Indian Actors In Hollywood: హాలీవుడ్‌కు హాయ్‌ చెబుతున్న ఇండియన్‌ తారలు

9 Mar, 2022 07:35 IST|Sakshi

భారతదేశ సినిమా రేంజ్‌ మాత్రమే కాదు.. ఇండియన్‌ తారల స్థాయి కూడా హాలీవుడ్‌ రేంజ్‌కు చేరుతోంది. హాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తున్న భారతీయ తారల సంఖ్య పెరుగుతోంది. గతంలో ఐశ్వర్యా రాయ్, దీపికా పదుకొణె, ఈ మధ్య హ్యూమా ఖురేషీ, డింపుల్‌ కపాడియా, సునీల్‌ శెట్టి, పంకజ్‌ త్రిపాఠి, అలీ ఫాజల్‌ తదితరులు హాలీవుడ్‌ తెరపై కనిపించారు. ఇక ఇండియన్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రా హాలీవుడ్‌ కోడలయ్యాక వరుసగా అక్కడి సినిమాల్లో, వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తున్నారు. తాజాగా ‘హాలీవుడ్‌కి హాయ్‌’ చెబుతున్న స్టార్స్‌ గురించి తెలుసుకుందాం. 

ఇండియాలో యాక్టర్‌గా ధనుష్‌ రేంజ్‌ ఏంటో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఉత్తమ నటుడిగా ధనుష్‌ ఖాతాలో జాతీయ అవార్డులు ఉన్నాయి. ఇప్పుడు ధనుష్‌ ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో కనబడనుంది. ‘ది గ్రే మ్యాన్‌’ అనే హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌కు ధనుష్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. బాక్సాఫీసును షేక్‌ చేసిన ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’, ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ వంటి సినిమాలను తెరకెక్కించిన రూసో బ్రదర్స్‌ (ఆంథోనీ రూసో, జోసెఫ్‌ రూసో) ‘ది గ్రే మ్యాన్‌’కు దర్శకులు. ఇంగ్లీష్‌ యాక్టర్స్‌ ర్యాన్‌ గోస్లింగ్, క్రిస్‌ ఎవాన్స్, అనా డి అర్మాస్‌లతో కలిసి ధనుష్‌ ఈ చిత్రంలో నటించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ భారీ బడ్జెట్‌ ప్రాజెక్ట్‌లో ధనుష్‌ పాత్ర నెగటివ్‌ షేడ్స్‌తో ఉంటుందనే వార్తలు వచ్చాయి. మరి.. ఈ వార్తలు నిజమైతే ధనుష్‌ ఎంట్రీ హాలీవుడ్‌లో విలన్‌గానే ఉంటుందా? చూడాలి. ఈ చిత్రం ఈ ఏడాది ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. 

మరోవైపు స్టార్‌ హీరోయిన్‌ సమంత ఓ సినిమా కోసం ఆ మధ్య ఆడిషన్స్‌ ఇచ్చారు. పైగా ‘ఇది చాలా ప్రత్యేకమైన ఆడిషన్స్‌’ అని ఆమె పేర్కొన్నారు కూడా. ఈ సమ్‌థింగ్‌ స్పెషల్‌ ఆడిషన్స్‌ హాలీవుడ్‌ ఎంట్రీ కోసమే అని ఊహించవచ్చు. ఫిలిప్‌ జాన్‌ దర్శకత్వంలో రూపొందనున్న ‘అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’లో సమంత ఓ లీడ్‌ రోల్‌ చేయనున్నారు. ఈ సినిమాకు సునీత తాటి ఓ నిర్మాత. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ఆరంభం కానున్నట్లు తెలిసింది. ఇక సౌత్‌ అండ్‌ నార్త్‌ ఇండస్ట్రీస్‌ను బ్యాలెన్స్‌ చేస్తూ సినిమాలు చేస్తున్నారు శోభితా దూళిపాళ్ల. ఇప్పుడు హాలీవుడ్‌లోనూ తన ప్రతిభను చాటుకోవాలనుకున్నారు. ‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌’ నటుడు దేవ్‌ పటేల్‌ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఇంగ్లీష్‌ ఫిల్మ్‌ ‘మంకీ మ్యాన్‌’లో ఓ లీడ్‌ క్యారెక్టర్‌ చేశారు శోభిత. యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీగా రూపొందిన ఈ చిత్రం త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. 

బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌కు ఈ ఏడాది బాగా కలిసి వస్తున్నట్లుగా ఉంది. తెలుగులో ఆలియా చేసిన తొలి చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఈ ఏడాదే విడుదల కానుంది. అలాగే ఆలియా నిర్మాతగా మారి హిందీలో నిర్మించిన ‘డార్లింగ్‌’ చిత్రం త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. వీటికి తోడు ఆలియా హాలీవుడ్‌ ఎంట్రీ కూడా ఈ ఏడాదే ఖరారయింది. టామ్‌ హార్పర్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఇంటర్‌నేషనల్‌ స్పై డ్రామా ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’లో ఆలియా ప్రధాన పాత్రలో నటించనున్నారు. హాలీ వుడ్‌ నటీనటులు గాల్‌ గాడోట్, జామీ డోర్నన్‌ ఈ చిత్రంలో ఇతర ముఖ్య తారలు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ కానుంది. 

అలాగే ఇప్పటివరకూ హాలీవుడ్‌ తెరపై అతిథి పాత్రల్లో కనిపించిన సునీల్‌ శెట్టి, పంకజ్‌ త్రిపాఠి ఇప్పుడు పూర్తి స్థాయి పాత్రల్లో హాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నారు. మరి.. భవిష్యత్‌లో ఇంకెంతమంది ఇండియన్‌ స్టార్స్‌ హాలీవుడ్‌కి వెళతారో చూడాలి. 

మరిన్ని వార్తలు