Ghantasala: మేనమామ కుమార్తెతోనే ఘంటసాల వివాహం​.. అలా సినీ కెరీర్‌

2 Dec, 2022 14:54 IST|Sakshi

ఆ స్వరం వింటే చాలు తెలుగు వారు పులకించి పోతారు. ఆ పేరు విన్నా.. తలచినా.. పాట మురిసి పోతుంది. పద్యం పరవశించి పోతుంది. జానపదాల నుంచి జావళీల దాకా భక్తి గీతాల నుంచి అష్టపదుల దాకా ఆయన ముద్ర కనిపిస్తుంది. ఇంతింతై వటుడింతై అన్నట్టు కృష్టాజిల్లా గుడివాడ సమీపంలోని చౌటపల్లిలో పుట్టిన ఒక సామాన్యమైన వ్యక్తి తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారంటే స్వరస్వతీ దేవి ఆయన నాలుక మీద బీజాక్షరాలు రాయబట్టే. ఆయనే తెలుగువారంతా గర్వంగా చెప్పుకునే ఘంటసాల వెంకటేశ్వరరావు. డిశంబరు 4 ఆయన శతజయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం.

కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని చౌటపల్లిలో 1922 డిసెంబరు 4 వ తేదీన సామాన్య కుటుంబంలో జన్మించిన ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం వడ్డించిన విస్తరి కాదు. బాల్యంలో బాలారిష్టాలతో గడిచింది. 1936లో తన 14వ ఏట తన దగ్గరున్న బంగారు ఉంగరాన్ని అమ్మి సంగీతం నేర్చుకోవడానికి విజయనగరం చేరుకున్నారు. విజయనగరం రాజులు కళా పోషకులు కావడంతో అనేక విద్యాలయాలను ప్రారంభించారు. వయొలిన్‌ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు ప్రోత్సాహంతో పాట్రాయని సీతారామశాస్త్రి వద్ద శాస్త్రీయ సంగీతం అధ్యయనం చేశారు. 1941లో విద్వాన్‌ పట్టాతో కళాశాల నుంచి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. 1944లో మేనమామ కుమార్తెను వివాహం చేసుకున్నారు. అదే సంవత్సరం మద్రాసు ప్రయాణమైన ఘంటసాల సినీ ప్రస్థానం 1974 పిబ్రవరి 11న ముగిసింది.

సినీ ప్రస్ధానం: ఘంటసాల మాస్టారి సమీప బంధువైన సినీరంగ ప్రముఖుడు సముద్రాల రాఘవాచారి ఆశీస్సులతో 1944లో మద్రాసు చేరుకున్నారు. అవకాశాల కోసం ఏడాది పాటు ఎదురు చూశారు. 1945లో తొలిసారిగా ఆయన స్వరం గాజులపిల్ల పాట(స్వర్గసీమ) ద్వారా తెలుగు వారికి పరిచయమైంది. ఇక ఆయన వెనక్కు తిరిగి చూసుకునే అవసరం లేక పోయింది. వేలాది గీతాలు పాడారు. భక్తి గీతాలు, విషాద గీతాలు. సోలో ఇలా... పాట ఏదైనా మాస్టారి పాటలకు మంత్రముగ్ధులు కాని తెలుగు వారు లేరంటే అతిశయోక్తి లేదు. ఘంటసాల కేవలం సినీ గాయకుడే కాదు...స్వాతంత్య్ర సమరయోధుడు, సినీ నిర్మాత, సంగీత దర్శకుడు.

పలు భాషల్లోని చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. తన జీవిత చరమాంకంలో ఘంటసాల గానం చేసిన భగవద్గీత ఆయనకు శాశ్వత కీర్తిని సంపాదించి పెట్టింది. విదేశాలలో సహితం అక్కడున్న తెలుగువారికి గాన విందు పంచి పెట్టారు ఘంటసాల. సినిమాలో ఆయన తొలి పారితోషికం 116 రూపాయలు. అప్పటి సినీ నేపథ్యగాయకులు, గాయనీమణులు దాదాపుగా ఆయనతో కలసి పాటలు పాడారు. హెచ్‌ఎంవీ సంస్థ తొలి దశలో ఆయన స్వరం రికార్డులకు పనికి రాదంది. తరువాత వారే ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఘంటసాల పేరుతో పోస్టల్‌ స్టాంప్‌ ఘంటశాల మరణానంతరం 2003లో ఆయన పేరుతో తపాలా శాఖ పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేసి ఆయన పట్ల తన భక్తిని చాటుకుంది. అభిమానులు ఊరూరా ఘంటసాల విగ్రహాలను ఏర్పాటు చేసుకుని తమ అభిమానం చాటుకున్నారు.

ప్రభుత్వం ఆధ్వర్యంలో శత జయంతి వేడుకలు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో డిసెంబరు నాలుగవ తేదీన ఘంటసాల శత జయంతి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆయన అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. 1970 లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది.1972లో రవీంద్రభారతిలో కచేరీ నిర్వహిస్తూ ఉండగా ఆయనకు తొలిసారిగా గుండెనొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరారు.1974లో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అదే ఏడాది ఫిబ్రవరి 11న మద్రాస్‌లోని విజయా హాస్పిటల్‌లో తెలుగు ప్రేక్షకుల హృదయాలను విడిచి ఆయన గంధర్వలోకానికి తరలిపోయారు.

టేకుపల్లిలో 4న ఘంటసాల కళామండపానికి శంకుస్థాపన
అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు తండ్రి సూర్యనారాయణ స్వగ్రామం కృష్ణాజిల్లా మోపిదేవి మండలం టేకుపల్లి గ్రామం. ఘంటసాల గుడివాడ సమీపంలోని చౌటపల్లిలో మేనమామ ర్యాలీ పిచ్చిరామయ్య ఇంటి వద్ద జన్మించారు. తండ్రి సూర్యనారాయణ స్థానిక రామేశ్వరస్వామివారి ఆలయంలో పూజారిగా ఉండేవారు. పేదరికం వల్ల తండ్రి మృదంగం వీపున కట్టుకుని, గ్రామాల్లో భగవత్‌ కీర్తనలు ఆలపిస్తుండగా ఘంటసాల నృత్యం చేస్తుండేవారు. 11వ ఏటనే తండ్రిని కోల్పోవడంతో చౌటపల్లిలో మేనమామ వద్దనే పెరిగారు. ఘంటసాల స్వగ్రామమైన టేకుపల్లిలో ఆయన శత జయంతి సందర్భంగా ఈ నెల 4వ తేదీన ఘంటసాల పేరుతో కళా మండపానికి శంకుస్థాపన చేయనున్నారు.

ఘంటసాల పాటల చరిత్ర భావితరాలకు అందాలి
అమరగాయకుడు ఘంటసాల గాన చరిత్ర భావితరాలకు అందించాలనే సంకల్పంతో ఘంటసాల పాటలను సేకరించడం మొదలు పెట్టాను. వందలాది పాటలతో పుస్తక రూపంలోకి తీసుకువచ్చాను. నేను సేకరించిన ఘంటసాల సంపూర్ణ తెలుగు పాటలను శతవర్ష ఘంటసాల పేరుతో వచ్చిన పుస్తకాన్ని మాజీ ఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు. –చల్లా సుబ్బారాయుడు ఘంటసాల పాటల సేవకుడు

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు