ఓ గ్యాంగ్‌ నాకు వ్యతిరేకంగా పని చేస్తోంది

26 Jul, 2020 04:55 IST|Sakshi

– ఏఆర్‌ రెహమాన్‌

‘‘నా దగ్గరకు వచ్చిన ఏ మంచి సినిమానీ నేను కాదనను. కానీ నా వెనకాల ఒక గ్యాంగ్‌ ఉందనిపిస్తోంది. ఆ ముఠా నా గురించి లేనిపోనివి చెప్పి, నా దగ్గరకు రావాలనుకున్నవాళ్లను రానివ్వడంలేదని నా ఫీలింగ్‌’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌. దక్షిణాదితో పోల్చితే హిందీలో తక్కువ సినిమాలు చేయడానికి కారణం ఏంటి? అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రెహమాన్‌ని అడిగితే ఈ విధంగా స్పందించారు.

‘దిల్‌ సే’, ‘తాళ్‌’, ‘లగాన్‌’, ‘స్వదేశ్‌’, ‘రంగ్‌ దే బసంతి’, ‘గురు’, ‘రాక్‌స్టార్‌’, ‘తమాషా’, ‘ఓకే జాను’ తదితర హిందీ చిత్రాలకు రెహమాన్‌ సంగీతదర్శకుడిగా వ్యవహరించారు. ఇక హిందీలో తాను ఎందుకు తక్కువ సినిమాలు చేస్తున్నాననే విషయం గురించి రెహమాన్‌ మాట్లాడుతూ – ‘‘నన్ను అపార్థం చేసుకుని, ఓ గ్యాంగ్‌ నా గురించి తప్పుడు ప్రచారం చేస్తోంది. కొంతమందికి, నాకు మధ్య దూరం పెంచుతోంది. ముఖేష్‌ చాబ్రా నా దగ్గరకు వచ్చినప్పుడు రెండు రోజుల్లో నాలుగు ట్యూన్స్‌ ఇచ్చాను.

అప్పుడాయన ‘ఆయన దగ్గరకు వెళ్లొద్దు అని నాతో ఎంతమంది చెప్పారో లెక్కలేదు. మీ గురించి కథలు కథలుగా చెప్పారు’ అన్నారు. నేనెందుకు హిందీలో తక్కువ సినిమాలు చేస్తున్నానో ఆ మాటలు విన్నాక అర్థమైంది. నా దగ్గరకు మంచి సినిమాలు ఎందుకు రావడంలేదో గ్రహించాను. హిందీలో నేను చాలావరకు డార్క్‌ సినిమాలే చేస్తున్నాను. ఎందుకంటే ఓ గ్యాంగ్‌ నాకు వ్యతిరేకంగా పనిచేస్తోంది.

పీపుల్‌ (సినిమా ఇండస్ట్రీవాళ్లు) నాతో మంచి సినిమాలు చేయాలని ఎదురుచూస్తున్నారు. కానీ ఓ గ్యాంగ్‌ అది జరగకుండా చేస్తోంది. ఆ మంచిని నాదాకా రాకుండా చేస్తోంది. అయినా ఫర్వాలేదు. ఎందుకంటే నేను విధిని నమ్ముతాను. అలాగే ప్రతిదీ ఆ దేవుడి దగ్గరనుంచే వస్తుందని నమ్ముతాను. కాబట్టి నా దగ్గరకు వచ్చిన సినిమాలను నేను చేస్తున్నాను. కానీ నేను మాత్రం అందర్నీ స్వాగతిస్తున్నాను. నా దగ్గరకు రావచ్చు. మంచి సినిమాలు చేయొచ్చు. అందరికీ స్వాగతం’’ అన్నారు.

మరిన్ని వార్తలు