సెంటిమెంట్‌ రాగమాలిక 

1 Jan, 2021 09:34 IST|Sakshi

మరపురాని జ్ఞాపకం

శ్రీవారి ముచ్చట్లు @40

కాలు పెట్టిననాడే కాపురం చేసే కళ తెలుస్తుందని సామెత. కొన్ని సంవత్సరాలు మొదటి రోజునే తమ విజయోత్సవ లక్షణాన్ని బయటపెట్టేస్తాయి. తెలుగు సినిమా బాక్సాఫీస్‌ చరిత్రలో అలాంటి ఏడాది – 1981. సరిగ్గా నలభై ఏళ్ళ క్రితం జనవరి 1న దాసరి దర్శకత్వంలో అక్కినేని ‘శ్రీవారి ముచ్చట్లు’, తాతినేని రామారావు దర్శకత్వంలో శోభన్‌ బాబు ‘పండంటి జీవితం’తో ఆ ఏడాది తెలుగు సినిమాల ప్రయాణం మొదలైంది. ఇద్దరూ లేడీస్‌ ఫ్యాన్స్‌ ఎక్కువుండే హీరోలే. ఇద్దరి సినిమాలూ లేడీస్‌ సబ్జెక్ట్‌లే. ఒకే రోజున రెండూ బాక్సాఫీస్‌ వద్ద పోటీపడ్డాయి. గమ్మత్తుగా రెండూ హిట్టే. అలా మొదలైన ఆ ఏడాది బాక్సాఫీస్‌ వద్ద ఏయన్నార్‌ ‘ప్రేమాభిషేకం’, ఎన్టీయార్‌ ‘కొండవీటి సింహం’ లాంటి ఎన్నో ఘన విజయాలను అందించింది. 

చరిత్రకెక్కిన తల్లీ కూతుళ్ళు
తెలుగు సినీ చరిత్రలో తొలి తరం మహిళా నిర్మాతల్లో ఒకరు సి. కృష్ణవేణి. జీవిత భాగస్వామి అయిన శోభనాచలా పిక్చర్స్‌ మీర్జాపురం రాజా గారి బాటలో ఆమె ఎన్టీఆర్‌ ‘మనదేశం’ లాంటి సినిమాలు తీశారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ, వారి సంతానమైన ఎన్‌.ఆర్‌. (నంగునూరి రాజ్యలక్ష్మీ) అనూరాధాదేవి కూడా మహిళా నిర్మాతగా పలు చిత్రాలు తీయడం విశేషం. తెలుగు సినీచరిత్రలో ఇలా తల్లీ కూతుళ్ళిద్దరూ నిర్మాతలుగా వెలిగిన అరుదైన ఘట్టం ఇది. పైపెచ్చు, తల్లితండ్రులు తీసిన సినిమాల (‘కీలుగుర్రం’) బాటలో కూతురు కూడా అదే హీరో అక్కినేనితో ఏకంగా 6 సినిమాలు (‘చక్రధారి’, ‘రావణుడే రాముడయితే’, ‘శ్రీవారి ముచ్చట్లు’, ‘రాముడు కాదు కృష్ణుడు’, ‘అనుబంధం’, ‘ఇల్లాలే దేవత’) తీయడం విశేషం.

ముక్కోణపు డ్రామా
అక్కినేని, దాసరి కాంబినేషన్‌లో అంతకు ముందు ‘రావణుడే రాముడయితే’ (1979) నిర్మించారు అనూరాధాదేవి, శ్రీనివాసరావు దంపతులు. అది రిలీజైన ఏడాదికి మళ్ళీ అదే సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌లో వారు నిర్మించిన ఫ్యామిలీ సెంటిమెంట్‌ ఫిల్మ్‌ ‘శ్రీవారి ముచ్చట్లు’ (1981). అక్కినేని, జయప్రద, జయసుధ ముఖ్య పాత్రధారులుగా మహిళలు మెచ్చిన ముక్కోణపు కుటుంబకథ ఇది. ప్రేమించిన కాశ్మీరీ పిల్ల(జయప్రద)తో కాకుండా అనుకోని పరిస్థితుల్లో అయినవాళ్ళ అమ్మాయి (జయసుధ) సంబంధం చేసుకుంటాడు హీరో. తీరా తాళి కట్టాక, ప్రేమించిన పిల్ల పెళ్ళిమండపంలోకి వస్తుంది. ఆ ఇద్దరు స్త్రీల మధ్య నలిగిన ఆ శ్రీవారి ముచ్చట్లు ఏమిటి, ఒకరి సంగతి మరొకరికి తెలిసి ఆ స్త్రీమూర్తులు చేసిన త్యాగం ఏమిటన్నది సినిమా. 

