హీరో సూర్య పాట విని కన్నీళ్లు ఆపుకోలేకపోయా: అమితాబ్‌

4 Sep, 2021 07:54 IST|Sakshi

‘‘మనం ఊహించినదానికంటే ఎక్కువగా జరిగే సమయాలు కొన్ని ఉంటాయి. నిన్న రాత్రి (గురువారం) నాకలాంటి సమయం ఎదురైంది. ఆ సమయంలో నేను నా కన్నీళ్లను ఆపుకోవడానికి ఎంత ప్రయత్నించినా నావల్ల కాలేదు’’ అంటూ అమితాబ్‌ బచ్చన్‌ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వం వహించిన ‘సూరరై పోట్రు’ (‘ఆకాశం నీ హద్దురా’)లోని ‘కయ్యిలే ఆగాశమ్‌.. కొండు వంద ఉన్‌ పాసమ్‌’ (తెలుగులో ‘అందని ఆకాశం దించవయ్యా మాకోసం’) అనే పాటను బిగ్‌ బి విన్నారట.

చదవండి: భావోద్వేగం: ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలనుకున్న ‘సిద్‌నాజ్’

ఆ పాట వీడియోను షేర్‌ చేస్తూ.. ‘ఈ పాట చూసిన ప్రతిసారీ నా కన్నీళ్లను ఆపుకోలేకపోయాను. ఇది సూర్య నటించిన తమిళ సినిమాలోని పాట. సౌత్‌ సూపర్‌ స్టార్‌ సూర్య నటించిన ఈ పాటలో గుండెను బద్దలు చేసేంత ఎమోషన్‌ ఉంది. సహజత్వానికి దగ్గరగా ఉన్న ఈ పాట నా కన్నీళ్లను ఆపలేకపోయింది. ఓ తండ్రీకొడుకు మధ్య ఉండే భావోద్వేగాన్ని ఆవిష్కరించిన పాట ఇది. నాతో ఈ ఎమోషన్‌ చాలాకాలం ఉండిపోతుంది’’ అని తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు అమితాబ్‌ బచ్చన్‌. ఈ పాట స్వరకర్త జీవీ ప్రకాశ్‌కుమార్‌.. అమితాబ్‌ స్పందనను ఉద్దేశించి, ‘చాలా ధన్యవాదాలు సార్‌. ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తి అభినందనలు దక్కినందుకు ఆనందంగా ఉంది’ అని ట్వీట్‌ చేశారు. ఈ ‘కయ్యిలే ఆగాశమ్‌..’ పాటను జీవీ ప్రకాశ్‌కుమార్‌ సతీమణి, గాయని సైంధవి పాడారు.

మరిన్ని వార్తలు