Sivakarthikeyan: 'నాన్న లేరు.. అన్నయ్య లేరు'.. అంతా మీరే: శివ కార్తికేయన్

12 Mar, 2024 16:08 IST|Sakshi

కోలీవుడ్‌లో స్వయం కృషితో స్టార్‌గా ఎదిగిన నటుడు శివ కార్తికేయన్‌. ఒక టీవీ యాంకర్‌గా కెరియర్‌ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత నటుడిగా పరిచయమై సపోర్టింగ్‌ పాత్రలు చేస్తూ ఆపై హీరోగా ఎదిగారు. ధనుశ్ కథానాయకుడిగా నటించిన మూడో చిత్రంలో శివ కార్తికేయన్‌ ఆయనకు ఫ్రెండ్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మనం కొత్తి పరవై చిత్రం ద్వారా హీరోగా అవతారం ఎత్తారు. అలా ఇప్పటికి 20 చిత్రాల్లో కథానాయకుడుగా నటించారు. ఇందులో పలు చిత్రాలు సూపర్‌ హిట్‌ కాగా అభిమానులు మెచ్చిన స్టార్‌గా ఎదిగారు. 

తాజాగా నటిస్తున్న 21వ చిత్రం అమరన్‌. నటి సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని రాజ్‌ కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇందులో శివ కార్తికేయన్‌ సైనిక కమెండోగా నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం చాలా కసరత్తులు చేశారు. చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర ఓటీటీ హక్కులను నెట్‌ ఫ్లిక్స్‌ సంస్థ రూ.60 కోట్లకు సొంతం చేసుకోవడం విశేషం. 

శివ కార్తికేయన్‌ నటించిన చిత్రాలన్నింటిలో అత్యధిక మొత్తానికి ఓటీటీ హక్కులు అమ్ముడుపోయిన చిత్రం ఇదే కానుంది. ఇంతకుముందే శివ కార్తికేయన్‌ నటించిన మావీరన్‌ చిత్రం ఓటీటీ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ రూ.33 కోట్లు చెల్లించింది. దీంతో అమరన్‌ చిత్రంపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. శివ కార్తికేయన్‌ ఆదివారం తన అభిమానులను కలుసుకున్నారు. 

ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ ‘మీరు దేని గురించి ఆలోచించకండి. మీ కోసం నేనున్నాను. నాకు అంతా మీరే. జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నా. వాటి బాధ ఉంటుంది. కొన్ని మీకు తెలిసినా, చాలా విషయాలు తెలియదు. సమస్యలు చెప్పుకోవడానికి నాకు నాన్న లేరు. సపోర్ట్‌ చేయడానికి అన్నయ్య లేరు. నాకిప్పుడు బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌ అయినా అంతా మీరే’. అంటూ నటుడు శివకార్తికేయన్‌ భావోద్వేగానికి గురయ్యారు.
 

Election 2024

మరిన్ని వార్తలు