ఒక సినిమా... రెండు ఓపెనింగ్‌లు...
కథానుసారం కాశ్మీర్‌లో జరిగే ‘శ్రీవారి ముచ్చట్లు’ ఓపెనింగ్, ఓ మేజర్‌ షెడ్యూల్‌ అక్కడే చేశారు. హీరో, హీరోయిన్లతో దాసరి, నిర్మాతలు ఫ్లైట్‌లో చేరారు కానీ, కెమేరాతో సహా యూనిట్‌గా బయల్దేరిన దాసరి శిష్యుడు రేలంగి నరసింహారావు బృందానికి జమ్ము నుంచి కాశ్మీర్‌ రైలు మిస్సయింది. మరునాడే ముహూర్తం షాట్‌. నిర్మాత శ్రీనివాసరావు ముహూర్తం సెంటిమెంట్‌. దాంతో దేవుడి పటాల కోసం రాత్రికి రాత్రి జమ్మూ అంతా రేలంగి వెతికారు. చివరకు కృష్ణుడి పటాలు మినహా ఏమీ దొరకలేదు. కథ ప్రకారం హీరో పాత్రకు శ్రీకృష్ణుడి పటం సరిపోతుందని, దాని మీదే జమ్ములో ముహూర్తం షాట్‌ చేశారు రేలంగి. మరోపక్క కాశ్మీర్‌లో తన వద్ద యూనిట్‌ ఏమీ లేకపోయినా నిర్మాత సెంటిమెంట్‌ కోసం హీరో, హీరోయిన్లకు మేకప్‌ వేయించి, స్థానిక స్టిల్‌ ఫోటోగ్రాఫర్‌తో ఫోటోలు తీయించారు దాసరి. 
 
పాటలతో... కాసుల మూటలు 
నిజానికి,  ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ వేటూరి రాయాల్సింది. ఆయన టైముకు బెంగుళూరు రాకపోవడంతో, నిర్మాతల కోరిక మేరకు సినిమాలో రెండుసార్లు వచ్చే ‘శ్రీవారి ముచ్చట్లు’ అనే టైటిల్‌ సాంగ్‌ ను దాసరే రాసేశారు. అదే ఊపులో సినిమాలో పాటలన్నీ దాసరి రచనలయ్యాయి. సినిమా రిలీజుకు ముందే ‘కాళ్ళా గజ్జా కంకాళమ్మా’ మొదలు ‘శ్రీవారి ముచ్చట్లు’ టైటిల్‌ సాంగ్, ‘ముక్కుపచ్చలారని కాశ్మీరం..’, ‘ఉదయకిరణ రేఖలో...’ – ఇలా పాటలన్నీ మారుమోగేవి. ఆ క్రేజుతో రిలీజైన సినిమా సూపర్‌ హిట్టయి, కాసులు కురిపించింది. పూర్ణా పిక్చర్స్‌ జి. విశ్వనాథ్‌ పంపిణీ చేసిన ఈ చిత్రం తొలి వారంలో ఏకంగా రూ. 22 లక్షలు వసూలు చేసింది. హీరోగా అక్కినేని కెరీర్‌ లో హయ్యస్ట్‌ ఓపెనింగ్‌ గా నిలిచింది. కాశ్మీరులో ఈ సినిమా షూటింగ్‌ లోనే దాసరికి ‘ప్రేమాభిషేకం’ (1981) స్టోరీ లైన్‌ తట్టింది. 

