మీర్జాపూర్‌-2: తెలుగు ప్రేక్షకులకు పండగే..

11 Dec, 2020 11:32 IST|Sakshi

ముంబై : క్రైమ్‌, థ్రిల్లర్‌ యాక్షన్‌ వెబ్‌ సిరీస్‌గా నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది మీర్జాపూర్‌. పంక్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌, దివ్యేందు శర్మ, శ్వేత త్రిపాఠి, హర్షితా శేఖర్‌, అమిత్‌ సియాల్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్‌ సిరీస్‌ను కరణ్‌ అన్షుమన్‌, గుర్మీత్‌ సింగ్‌లు తెరకెక్కించారు. ఇటీవల ఈ సిరీస్‌కు కొనసాగింపుగా మీర్జాపూర్‌ 2 వచ్చిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 23న సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ అధికారికంగా విడుదల అయ్యింది. అయితే మీర్జాపూర్‌ మొదటి సిరీస్‌ తెలుగుతోపాటు అన్ని ప్రాంతీయ భాషల్లోకి డబ్ అవ్వగా.. మీర్జాపూర్‌-2 మాత్రం కేవలం హిందీలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. చదవండి: మీర్జాపూర్‌ 2: ఫ్యాన్స్‌ అసంతృప్తి

దీంతో తెలుగు ప్రేక్షకులు పూర్తిగా నిరాశ చెందారు. మీర్జాపూర్‌-2ను తెలుగు‌లోనూ విడుదల చేయాలని అభిమానులు పట్టుబట్టారు. తెలుగు వెర్షన్‌ను కోరుతూ సోషల్‌ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేశారు. దీనిపై స్పందించిన మీర్జాపూర్‌-2 చిత్ర యూనిట్‌ తాజాగా తెలుగు అభిమానులకు శుభవార్తను అందించింది. ప్రస్తుతం హిందీలో మాత్రమే విడుదలైన ఈ సిరీస్‌ను తెలుగులోనూ రిలీజ్‌ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో శుక్రవారం(డిసెంబర్‌ 11) రోజు అమెజాన్‌ ప్రైమ్‌లో తెలుగు ఆడియోను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక మీర్జాపూర్‌ ప్రస్తుతం తెలుగులోనూ లభించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా మొదటి సీజన్‌తో పోల్చుకుంటే రెండో సీజన్‌ అభిమానులను నిరాశకు గురిచేసింది. హింస మరింత పెరిగిందని, ఎవర్ని ఎవరు చంపుతున్నారో క్లారిటీ లేదని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు