ఆయనకు ఓటమి కనిపిస్తోంది..! : పువ్వాడ అజయ్‌కుమార్‌

14 Nov, 2023 12:48 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి పువ్వాడ అజయ్‌, పక్కన మేయర్‌ నీరజ, గుండాల కృష్ణ తదితరులు

నాది ధర్మ పోరాటం, తుమ్మలది అధర్మ పోరాటం..

అంతా సక్రమంగా ఉండడంతోనే నా నామినేషన్‌కు అనుమతి!

మంత్రి, ఖమ్మం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌..

సాక్షిప్రతినిధి, ఖమ్మం: చాలా విషయాల్లో తుమ్మల నాగేశ్వరరావు బ్యాలెన్స్‌ తప్పాడని, ఇప్పుడు ఆయనకు ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండడంతో భయం పట్టుకుని తన నామినేషన్‌ తిరస్కరింపజేయాలని కుట్ర పన్నాడని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. ఖమ్మంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎన్నికల్లో ధీరోదా త్తుడు ఽధైర్యంగా పోరాడుతాడని, పిరికివాడు వెన్నుపోటు పొడవాలని చూస్తాడని ఎద్దేవా చేశారు. 2014లో తనపై ఓడిపోయినప్పుడు, గత ఎన్నికల్లో పాలేరులో ఉపేందర్‌రెడ్డిపై కూడా ఇలాగే అధర్మ పోరాటం చేసినా విజయం దక్కలేదని తెలిపారు. ఇకనైనా ఆయన పిచ్చి ప్రయత్నాలు మానుకుని హుందాతనాన్ని కాపాడుకోవాలని హితవు పలి కారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారమే తన నామినేషన్‌లో అన్ని వివరాలు పూర్తి చేశానని పువ్వాడ తెలిపారు.

ఒకవేళ వివరాలు సరిగా లేకపోతే స్క్రూటినీ రోజు ఉదయమే నోటీసు ఇస్తారని, అలాంటేదేమీ ఆర్‌ఓ నుంచి తనకు అందలేదని చెప్పారు. హెచ్‌యూఎఫ్‌ కాలమ్‌లో డిపెండెంట్‌ 1, 2, 3లో తనపై ఆధారపడే పిల్లలు ఎవరూ లేరని పేర్కొన్నానని, తన కుమారుడి వివాహమై ఉద్యోగం చేస్తున్నందునే అలా వెల్లడించానని తెలిపారు. టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి కామారెడ్డి, కొడంగల్‌లో సమర్పించిన అఫిడవిట్లలో పోలీస్‌ కేసులు చెప్పాల్సిన ఫార్మెట్‌ మూడు బాక్సుల్లో, ఏడు బాక్సుల్లో వివరాలు రాశారని తెలిపారు.

అఫిడవిట్‌లో అడిగిన సమాచారాన్ని పొందుపరిచిన తర్వాత రిటర్నింగ్‌ ఆఫీసర్‌ తుది నిర్ణయం తీసుకుంటారని, ఎవరికై నా అపోహలు ఉంటే కోర్టుకు వెళ్లొచ్చని తెలిపారు. ఈవిషయాన్ని గుర్తించి అసత్య ఆరోపణలను తుమ్మల ఇకనైనా మానుకోవాలని, ప్రజలు కూడా గుర్తించి ధర్మం వైపు నిలబడాలని పువ్వాడ కోరారు. ఈ సమావేశంలో మేయర్‌ పునుకొల్లు నీరజ, డీసీసీబీ, మార్కెట్‌, కూరాకుల నాగభూషణం, దోరేపల్లి శ్వేత, బీఆర్‌ఎస్‌ జిల్లా సమన్వయకర్త గుండాల కృష్ణతోపాటు బచ్చు విజయ్‌కుమార్‌, శీలంశెట్టి వీరభద్రం, పగడాల నాగరాజు, ఖమర్‌, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, పొన్నం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి: నేను మీవాడిని.. ఎప్పటికీ మీ వెంటే ఉంటా..!

మరిన్ని వార్తలు