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, వికారం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ వ్యాధి వ్యాపిస్తే కోవిడ్‌ను మించిన ప్రమాదం వాటిల్లవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అందుకే ప్రతీఒక్కరూ పరిశుభ్రత, పోషకాహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు