Bhimaa: ‘భీమా’ మూవీ రివ్యూ

8 Mar, 2024 14:53 IST|Sakshi
Rating:  

టైటిల్‌: భీమా
నటీనటులు: గోపీచంద్‌, ప్రియా భవానీ శంకర్‌,మాళవిక శర్మ,నాజర్,వెన్నెల కిషోర్,నరేష్ తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీ సత్య సాయి ఆర్ట్స్
నిర్మాత:  కేకే రాధామోహన్‌
దర్శకత్వం: ఏ. హర్ష
సినిమాటోగ్రఫీ: స్వామి జె గౌడ
సంగీతం: రవి బస్రుర్
విడుదల తేది: మార్చి 8, 2024

భీమా కథేంటంటే
సినిమా ప్రారంభంలోనే పరశురాముడి కథతో ప్రారంభం అవుతుంది. ఒకానొక సమయంలో పరశురాముడు కొత్త భూభాగం కావాలని వరుణుడిని కోరాడు. సముద్రంలో గొడ్డలిని విసిరితే విసిరినంత మేర భూభాగం లభిస్తుందని వరుణుడు చెప్పడంతో భార్గవరాముడు గొడ్డలి విసిరాడు. దీంతో సముద్రం వెనక్కు వెళ్లింది. ఇలా కొత్తగా ఏర్పడిన భూభాగమే కేరళ అని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే ఈ సినిమా కథ బాదామితో పాటు కేరళలోని పలు ప్రాంతాల్లో కథ జరుగుతుంది. కేరళలోని మహేంద్రగిరిలో సినిమా కథ మొదలౌతుంది. ఆ ప్రాంతంలో అరాచక శక్తులతో అల్లకల్లోలంగా ఉంటుంది. అక్కడి ప్రజలతో పాటుగా పోలీసు వ్యవస్థను శక్తి భవాని (ముఖేష్ తివారి) గడగడలాడించే స్థాయిలో ఉంటాడు.

పెట్రోల్‌ ట్యాంకర్స్‌ మాటున అతను చేస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించిన ఒక ఎస్సై (కమల్ కామరాజు)ను చంపేస్తాడు. మహేంద్రగిరిలో తనకు అడ్డు తగిలేవాడు ఎవడూ లేడని శక్తి భవాని తన అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. మరో వైపు భీమా కథలో పరశురామ క్షేత్రం అనే ఊరు తెరపైకి వస్తుంది. ఆ ఊరులో గత యాభైఏళ్లుగా  మూత పడిన శివాలయాన్ని తన అక్రమాలకు అడ్డాగా మార్చుకుంటాడు భవాని. సరిగ్గా అలాంటి సమయంలో ఎస్సైగా మహేంద్రగిరిలోకి ఎంట్రీ ఇస్తాడు భీమా (గోపీచంద్‌)...  ఈ క్రమంలోనే విద్య (మాళవికా శర్మ) ఎంట్రీ ఇస్తుంది.

విద్య ఒక స్కూల్‌లో పనిచేస్తూనే  మొక్కలపై పరిశోధనలు కూడా చేస్తూ ఉంటుంది. పరశురామ క్షేత్రంలో ఆయుర్వేద వైద్యుడిగా  రవీంద్రవర్మ (నాజర్) ఉంటారు. ఆయన దగ్గర విద్య మొక్కలపై పలు పరిశోధనలు చేస్తూ ఉంటుంది. ఇక్కడ  రవీంద్రవర్మ ప్రజలకు వైద్యం చేస్తూ దగ్గరగా ఉంటే.. శక్తి భవాని ప్రజలను భయపెడుతూ ఉంటాడు. ఈ క్రమంలో మరణించిన మనిషిని కూడా బతికించే మందును కనిపెట్టాలని ఆయుర్వేద వైద్యంలో పలు పరిశోధనలు చేస్తుంటాడు రవీంద్రవర్మ.. ఇలా ఆసక్తిగా నడుస్తున్న కథలో ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి.

ఈ కథలో పెట్రోలు ట్యాంకర్స్‌ మాటున భవాని చేస్తున్న అక్రమ వ్యాపారం ఏంటి..?  భీమాని అడ్డుకోవటం కోసం భవాని పన్నిన వ్యూహం ఏమిటి..? విలన్‌లను ఎదుర్కొనే క్రమంలో భీమా ఏం అయ్యాడు..? ఎప్పుడో చిన్నతనంలో విడిపోయిన తన తమ్ముడు రామా (గోపీచంద్‌) కథలోకి ఎలా వచ్చాడు..? పరశురామ క్షేత్రంలో ఉన్న శివాలయం 50 ఏళ్లుగా ఎందుకు మూత పడింది..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సినిమా చూస్తున్నంత సేపు అందరిలో కలుగుతాయి. ప్రీ క్లైమాక్స్‌లో రివీల్ అయ్యే అసలు ట్విస్ట్ ఏమిటి..? ఇవన్నీ తెలియాలంటే 'భీమా' చూడాల్సిందే.

