Actor Chandra Mohan Death: చంద్రమోహన్‌ మృతి.. చిరంజీవి సహా టాలీవుడ్‌ సెలబ్రిటీల నివాళులు

11 Nov, 2023 12:08 IST|Sakshi

తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించారు. ఆయన మరణవార్తతో చిత్రపరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. చంద్రమోహన్‌ మరణం పట్ల సోషల్‌ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.

అత్యద్భుతమైన నటన..
'సిరిసిరిమువ్వ', 'శంకరాభరణం', 'రాధాకళ్యాణం', 'నాకూ పెళ్ళాం కావాలి' లాంటి అనేక  ఆణిముత్యాల్లాంటి  చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా  తెలుగు  వారి  మనసులో చెరగని ముద్ర  వేసిన సీనియర్ నటులు, కథానాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరన్న వార్త ఎంతో  విషాదకరం. నా తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు' లో  ఒక మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన..

ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప  అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆయన ఆత్మకి  శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ  సభ్యులకు, అభిమానులకు నా  ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.

(చదవండి: చంద్రమోహన్‌ మృతి పట్ల సీఎం జగన్‌ దిగ్భ్రాంతి)

చాలా బాధాకరం: జూనియర్‌ ఎన్టీఆర్‌
ఎన్నో దశాబ్దాలుగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చంద్రమోహన్‌ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని జూనియర్‌ ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు.

అజాత శత్రువు..
స్థాయి ని బట్టి కాకుండా మనిషిని మనిషిగా ప్రేమించిన వ్యక్తి చంద్రమోహన్. ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి హుందాగా ఉంటూ చిత్ర పరిశ్రమలో అజాత శత్రువుగా పేరు  తెచ్చుకున్నారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది. చంద్రమోహన్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
- పోసాని కృష్ణమురళి, ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌

ఇంటిదగ్గరే చంద్రమోహన్‌ భౌతిక కాయం
గొప్ప నటుడు చంద్రమోహన్. ఆయన చనిపోవడం ఇండస్ట్రీకి బాధాకరం. ఆయన మృతి పట్ల మా అసోసియేషన్ విచారం వ్యక్తం చేస్తోంది. రేపు దీపావళి పండగ కావడంతో ఫిలిం ఛాంబర్‌లో చంద్రమోహన్ గారిని సందర్శనార్థం ఉంచడం లేదు. ఫిలింనగర్‌లోని ఇంటి వద్ద చంద్రమోహన్ భౌతికకాయాన్ని సందర్శనార్థం ఉంచుతాం. ఇంటి వద్దకే ఆర్టిస్టులు రావాలని కోరుతున్నాం. సోమవారం అంత్యక్రియలు జరుగుతాయి.
- మాదాల రవి, మా జనరల్ సెక్రటరీ

పదహారేళ్ళ వయసు నుంచి మా స్నేహం మొదలైంది. నాకు మంచి మిత్రుడు, మంచి మనిషి అయినా చంద్ర మోహన్ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.- దర్శకుడు కె రాఘవేంద్ర రావు

చదవండి: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. చంద్రమోహన్‌ కన్నుమూత

మరిన్ని వార్తలు