Bigg Boss 5 Telugu: కెప్టెన్సీ రేసులో ఆ ముగ్గురు, నాలుగో కెప్టెన్‌ ఎవరు?

30 Sep, 2021 00:27 IST|Sakshi

Bigg Boss Telugu 5, Episode 25: బిగ్‌బాస్‌ ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌ వల్ల హౌస్‌మేట్స్‌కు అన్నం విలువేంటో తెలుసొచ్చింది. కడుపులో పేగులు అరుస్తున్నా గేమ్‌ కోసం వారి ఆకలిని చంపుకుని మరీ ఆడారు. వీరి జిహ్వచాపల్యానికి పరీక్ష పెడుతూ బిగ్‌బాస్‌ పదేపదే రుచికరమైన వంటకాలను పంపించాడు. మరి వాటిని ఎవరెవరు ఆరగించారు? ఎవరు గెలిచారు? అనేది తెలియాలంటే నేటి(సెప్టెంబర్‌ 29) ఎపిసోడ్‌ చదివేయాల్సిందే!

ఎలాగైనా ఒక్క బజర్‌ అయినా కొట్టి బరువు తగ్గాల్సిందేనని సన్నీ, మానస్‌ తెగ ఆశపడ్డారు. కానీ అదేసమయంలో ముద్దపప్పు, ఆవకాయ గుర్తొస్తుందంటూ ఊహల్లో తేలిపోయారు. అటు లోబో పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. కానీ అతడి జంటసభ్యుడు అయిన నటరాజ్‌ మాస్టర్‌ మాత్రం ఎలాగైనా నోరు కట్టేసుకోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేయడంతో లోబో సరేనని తలూపాడు.  మరోపక్క బిగ్‌బాస్‌ పావ్‌బాజీ పంపించగా ఇంటిసభ్యులు దాన్ని తిరస్కరించారు. ఆకలికి, ఆహారానికి మధ్య గ్యాప్‌లో బతికేస్తున్న ఎన్నో జీవితాలకు ఏదైనా మంచి సందేశమివ్వాలని బిగ్‌బాస్‌ ఆదేశమివ్వడంతో హౌస్‌మేట్స్‌ చిన్న స్కిట్‌ వేసి అందరినీ అలరించారు.

అనంతరం కెప్టెన్‌ జెస్సీ తన ఆదేశాలను బేఖాతరు చేశాడని బిగ్‌బాస్‌ ఆగ్రహించాడు. ఇంట్లోని ఆహార పదార్థాలను ఇచ్చేయమని చెప్పినప్పుడు లోబో, సన్నీ తింటున్నా ఏమనకుండా ఉండి నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అతడికి పెద్ద శిక్ష విధించాడు. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో నుంచి జెస్సీతో పాటు అతడి జోడీ కాజల్‌ను అనర్హులుగా ప్రకటించాడు. దీంతో తీవ్రంగా ఆగ్రహించిన జెస్సీ..  ఏ ఒక్కరూ తన మాట వినలేదని చిర్రెత్తిపోయాడు. తనను టార్గెట్‌ చేయడమైతే వచ్చని చిందులు తొక్కాడు.

అయినా కెప్టెన్‌కు సహకరించకపోవడం మన తప్పేనని కొందరు ఇంటిసభ్యులు పశ్చాత్తాపపడుతుంటే నటరాజ్‌ మాస్టర్‌ మాత్రం అసలు కెప్టెన్‌ ఇలా ఉంటాడా? కమాండింగ్‌గా ఉండాలి అని హితబోధ చేశాడు. ఇక జెస్సీని చెడగొడుతున్నారని సన్నీ, మానస్‌ అభిప్రాయపడ్డారు. మరోవైపు షణ్ముఖ్‌.. జెస్సీని కూర్చోబెట్టుకుని ఇక్కడ అందరూ సమానమే, ఎవరినీ అన్న, తమ్ముడు అని కాకుండా పేరు పెట్టి పిలవమని సూచించాడు.

