ఫోన్ల వేటలో పోలీసులు భళా! కానీ 'బండి' విష‌యంలో..??

19 Dec, 2023 10:45 IST|Sakshi
పోయిన ఫోన్‌ను అందజేస్తున్న చొప్పదండి సీఐ రవీందర్‌ (ఫైల్‌)

సెల్‌ఫోన్ల రికవరీలో ఉమ్మడి జిల్లా పోలీసుల ప్రతిభ!

సత్ఫలితాలు ఇస్తున్న సీఈఐఆర్‌ విధానం..

ఏప్రిల్‌లో కరీంనగర్‌లోనే ప్రారంభించిన పోలీసుశాఖ!

ఆరోపణల పర్వం ఎలా ఉన్నా.. దొర‌క‌ని బండి సంజయ్‌ ఫోన్‌..

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను గుర్తించి తిరిగి అప్పగించడంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పోలీసులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. సీఈఐఆర్‌ విధానం ఉపయోగించి ఫోన్లను గుర్తిస్తున్నారు. ప్రస్తుతం సెల్‌ఫోన్‌ విద్యార్థి నుంచి వృద్ధులు, అధికారి నుంచి కూలీవరకు, ఉన్నతాధికారి నుంచి చిరుద్యోగి వరకు, వార్డు మెంబరు నుంచి ప్రధాని వరకు అందరిని కలిపే సామాజిక మాధ్యమంగా మారింది.

అలాంటి సెల్‌ఫోన్‌ పొరపాటున పోగొట్టుకున్నా.. చోరీకి గురైనా అందులోని డేటాతోపాటు, విలువైన సమాచారం పోతుంది. అందుకే పోలీసులు అలా పోగొట్టుకున్న పోన్లను వేటాడి గుర్తించేందుకు సీఈఐఆర్‌ విధానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ సాంకేతికతను తొలిసారిగా కరీంనగర్‌ కమిషనరేట్‌లో ప్రయోగపూర్వకంగా ప్రారంభించారు. ప్రస్తుతం 50శాతం వరకు ప్రజలు పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించగలిగారు.

నేటికీ దొరకని ‘బండి’ ఫోన్‌..
ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో వాట్సాప్‌లలో పేపర్‌ లీకేజీ కలకలం రేపింది. ఈ వ్యవహారంలో ఎంపీ బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో సంజయ్‌ ఫోన్‌ అదృశ్యమైంది. పోలీసులే తన ఫోన్‌ మాయం చేశారని సంజయ్‌ ఆరోపించారు. ఆయన ఫోన్‌తో తమకు సంబంధం లేదని పోలీసులు వివరణ ఇచ్చారు. ఆరోపణల పర్వం ఎలా ఉన్నా.. బండి సంజయ్‌ ఫోన్‌ నేటికీ లభించలేదు.

అందులో అనేక కీలక విషయాలు ఉన్నాయని, తన ఫోన్‌ వెంటనే అప్పగించాలని బండి అనుచరులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా.. పోలీసుల తరఫు నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడం గమనార్హం. ఫోన్ల రికవరీలో దేశంలోనే నంబర్‌వన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ పోలీసులు ఎంపీ సెల్‌ఫోన్‌ విషయంలో ఎలాంటి పురోగతి సాధించకపోవడంపై ఆయన అనచరులు విమర్శలు గుప్పిస్తున్నారు.

1,318 ఫోన్ల అందజేత!
ఈ ఏడాది ఏప్రిల్‌లో సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిష్టర్‌ (సీఈఐఆర్‌) సాంకేతికతపై కరీంనగర్‌ కమిషనరేట్‌లో పోలీసులకు శిక్షణ ఇచ్చారు. ఆ వెంటనే రామగుండం, జగిత్యాల, సిరిసిల్ల జిల్లా సిబ్బందికి శిక్షణను విస్తరించారు. ఈ సాంకేతికత వినియోగంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకూ 5,449 ఫోన్లు ఉమ్మడి జిల్లాలో పోయినట్లు రిపోర్టయ్యాయి. అందులో 1,318 ఫోన్లను రికవరీ చేశారు. సెల్‌ఫోన్ల రికవరీ అత్యధికంగా 418 రామగుండం పరిధిలో ఉండగా, అత్యల్పంగా 157 జగిత్యాల పరిధిలో ఉండటం గమనార్హం.

