‘క్రాక్‌’ విడుదలకు ఎన్నో ఆటంకాలు.. చివరకు

20 Jan, 2021 08:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘‘క్రాక్‌’ సినిమా చాలా బాగుందని హీరోలు చిరంజీవి, రామ్‌చరణ్, దర్శకులు త్రివిక్రమ్, సురేందర్‌ రెడ్డి, హరీష్‌ శంకర్, అనిల్‌ రావిపూడితో పాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసించారు. సినిమా చూశాక చిరంజీవిగారు ఫోన్‌ చేసి, ఒంగోలులో నేను విన్నవి గుర్తొచ్చాయని అనడం మరచిపోలేను. మంగళవారం ఆయన్ని కలిశాను’’ అని డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని అన్నారు. రవితేజ, శ్రుతీహాసన్‌ జంటగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్‌’. సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ బ్యానర్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా జనవరి 9న విడుదలైంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ.. ‘కరోనా లాక్‌డౌన్‌లో దాదాపు 8 నెలలు విరామం వచ్చింది. ‘క్రాక్‌’ని ఓటీటీలో రిలీజ్‌  చేయమని ఒత్తిళ్లు వచ్చాయి. కానీ థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం తీసిన సినిమా అని బలంగా నమ్మి, థియేటర్స్‌లో రిలీజ్‌ కోసమే పట్టుదలగా ఎదురు చూశాను. సంక్రాంతికి విడుదలైన మా సినిమా పెద్ద విజయం సాధించడం ఆనందంగా ఉంది.

మా సినిమా విడుదలకు ముందు రోజు కోర్టు నుంచి స్టే రావడంతో రాత్రంతా నిద్రపట్టలేదు. మూడు షోలు రద్దు కావడంతో బాధపడ్డాను. ఇలాంటి ఇబ్బందులు ఏ దర్శకుడికి రాకూడదు’ అంటూ చెప్పుకొచ్చారు. అంతేగాక ఆ సమయంలో నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, దామోదర్‌ ప్రసాద్, నాగవంశీలతో పాటు ఇండస్ట్రీ తమకు అండగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా వారిందరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు‌. ఇక హీరోలు మంచు మనోజ్, సాయితేజ్‌ సహా పలువురు ఫోన్‌ చేసి ధైర్యాన్నిచ్చారని చెప్పారు. ఇక ఎన్నో అవాంతరాలు దాటుకుని ‘క్రాక్‌’ సినిమా విజయం సాధించడంతో మా బాధలన్నీ మరచిపోయామని ఆనందం వ్యక్తం చేశారు. కేవలం 50 శాతం సీటింగ్‌ కెపాసిటీ అయినా కూడా రవితేజ కెరీర్‌లోనే బిగ్‌ హిట్‌గా ‘క్రాక్‌’ నిలిచిందని,  ఈ సినిమాకి సీక్వెల్‌ చేసే ఆలోచన కూడా ఉందన్నారు. అలాగే హిందీలో రీమేక్‌ చేసేందుకు కొందరు అడుగుతున్నారని, ఈ రీమేక్‌ అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని ఆయన పేర్కొన్నారు. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు