Dunki 2023 Movie Review Telugu: ‘డంకీ’ మూవీ రివ్యూ

21 Dec, 2023 12:41 IST|Sakshi
Rating:  

టైటిల్‌: డంకీ
నటీనటులు: షారుక్‌ ఖాన్‌, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, బొమాన్‌ ఇరానీ, అనీల్ గ్రోవర్ తదితరులు
నిర్మాణ సంస్థలు:  జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ 
నిర్మాతలు:గౌరీ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండే
దర్శకత్వం: రాజ్‌ కుమార్‌ హిరాణీ
సంగీతం: అమన్‌ పంత్‌, ప్రీతమ్‌(పాటలు)
సినిమాటోగ్రఫీ: సీకే మురళీధరన్, మనుష్ నందన్, అమిత్ రాయ్, కుమార్ పంకజ్
విడుదల తేది: డిసెంబర్‌ 21, 2023

Dunki Movie Review In Telugu

ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా సినిమాలను తెరకెక్కించే అతికొద్ది మంది దర్శకుల్లో రాజ్‌ కుమార్‌ హిరాణీ ఒకరు. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే సాధారణంగానే అంచనాలు పెరిగిపోతాయి. అలాంటిది షారుక్‌ ఖాన్‌తో సినిమా అంటే.. ఆ అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. డంకీ విషయంలో అదే జరిగింది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా ఇది. అందుకే డంకీపై మొదటి నుంచే ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌ సినిమాపై మరింత బజ్‌ క్రియేట్‌ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్‌ 21)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పఠాన్‌, జవాన్‌ లాంటి భారీ బ్లాక్‌ బస్టర్ల తర్వాత షారుక్‌ నటించిన ఈ చిత్రం ఎలా ఉంది? షారుక్‌ ఖాతాలో హ్యాట్రిక్‌ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం.

Vicky Kaushal, Taapsee, Shah Rukh Khan In Dunki

డంకీ కథేంటంటే..
ఈ సినిమా కథంతా 1995లో సాగుతుంది. శత్రువుల దాడిలో గాయపడిన సైనికుడు హార్డీ(షారుఖ్‌)ని ఓ వ్యక్తి కాపాడుతాడు. కొన్నాళ్ల తర్వాత అతన్ని కలిసేందుకు హార్డీ పంజాబ్‌కి వస్తాడు. అయితే అప్పటికే ఆ వ్యక్తి మరణిస్తాడు. అతని సోదరి మను రంధ్వా అలియాస్‌ మన్ను(తాప్సీ పన్ను) కుటుంబ బాధ్యతను తీసుకుంటుంది. అప్పులు కట్టలేక ఇంటిని కూడా ఆమ్మేస్తారు. లండన్‌ వెళ్లి బాగా డబ్బు సంపాదించి.. అమ్ముకున్న ఇంటిని మళ్లీ కొనాలనేది మను కల. అలాగే ఆమె స్నేహితులు బుగ్గు లక్నపాల్‌(విక్రమ్‌ కొచ్చర్‌), బల్లి(అనిల్‌ గ్రోవర్‌) కూడా డబ్బు సంపాదించడానికై లండన్‌ వెళ్లాలనుకుంటారు. వీసా కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు. తన ప్రాణాలను కాపాడిన ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న హార్డీ.. మనుని లండన్‌ పంపించేందుకు సహాయం చేస్తాడు.

Dunki Movie HD Stills

ఈ నలుగురు వీసా కోసం ట్రై చేస్తారు. అందుకోసం ఇంగ్లీష్‌ నేర్చుకోవాలని అష్టకష్టాలు పడతారు. ఇంగ్లీష్‌ కోచింగ్‌ సెంటర్‌లో ఈ నలుగురికి సుఖీ(విక్కీ కౌశల్‌) పరిచయం అవుతాడు. తన ప్రియురాలి జెస్సీని కలిసేందుకు అతను లండన్‌ వెళ్లాలనుకుంటాడు. వీళ్లంతా లీగల్‌గా ఇంగ్లండ్‌ వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి. దీంతో దేశ సరిహద్దుల గుండా అక్రమంగా ప్రయాణించి లండన్‌ వెళ్లాలని డిసైడ్‌ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంగ్లండ్‌కు అక్రమంగా వెళ్లే క్రమంలో వీళ్లు పడిన కష్టాలేంటి? లండన్‌లో వీళ్లకు ఎదురైన సమస్యలు ఏంటి? ప్రియురాలి కోసం ఇంగ్లండ్‌ వెళ్లాలనుకున్న సుఖీ కల నెరవేరిందా లేదా? మన్నుతో ప్రేమలో పడిన హర్డీ.. తిరిగి ఇండియాకు ఎందుకు వచ్చాడు? పాతికేళ్ల తర్వాత.. మన్ను తిరిగి ఇండియాకు ఎందుకు రావాలనుకుంది? ఈ క్రమంలో హార్డీ మళ్లీ ఎలాంటి సహాయం అందించాడు? మను, హర్డీల ప్రేమ కథ సంగతేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Shah Rukh Khan And Taapsee HD Wallpapers

ఎలా ఉందంటే..
మంచి కథ, భావోద్వేగాలతో పాటు చక్కటి సామాజిక సందేశం ఉన్న సినిమాలను తెరకెక్కించడం రాజ్‌ కుమార్‌ హిరాణి స్పెషాలిటీ. సామాజిక అంశాలకు వినోదాన్ని మేళవించి ప్రేక్షకులకు అర్థమయ్యేలా సినిమాను తీర్చిదిద్దుతాడు. మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌, లగే రహో మున్నాభాయ్‌, త్రి ఇడియట్స్‌, పీకే, సంజు..చిత్రాలే వీటికి నిదర్శనం. డంకీ చిత్రంలో కూడా మంచి సోషల్‌ మెసేజ్‌ఉంది. కానీ దాన్ని ప్రేక్షకులకు ఆకట్టుకునేదే తీర్చిదిద్దడంలో రాజ్‌ కుమార్‌ హిరాణీ పూర్తిగా సఫలం కాలేదు.

