వైరా బీఆర్‌ఎస్‌లో అసమ్మతి సెగలు

10 Sep, 2023 07:43 IST|Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: వైరా నియోజకవర్గ బీఆర్‌ఎస్‌లో వైరం ఆరని మంటలా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కోసం సిట్టింగ్‌ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ చేసిన ప్రయత్నాలు ఫలించక.. మాజీ ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్‌కు అధిష్టానం అవకాశం ఇవ్వడంతో ఎమ్మెల్యేతో పాటు ఆయన వర్గం మండిపడింది. తమ సత్తా చూపిస్తామని శప థం చేసింది. ఆ తర్వాత అధిష్టానం బుజ్జగింపులతో శాంతించి.. కలిసి పనిచేస్తామని వెల్లడించింది. ఇంతలోనే శుక్రవారం ఎమ్మెల్యే చేసిన ఘాటు వ్యాఖ్య లు ఆ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ప్రధానంగా దళితబంధు లబ్ధిదారుల ఎంపిక వ్యవహారం రెండు వర్గాల మధ్య వైరాన్ని పెంచింది.

టికెట్‌ ఆశించి భంగపడి..
బీఆర్‌ఎస్‌ అధిష్టానం టికెట్లు ప్రకటించకముందే వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌కు టికెట్‌ రాదనే ప్రచారం మొదలైంది. ఈక్రమంలో ఎమ్మెల్యే తనకే టికెట్‌ ఇవ్వాలంటూ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల ద్వారా రాయబారాలు నడపడంతో పాటు తన తనయుడితో పాటు ప్రగతిభవన్‌కు వెళ్లి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఆ తర్వాత పార్టీ మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌కు టికెట్‌ కేటాయించింది. దీంతో తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే... రానున్న ఎన్నికల్లో తానేంటో చూపిస్తానంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీనిపై అధిష్టానం బుజ్జగించడంతో కొంత మెత్తపడిన ఆయన, పార్టీ ప్రకటించిన అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు. దీంతో అంతా సర్దుకున్నట్లేనని అధిష్టానం సహా అందరూ భావించారు.

దళితబంధు రగడ
నియోజకవర్గాల్లో దళితబంధు లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యే ఆధ్వర్యానే జరుగుతోంది. వైరా నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కలిపి 1,120 మంది తో పేర్లతో ఎమ్మెల్యే రాములునాయక్‌ను జాబితా ను అధికారులకు పంపినట్లు తెలిసింది. ఈ జాబితా ప్రకారమే యూనిట్లు మంజూరవుతాయని ఎమ్మెల్యే భావిస్తుండగా, కొందరిని ఎంపిక చేసే అవకాశం పార్టీ అభ్యర్థి మదన్‌లాల్‌కు అధిష్టానం ఇచ్చిందన్న సమాచారంతో ఎమ్మెల్యే భగ్గుమన్నారు. గతంలో ఇక్కడ దళితబంధు అర్హుల ఎంపికలో చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలతో మదన్‌లాల్‌కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే తన ప్రతిపాదనలను పక్కన పెడుతున్నారంటూ మదన్‌లాల్‌తో పాటు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పై శుక్రవారం నాటి సమావేశంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

చెడిన సయోధ్య
ఎమ్మెల్యే రాములునాయక్‌ వ్యాఖ్యలతో రెండు వర్గాల మధ్య ఉన్న సయోధ్య చెడినట్లయింది. ఈ పరిస్థితితో ఎమ్మెల్యే వెంట ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధుల్లో ఒక్కరొక్కరుగా మదన్‌లాల్‌ వైపు వెళ్తున్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కోవాల్సి ఉండగా.. రెండు వర్గాల పోరు మొదలవడం అధిష్టానం దృష్టికి కూడా వెళ్లినట్లు తెలిసింది. ఎమ్మెల్యే, అభ్యర్థి నడుమ మధ్య పంచాయితీకి దారితీసిన పరిస్థితులపై ఆరా తీయడమే కాక... ఆచితూచి వ్యవహరించాలని మదన్‌లాల్‌కు పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం. ఇక సిట్టింగ్‌ ఎమ్మెల్యే, పార్టీ ప్రకటించిన అభ్యర్థి మదన్‌లాల్‌ వ్యవహార శైలి ప్రతిపక్షాలకు అస్త్రంగా మారే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. దళితబంధు లబ్ధిదారుల జాబితా విషయాన్ని ఎమ్మెల్యే బహిరంగంగా ప్రస్తావించడంతో ఎమ్మెల్యేలు చెప్పిన అధికార పార్టీ నేతలకే లబ్ధి చేకూరుతోందనే విమర్శలు వస్తున్నాయి. అయితే, అభ్యర్థిని ప్రకటించిన కొన్నాళ్లకే వైరా నియోజకవర్గంలో మొదలైన ఈ విభేదాలను బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే.

>
మరిన్ని వార్తలు