‘శ్రీవారి ముచ్చట్లు’ రిలీజు వేళ నిర్మాత అనూరాధాదేవి, పూర్ణా పిక్చర్స్‌ వారి విజయవాడ ఊర్వశి థియేటర్‌కు వెళ్ళారు. సినిమా చూసి జనసందోహం మధ్య నుంచి ఆమె, ‘పూర్ణా’ విశ్వనాథ్, ఆయన సోదరుడు బాలు అంబాసిడర్‌ కారులో హోటలుకు బయలుదేరారు. సినిమా చాలా బాగుందనే ఆనందంలో అభిమాన ప్రేక్షకులు తాము కూర్చున్న కారును ఆనందంగా పైకి ఎత్తేశారని అనూరాధాదేవి ఇప్పటికీ గుర్తు చేసు కుంటారు. విశేష మహిళా ప్రేక్షకాదరణతో ‘శ్రీవారి ముచ్చట్లు’ నేరుగా 5 కేంద్రాల (విజయవాడ, గుంటూరు, నెల్లూరు, వైజాగ్‌ లలో 100 రోజులు, కాకినాడలో 98 రోజులు)లో, నూన్‌ షోలతో 9 సెంటర్లలో వంద రోజులు ఆడింది. మధ్యాహ్నం ఆటలతో సిల్వర్‌ జూబ్లీ చేసుకుంది.  

‘శ్రీవారి ముచ్చట్లు’ రిలీజైన సరిగ్గా 48 రోజుల తర్వాత వచ్చిన ఇదే కాంబినేషన్‌లో ‘ప్రేమాభిషేకం’ వచ్చింది. అది ఏకంగా ఏడాది ఆడి, గోల్డెన్‌ జూబ్లీ జరుపుకొంది. అప్పట్లో నెల్లూరు కల్యాణి కాంప్లెక్స్‌ (కృష్ణ– కావేరి–కల్యాణి థియేటర్స్‌)లో ‘శ్రీవారి ముచ్చట్లు’ శతదినోత్సవం ఘనంగా చేశారు. తమిళ స్టార్‌ శివాజీ గణేశన్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. రైల్వే ట్రాకు పక్కనే ఉన్న ఆ సినిమా హాలులో వేడుకలలో పాల్గొంటున్న అక్కినేని, తదితర తారలను రైళ్ళు ఆపి మరీ జనం చూడడం గమనార్హం.

కాశ్మీర్‌ షూటింగ్‌... కచ్చిన్స్‌ డ్రెస్సులు...
కాశ్మీరులో 15 రోజుల షెడ్యూల్‌లో 4 పాటలు, 10 సీన్లు తీశారు. బొంబాయిలోని ప్రసిద్ధ కచ్చిన్స్‌ సంస్థ అక్కినేనికీ, కాశ్మీరీ పాత్రలోని జయప్రదకూ ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్‌ అందించింది. ఒక పాటలో అక్కినేని డజను డ్రస్సులు మార్చారు. షెడ్యూల్‌ చివరలో పని ముగించుకొని అక్కినేని, దాసరి వచ్చేస్తే, జయప్రద, చాట్ల శ్రీరాములుపైన కొన్ని సీన్లు, ప్యాచ్‌ వర్క్‌ రేలంగే షూట్‌ చేశారు.

హిందీ రీమేక్‌లో రేఖ అనుమానం! 
ఈ హిట్‌ చిత్రాన్ని మూడేళ్ళ తరువాత హిందీలో ‘ఆశాజ్యోతి’ (1984) పేరిట దాసరి దర్శకత్వంలోనే నిర్మాత కోవై చెళియన్‌ తీశారు. రాజేశ్‌ ఖన్నా, రేఖ, రీనారాయ్‌ తారాగణం. హిందీ రీమేక్‌ రెండో షెడ్యూల్‌ సమయంలో దాసరి మరో సినిమా పనిలో బిజీగా ఉన్నారు. దాంతో, మైసూరులో చేయాల్సిన 15 రోజుల షూటింగ్‌ను శిష్యుడు రేలంగి నరసింహారావుకు అప్పగించారు. తీరా రేలంగి అక్కడకు వెళ్ళాక రేఖ తదితరులకు అనుమానం వచ్చింది. తొలి షెడ్యూలులో నిర్మాతకూ, దాసరికీ చిన్న అభిప్రాయ భేదాలు వచ్చాయి. అందుకని నిర్మాతే, దాసరి బదులు రేలంగిని తెచ్చారేమోనని భ్రమపడ్డారు. ఆ మాటే రేఖ అచ్చ తెలుగులో గౌరవంగా రేలంగితో చెప్పేశారు. చివరకు దాసరి ఫోన్‌ చేసి, రేలంగిని తానే పంపినట్టు వివరించారు. హిందీలోనూ ఈ లేడీస్‌ సెంటిమెంట్‌ కథ సక్సెస్‌ సాధించింది.

- రెంటాల జయదేవ

మరిన్ని వార్తలు