 భారత్‌ నుంచి అక్రమంగా యూకేలోకి ప్రవేశించాలనుకునే నలుగురు స్నేహితుల కథే డంకీ. దర్శకుడు రాజ్‌ కుమార్‌.. అక్రమ వలసదారుల కాన్సెప్ట్‌ని తీసుకొని దానికి దేశభక్తి, లవ్‌స్టోరీని టచ్‌ చేసి ఎమోషనల్‌ యాంగిల్‌లో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ పాత్రలదారుల భావోద్వేగాలను ప్రేక్షకులు ఫీల్‌ అయ్యేలా చేయలేకపోయాడు. ఎమోషనల్‌ సీన్లను ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేకపోయాడు. వినోదం పండించడంలో మాత్రం తన పట్టు నిలుపుకున్నాడు.

Shah Rukh Khan Latest Stills

ఫస్టాఫ్‌ అంతా చాలా సరదాగా సాగిపోతుంది. పాతికేళ్లుగా లండన్‌లో ఉన్న మన్ను తిరిగి ఇండియా రావాలనుకొని ఆస్పత్రి నుంచి బయటకు పారిపోయే సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కాసేపటికే కథ 1995లోకి వెళ్తుంది. మన్ను.. ఆమె స్నేహితులు బల్లి,బుగ్గుల నేపథ్యం నవ్విస్తూనే.. ఎమోషనల్‌గా టచ్‌ అవుతుంది. ఇక హీరో ఎంట్రీ అయిన కాసేపటికే కథంతా కామెడీ మూడ్‌లోకి వెళ్తుంది. ఇంగ్లీష్‌ నేర్చుకోవడం కోసం ఈ మను గ్యాంగ్‌ పడే కష్టాలు నవ్వులు పూయిస్తాయి. అలాగే వీసా కోసం చేసే ప్రయత్నాలు కూడా నవ్విస్తాయి. ఇంటర్వెల్‌ ముందు వచ్చే సన్నివేశం ఎమోషనల్‌కు గురి చేస్తుంది.

ఇక సెకండాఫ్‌ అంతా కాస్త సీరియస్‌గా సాగుతుంది. డంకీ రూటులో( దేశ సరిహద్దులగుండా అక్రమంగా ప్రయాణించడాన్ని డాంకీ ట్రావెల్‌ అంటారు. పంజాబ్‌లో దాన్ని డంకీ అని పిలుస్తారు) ఇంగ్లండ్‌కి వెళ్లే క్రమంలో వచ్చే  కొన్ని సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. ఇక లండన్‌ వెళ్లాక  ఈ నలుగు పడే కష్టాలు నవ్విస్తూనే..కంటతడి పెట్టిస్తాయి. కొన్ని సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. తిరిగి ఇండియాకు రావాలనుకున్నా..మళ్లీ డాంకీ ట్రావెలే చేయాల్సి వస్తుంది. ఆ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ కన్నీళ్లను పెట్టిస్తుంది.  కథ సాగదీసినట్లుగా అనిపించడం.. ప్రేక్షకుడి ఊహకు అందేలా కథనం సాగడం కూడా మైనస్‌.

Dunki Movie Photos

ఎవరెలా చేశారంటే.. 
పఠాన్‌, జవాన్‌ చిత్రాల్లో యాక్షన్‌తో ఇరగదీసిన షారుక్‌.. ఇందులో సాదాసీదా పాత్రలో కనిపించి, తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హార్డీసింగ్‌ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. కామెడీ పాటు ఎమోషనల్‌ సన్నివేశాల్లో కూడా అద్భుతంగా నటించాడు. అయితే ఓల్డ్‌ లుక్‌లో షారుఖ్‌ని చూడడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో తాప్సీకి మరో బలమైన పాత్ర లభించింది. మన్ను పాత్రలో ఆమె ఒదిగిపోయింది. సినిమా మొత్తం ఆమె పాత్ర ఉంటుంది. కొన్ని చోట్ల అయితే తనదైన నటనతో కన్నీళ్లను తెప్పిస్తుంది.

ఇక విక్కీ కౌశల్‌ ఈ చిత్రంలో కనిపించేది కొద్ది సేపే అయినా..గుర్తిండిపోయే పాత్రలో నటించాడు. విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్‌, బోమన్‌ ఇరాన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. అమన్‌ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ప్రీతమ్‌ పాటలు పర్వలేదు.లుట్‌ ఫుట్‌ గయా సాంగ్‌ ఆకట్టకుంటుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.5/5)
>
మరిన్ని వార్తలు