ఎలా ఉందంటే.. 
సినిమా ప్రారంభంలోనే పరశురాముడి గురించి చెప్పడం.. ఆపై పరశురామ క్షేత్రంలోని శివాలయంలో జరిగే కొన్ని సంఘటనలు చూపించడంతో కథ అంతా మానవాతీత శక్తులతో నిండి ఉంటుందని అనుకుంటాం కానీ అదేమీ కాదని 15 నిమిషాల్లోనే తెలిపోతుంది. అక్కడ నుంచి రోటీన్‌ కమర్షియల్‌ స్టోరీతో సినిమా జరుగుతుంది. ఫస్టాఫ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ కూడా చాలా సినిమాల్లో కనిపించిందే ఉంటుంది. కథ ప్రారంభంలో ఎంతో ఆసక్తిగా చెప్పిన కన్నడ డైరెక్టర్‌ ఏ. హర్ష కొంత సమయం తర్వాత  మెల్లిమెల్లిగా స్టోరీపై పట్టు కోల్పోయాడు.

సినిమా ప్రారంభంలో చెప్పిన శివాలయం పాయింట్‌ను చివరి వరకు ఎక్కడా ప్రస్థావన ఉండదు.   ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లే చాలా బలంగా ఉండాలి.. ఎందుకంటే గోపీచంద్‌ రెండు పాత్రలు చేశాడు.. ఆపై గుడి కాన్సెప్ట్‌ ఉంది. కథలో ప్రేక్షకుడు లీనం అయ్యేలా తెరకెక్కించాలి. కానీ భీమాలో అది కాస్తా మైనస్‌గా మారింది. కమర్షియల్ టచ్‌ ఉన్న స్టోరీకి ఫాంటసీ ఎలిమెంట్‌ను చేర్చి ప్రేక్షకులను మెప్పించడం అంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా గోపీచంద్, మాళవికా శర్మ మధ్య ఉండే లవ్‌ ట్రాక్‌ కాస్త తగ్గించి ఉంటే సినిమాకు బాగా ప్లస్‌ అయ్యేది.

కన్నడ చిత్ర సీమలో కొరియోగ్రాఫర్‌గా కెరియర్‌ స్టార్ట్‌ చేసిన ఏ. హర్ష శివరాజ్‌కుమార్‌తో 'వేదా' చిత్రాన్ని తీసి తెలుగు వారికి దగ్గరయ్యాడు. దీంతో గోపీచంద్‌తో భీమా సినిమాను డైరెక్ట్‌ చేసే చాన్స్‌ ఆయనకు దక్కింది. సినిమాలో గోపీచంద్‌ నటనకు ఎలాంటి పేరు పెట్టాల్సిన పనిలేదు.. రెండు పాత్రలలో ఆయన ఇరగదీశాడు.. సినిమా మొత్తం సింగిల్‌ హ్యాండ్‌తో నడిపించాడు. సినిమా స్టోరీ అంతా కూడా ఫాంటసీ ఎలిమెంట్‌తో డైరెక్టర్‌ తెరకెక్కించి ఉండుంటే భారీ హిట్‌ కొట్టేది అని చెప్పవచ్చు.

ఎవరెలా చేశారంటే..
భీమాగా పోలీసు గెటప్‌లో కనిపించిన గోపీచంద్‌.. రామాగా పురోహితుడి పాత్రలో కూడా కనిపిస్తాడు. రెండు క్యారెక్టర్‌లలో ఇరగదీశాడని చెప్పవచ్చు. యాక్షన్‌ సీన్స్‌తో పాటు ఎమోషనల్‌ సన్నివేశాలలోనూ  ఆయన చక్కగా నటించాడు.  ఇక సినిమాలో గోపీచంద్‌ తర్వాత నాజర్‌ పాత్ర అందరినీ మెప్పిస్తుంది. తెరపై గోపీచంద్‌ మాళవికా శర్మ,ప్రియా భవానీ శంకర్‌ల కెమిస్ట్రీ ఫర్వాలేదనిపిస్తుంది. పోలీసు పాత్రలో గోపీచంద్‌ ఉన్నంత సేపు ప్రేక్షకులో ఉత్సాహం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్‌ సమయంలో వచ్చే ఫైట్‌ అందరినీ కట్టిపడేస్తుంది.

విలన్‌గా నటించిన శక్తి భవానీని డైరెక్టర్‌ అంతగా ఉపయోగించుకోలేదు అనిపిస్తుంది. వెన్నెల కిషోర్‌,నరేష్‌, పూర్ణ,నాజర్‌ వంటి స్టార్స్‌ వారి పరిధిమేరకు మెప్పించారు. సాంకేతిక విషయాలకొస్తే.. రవి బస్రూర్‌ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. ఆయన అందించిన బీజీఎమ్‌ సినిమాపై పాజిటివ్‌ వైబ్‌ను క్రియేట్‌ చేస్తుంది. పాటలు అంతగా నోటెడ్‌ కాకపోయినప్పటికీ తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. స్క్రీన్‌ ప్లే మరికొంత బలంగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు అనిపిస్తాయి. సినిమా చివరిలో 30 నిమిషాల పాటు దర్శకుడి చూపిన పని తీరుకు ఎక్కువ మార్కులు పడుతాయి.

-బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్ డెస్క్

Rating:  
(2.75/5)

Election 2024

మరిన్ని వార్తలు