తర్వాత పిడుగుల శబ్ధం వినబడగానే విశ్వ మొదటగా వెళ్లి బజర్‌ నొక్కాడు. దీంతో విశ్వ-రవి జోడీ.. ప్రియాంక సింగ్‌-ప్రియను పోటీదారులుగా ఎంచుకున్నారు. ఈ రెండు గ్రూపులకు కట్టెలు కొట్టడాన్ని టాస్క్‌గా ఇచ్చారు. ఇందులో 'విశ్వ' ప్రతాపం చూపించడంతో వీళ్ల జంట గెలిచింది. ఇక షణ్ముఖ్‌ మరోసారి.. టాస్కులో నీ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్‌ అవుతున్నానని రవితో చెప్పుకొచ్చాడు. అసలు నీవల్ల జెస్సీ ఇన్‌ఫ్లూయెన్స్‌ అవుతున్నాడని రవి రివర్స్‌ కౌంటరివ్వగా వాడే నాకు చెప్తూ ఉంటాడని కవరింగ్‌ ఇచ్చాడు షణ్ను. నీతో మాట్లాడటమే లేదు, అయినా ఇంకా ఇన్‌ఫ్లూయెన్స్‌ అవుతున్నా అనడమేంటో అర్థం కావడం లేదని అయోమయానికి లోనయ్యాడు. దీన్ని తెగేదాకా లాగడం అనవసరమని భావించి అక్కడితో ఆ విషయానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాడు రవి.

ఇంతలో బిగ్‌బాస్‌ బర్గర్‌ అండ్‌ ఫ్రైడ్‌ చికెన్‌ పంపించగా దాన్ని ఆరగిస్తానంటూ జెస్సీ ముందుకు వచ్చాడు. కానీ అంతలోనే పింకీ వచ్చి ఆ ప్లేటు పట్టుకెళ్లిపోయింది. లోబో ఆకలి చూపులు అర్థమైన రవి.. నటరాజ్‌ మాస్టర్‌ దగ్గరకు వెళ్లి ఎందుకైనా మంచిది, నీ జోడీని ఓ కంట కనిపెడుతూ ఉండమని హెచ్చరించాడు. అలా హెచ్చరించాడో లేదో, అటు లోబో ఆకలిని తట్టుకోలేక చెత్త కవర్‌లో ఫుడ్‌ కోసం వెతికాడు. అతడి బాధ అర్థమైన మాస్టర్‌.. నీకు ఆకలైతే తినేసేయ్‌ అని చెప్పాడు.

తర్వాతి రౌండ్‌లో సన్నీ బజర్‌ నొక్కగా, అతడు లోబో-నటరాజ్‌ మాస్టర్‌ను సెలక్ట్‌ చేసుకున్నాడు. వీరికి బిగ్‌బాస్‌ మునుగుతారా? తేలుతారా? అనే టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో కొన్ని వస్తువులు నీళ్లలో మునుగుతాయా? లేదా? అన్నది కరెక్ట్‌గా గెస్‌ చేయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో తెలివిగా ఆడిన మానస్‌-సన్నీ గెలుపొందారు. తర్వాత బిగ్‌బాస్‌ మటన్‌ బిర్యానీ పంపడంతో అందరూ ఆవురావురుమని ఆరగించారు. నటరాజ్‌ మాస్టర్‌, శ్రీరామ్‌, సన్నీ, హమీదా, సిరి, షణ్ముఖ్‌, మానస్‌ మాత్రం ముక్క కూడా ముట్టకుండా ఉపవాసం చేశారు. మొత్తంగా ఎక్కువ కిలోలు తగ్గిన మూడు జోడీల నుంచి ముగ్గురు.. సన్నీ, శ్రీరామ్‌, శ్వేత కెప్టెన్సీకోసం పోటీపడుతున్నట్లు కనిపిస్తోంది. వీరిలో శ్రీరామచంద్ర నాలుగో కెప్టెన్‌గా అవతరించాడని అంటున్నారు. మరి అందులో ఎంత నిజముందనేది రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు