టాలీవుడ్‌లో ‘కల్ట్‌’ వివాదం.. టైటిల్‌ ఎవరిది?

31 Dec, 2023 12:42 IST|Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ తన కొత్త సినిమాను ప్రకటించాడు. తన సొంత బ్యానర్లు వన్మయే క్రియేషన్స్, విశ్వక్‌ సేన్‌ సినిమాస్‌ పతాకంపై `కల్ట్`(#CULT) పేరుతో సినిమాని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి విశ్వక్‌ సేన్‌ కథ అందించగా.. తాజుద్దీన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు 25 మంది కొత్త యాక్టర్స్ ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ విషయాన్ని తాజాగా ప్రెస్‌ మీట్‌ పెట్టి ప్రకటించాడు విశ్వక్‌ సేన్‌. నిజంగా జరిగిన ఓ సంఘటన నుంచి స్పూర్తి పొంది ఈ కథను రాశాడట విశ్వక్‌. ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలతోపాటు 25 మంది ఆర్టిస్ట్ లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నట్టు చెప్పాడు. ఔత్సాహికులు ఆడిషన్‌ వీడియోలు సెండ్‌ చేయొచ్చని చెబుతూ..దానికి సంబంధించిన పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. 

(చదవండి: ఓటీటీలపై అగ్రతారల కన్ను.. ఈ ఏడాది అత్యధిక పారితోషికం ఎవరికంటే?)

ఇంతవరకు బాగానే ఉన్నా..ఇప్పుడు ఆ సినిమా టైటిల్‌పై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అలాంటి టైటిల్‌తోనే బేబి సినిమా నిర్మాత ఎస్‌కేఎన్‌ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. `కల్ట్ బొమ్మ` పేరుతో సినిమా షూటింగ్‌ని కూడా ప్రారంభించాడు. తాజాగా విశ్వక్‌ సేన్‌ కూడా `యాష్‌ ట్యాగ్‌ కల్ట్` టైటిల్‌ని ప్రకటించడంతో ఓ రిపోర్టర్‌ ఎస్‌కేఎన్‌ ‘కల్ట్‌ బొమ్మ’ గురించి గుర్తు చేశాడు. ‘ఎస్‌కేఎన్‌ ఇప్పటికే కల్ట్‌ బొమ్మ అనే టైటిల్‌ని రిజిస్టర్‌ చేయించుకున్నారు. మళ్లీ మీరు కల్ట్‌ అని పెడుతున్నారెందుకు? అని సదరు రిపోర్టర్‌ విశ్వక్‌ని ప్రశ్నించాడు.

దానికి విశ్వక్‌ సమాధానం ఇస్తూ... కల్ట్‌ బొమ్మనా..ఏమో మాకు తెలియదు. మేము అయితే #Cult అని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాం. నాకు తెలిసినంతవరకు కల్ట్‌కు సంబంధించి టైటిల్‌ ఎవరి వద్దా లేదు’  అని అన్నారు. విశ్వక్‌ వ్యాఖ్యలు వైరల్‌ అవ్వడంతో.. ఈ విషయంపై  నిర్మాత ఎస్‌కేఎన్‌ ఎక్స్‌  వేదికగా స్పందించారు. 

(చదవండి: కుర్చీని మడతపెట్టి' సాంగ్.. తమన్‌పై నెటిజన్స్ ట్రోల్స్!)

తాను ఇప్పటికే కల్ట్ బొమ్మ టైటిల్ ని రిజిస్టర్ చేయించుకున్నానని తెలిపారు. ‘బేబీ సినిమా సమయంలో కల్ట్ బొమ్మ అనే ప్రచారం ఎక్కువగా జరిగింది. దీంతో ఆ టైటిల్‌ని కొన్ని నెలల క్రితం తెలుగు ఫిల్మ్ ప్రొడూసర్స్ కౌన్సిల్‌లో నా తదుపరి సినిమాల్లో ఒకదాని కోసం బాధ్యతాయుతమైన చలన చిత్ర సభ్యునిగా, నిర్మాతగా ఈటైటిల్ని రిజిస్టర్‌ చేసుకున్నాం. టైటిల్‌ రిజిస్టర్‌ చేయకుండా ఎలాంటి ప్రకటన ఉండదు. మీ ప్రేమకి ధన్యవాదాలు’అని ఎస్‌కేఎన్‌ వివరణ ఇచ్చాడు. మొత్తానికి రెండు సినిమాల టైటిల్స్‌ దాదాపు ఒకేలా ఉండడంతో వివాదం చెలరేగే అవకాశం ఉందని కొంతమంది సినీ పండితులు చెబుతున్నారు. రెండు టైటిల్స్‌ మద్య చిన్న తేడా ఉంది కాబట్టి ఎలాంటి సమస్యలు రాకపోవచ్చని మరికొంత మంది అంటున్నారు.  మరి ఈ కల్ట్‌ గోల ఎలా ముగుస్తుందో చూడాలి. 

>
మరిన్ని వార్తలు