Allu Arjun Wax Statue Launch: దుబాయ్‌లో అల్లు అర్జున్‌.. ఆ గౌరవం దక్కించుకున్న తొలి హీరోగా గుర్తింపు

26 Mar, 2024 08:16 IST|Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దుబాయ్‍లో అడుగుపెట్టారు. తన కుటుంబంతో కలిసి ఆయన అక్కడకు చేరుకున్నారు. దుబాయ్‌లో మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‍లో  పాపులర్ అయిన బన్నీ నేషనల్‌ అవార్డు అందుకున్న తర్వాత మరో విశేష గౌరవాన్ని ఆయన సొంతం చేసుకున్నారు.

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మన అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణం అని చెప్పవచ్చు. ఈ విగ్రహ ఆవిష్కరణ మార్చి 28వ తేదీన జరగనుంది. ఈ కార్యక్రమం కోసం అల్లు అర్జున్ కుటుంబంతో పాటు దుబాయ్‍ చేరుకున్నారు. మార్చి 28 రాత్రి 8 గంటలకి ఈ కార్యక్రమం జరగబోతుంది.

ఇప్పటికే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో  ప్రభాస్‌, మహేష్ బాబు మైనపు విగ్రహాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కానీ ఇవి లండన్‌లోని మ్యూజియంలో ఉన్నాయి. అయితే అల్లు అర్జున్‌ విగ్రహం మాత్రం దుబాయ్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఈ మ్యూజియంలో ఇప్పటి వరకు సౌత్‌ ఇండియాకు చెందిన నటుల విగ్రహాలకు చోటుదక్కలేదు. మొట్టమొదటిసారి అల్లు అర్జున్‌ విగ్రహం అక్కడ ఏర్పాటు చేస్తున్నడం విశేషం. దీంతో సౌత్‌ ఇండియా తొలి హీరోగా బన్నీ రికార్డ్‌ సెట్‌ చేశారు. అంతే కాకుండా దుబాయ్‌ గోల్డెన్ వీసా అందుకున్న తొలి తెలుగు హీరో కూడా బన్నీనే కావడం మరో విశేషం.

సినిమా, క్రీడలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలు టుస్సాడ్స్‌ మ్యూజియంలో పొందుపరిచారు. సింగపూర్‌, లండన్‌, దుబాయ్‌.. ఇలా వివిధ చోట్ల ఈ మ్యూజియానికి సంబంధించిన శాఖలు ఉన్నాయి. దుబాయ్‌లోని మ్యూజియంలో ఇప్పటికే బాలీవుడ్‌ స్టార్స్‌ అయిన అమితాబ్‌ బచ్చన్‌,షారుక్‌ ఖాన్‌, ఐశ్వర్య రాయ్‌, రణ్‌బీర్‌ కపూర్‌  విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లో మన టాలీవుడ్‌ నుంచి అల్లు అర్జున్‌ చేరనున్నారు.

Election 2024

మరిన్ని వార్తలు