సీఈఐఆర్‌ సాంకేతికత అంటే.?
డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలీ కమ్యూనికేషన్స్‌ ఆధ్వర్యంలో సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిష్టర్‌ (సీఈఐఆర్‌) సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా పోయిన సెల్‌ఫోన్‌ను తిరిగి కనిపెట్టొచ్చు. సీఈఐఆర్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సెల్‌ఫోన్‌ను ఐఎంఈఐ నంబరు సాయంతో బ్లాక్‌ చేయవచ్చు. ఈ తరువాత ఆ సెల్‌ఫోన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయదు. ఒకవేళ ఫోన్‌ ఆన్‌చేసినా, అందులో కొత్త సిమ్‌కార్డు వేసినా.. ఆ విషయం ఫోన్‌ యజమానికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలిసిపోతుంది.

ఎలా పనిచేస్తుంది..?

  • సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్న వెంటనే డబ్లూ.డబ్లూ.డబ్లూ.సీఈఐఆర్‌.జీవోవీ.ఐఎన్‌ పోర్టల్‌ ఓపెన్‌ చేయాలి. అందులో బ్లాక్‌ ఫోన్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • అందులో మొబైల్‌ నంబర్‌–1, మొబైల్‌ నంబరు–2, సెల్‌ఫోన్‌ బ్రాండ్‌, మోడల్‌, ఇన్వాయిస్‌ (బిల్‌) ఫొటో సూచించిన గడుల్లో నింపాలి.
  • పోగొట్టుకున్న స్థలం, పోయిన తేదీ, ఇతర చిరునామా, అంతకుముందే ఇచ్చిన పోలీస్‌ కంప్లయింట్‌ నంబరు, ఫోన్‌ యజమాని చిరునామా, ఈమెయిల్‌ ఐడీ, ధ్రువీకరణ కార్డులు, చప్టాలను సూచించిన బాక్సుల్లో నింపాలి. వెంటనే సెల్‌ఫోన్‌ (పాత నెంబరు మీద తీసుకున్న కొత్త సిమ్‌) నంబరుకు ఓటీపీ వస్తుంది.
  • ఓటీపీ ఎంటర్‌ చేసిన తరువాత ఫామ్‌ను సబ్మిట్‌ చేయాలి. ఆ తరువాత ఫోన్‌ దానంతట అదే బ్లాక్‌ అవుతుంది. ఇకపై దాన్ని ఎవరూ ఆపరేట్‌ చేయలేరు. అందులోని డేటా సురక్షితంగా ఉంటుంది. ఒకవేళ దొంగించించిన వ్యక్తి లేదా సెకండ్‌ హ్యాండ్‌లో కొన్న వ్యక్తి సిమ్‌ వేయగానే.. మీ నంబరుకు మెసేజ్‌ వస్తుంది. ఆ సందేశం ఆధారంగా ఫోన్‌ ఎక్కడ ఉన్నా.. పట్టుకోవడం సులభతరంగా మారుతుంది.

అన్‌బ్లాక్‌ చేయండిలా..
మీఫోన్‌ను పోలీసులు పట్టుకున్నా.. లేక మీకే దొరికినా.. మీ పాత ఐడీని, ఫోన్‌నంబరు, ఇతర వివరాలు నింపిన తరువాత ఫోన్‌ను అన్‌బ్లాక్‌ చేసుకోవచ్చు.
ఇవి చ‌ద‌వండి: ఔను..! నిజంగానే కలెక్టర్‌కు కోపమొచ్చింది!

>
మరిన్ని వార్తలు