ఆ వివరాలు ఆఫిడవిట్‌లో.. పొందుపర్చలేదని.. బీఆర్‌ఎస్‌ అభ్యర్ధిపై దుమారం!

14 Nov, 2023 11:53 IST|Sakshi
అలంపూర్‌లో నామినేషన్‌ కేంద్రం వద్ద ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న అభ్యర్థులు, కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఉద్యోగ వివరాలపై కాంగ్రెస్‌, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల ఫిర్యాదు..

ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఉత్కంఠ!

సాక్షి, జోగులాంబ: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ల పరిశీలనలో దూమారం రేగింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి నామినేషన్‌పై ఇతర పార్టీల అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాల్లో, ఆఫిడవిట్‌లో ఫిల్డ్‌ అసిస్టెంట్‌గా పని చేసిన వివరాలు పొందుపర్చలేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్కంఠత కొనసాగింది. అలంపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలోని అసెంబ్లీ ఎన్నికల బరిలో అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాల పరిశీలన సోమవారం జరిగింది.

ఈ సందర్భంగా నామినేషన్‌ దాఖలు చేసిన అభ్యర్థులు హాజరయ్యారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి విజయుడి నామినేషన్‌ పరిశీలన సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి సంపత్‌ కుమార్‌, బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్‌, బీఎస్పీ అభ్యర్ధి ప్రసన్న కుమార్‌తోపాటు ఇతర అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి విజయుడి నామినేషన్‌, ఆఫిడవిట్‌లో ఫిల్డ్‌ అసిస్టెంట్‌గా పని చేసిన వివరాలు, రాజీనామా చేసిన కాఫీని పొందపర్చలేదని ఎన్నికల నిబంధనల మేరకు తిరస్కరించాలని రిటర్నింగ్‌ అధికారిని కోరినట్లు తెలిపారు.

కానీ బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిణి అమోదించినట్లు చెప్పారు. దీంతో అభ్యర్థులు కలిసి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి లిఖీతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిణి బయటికి వెళ్లడానికి వాహనం వద్దకు రాగా వారు అడ్డుపడుతూ.. నామినేషన్‌ను తిరస్కరించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సాధరణ అబ్జర్‌వర్‌ వసంత్‌ కుమార్‌ అక్కడికి చేరుకున్నారు.

దీంతో అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులతో మాట్లాడారు. అభ్యర్థులు నామినేషన్‌ కేంద్రం వద్దనే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండటంతో ఉత్కంఠత కొనసాగింది. అనంతరం ఫిర్యాదు చేసిన అభ్యర్థులు బయటికి వచ్చి ప్లకార్డులను ప్రదర్శించారు. నామినేషన్‌ల పరిశీలనలో ఉత్కంఠత నెలకొనడంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అలంపూర్‌ సీఐ రాజు, శాంతినగర్‌ సీఐ శివకుమార్‌ గౌడ్‌లు ఎస్‌ఐలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకోని పర్యవేక్షించారు.
ఇవి కూడా చదవండి: నామినేషన్ల పరిశీలన పూర్తికాగా.. ఎన్నికల సామగ్రి వచ్చేసింది!

మరిన్ని వార్తలు