‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’మూవీ రివ్యూ

18 Aug, 2023 08:08 IST|Sakshi
Rating:  

టైటిల్‌: మిస్టర్‌ ప్రెగ్నెంట్‌
నటీనటులు: సోహైల్‌, రూపా కొడవాయుర్ ,సుహాసిని మణిరత్నం, వైవా హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర తదితరులు
నిర్మాణ సంస్థ: మైక్ మూవీస్
నిర్మాతలు:  అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి
దర్శకత్వం: శ్రీనివాస్‌ వింజనంపాటి
సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్‌
సినిమాటోగ్రఫీ: నిజార్‌ షఫీ
విడుదల తేది: ఆగస్ట్‌ 18, 2023

కథేంటంటే.. 

గౌతమ్‌(సోహైల్‌) ఓ ఫేమస్‌ టాటూ ఆర్టిస్ట్‌. చిన్నప్పుడే అమ్మానాన్నలు చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తుంటాడు. గౌతమ్‌ అంటే మహి(రూపా కొడవాయుర్‌)కి చాలా ఇష్టం. కాలేజీ డేస్‌ నుంచి అతన్ని ప్రేమిస్తుంది. కానీ గౌతమ్‌ మాత్రం ఆమెను పట్టించుకోడు. ఓ సారి ఫుల్‌గా తాగి ఉన్న గౌతమ్‌ని దగ్గరకి వచ్చి ప్రపోజ్‌ చేస్తుంది మహి. పెళ్లి చేసుకుందాం అని కోరుతుంది. దానికి ఒప్పుకున్న గౌతమ్‌.. పిల్లలు వద్దనుకుంటేనే పెళ్లి చేసుకుందామని కండీషన్‌ పెడతాడు. అయితే ఇదంతా గౌతమ్‌ మద్యంమత్తులో చెప్తాడు. కానీ మహి మాత్రం గౌతమ్‌ కోసం పిల్లలు పుట్టకుండా ఆపరేషన్‌ చెయించుకోవడానికి కూడా సిద్ధపడుతుంది. విషయం తెలుసుకున్న గౌతమ్‌.. మహికి తనపై ఉన్న ప్రేమను అర్థం చేసుకొని పెళ్లికి ఓకే చెబుతాడు. మహి పేరెంట్స్‌ మాత్రం పెళ్లికి అంగీకరించరు. దీంతో మహి ఇంట్లో నుంచి బయటకు వచ్చి గౌతమ్‌ని పెళ్లి చేసుకుంటుంది. కొన్నాళ్లపాటు ఎంతో అనోన్యంగా వీరి జీవితం సాగుతుంది. పిల్లలే వద్దనుకున్న గౌతమ్‌కి పెద్ద షాక్‌ తగులుతుంది. మహి గర్భం దాల్చుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గౌతమ్‌ ఎందుకు గర్భం మోయాల్సి వచ్చింది? అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఓ మగాడు ప్రెగ్నెంట్‌ అయితే సమాజం అతన్ని ఎలా చూసింది? చివరకు అతని డెలివరీ సాఫీగా సాగిందా లేదా? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే.. 
ఓ మగాడు గర్భం దాల్చడం అనే కాస్సెప్టే చాలా కొత్తగా ఉంది. ఇదొక ప్రయోగం కూడా. ఇలాంటి కథలను తెరపై చూపించడం కత్తిమీద సాములాంటిదే. కాస్త తేడా కొట్టినా.. ‘కథ వేరుంటుంది’.  తొలి ప్రయత్నంలోనే దర్శకుడు శ్రీనివాస్‌ వింజనంపాటి ఇలాంటి క్రేజీ పాయింట్‌ని ఎంచుకొని, దాన్ని తెరపై కన్విన్సింగ్‌గా చూపించాడు. కామెడీ, ఎమోషన్స్, ప్రేమ, రొమాన్స్‌ ఇలా అన్ని ఉండేలా జాగ్రత్త పడ్డాడు. అయితే వాటిని పూర్తిగా వాడుకోవడంలో మాత్రం కాస్త తడబడ్డారు. ఫస్టాఫ్‌లో కథ రొటీన్‌గా సాగుతుంది.

గౌతమ్‌ని మహి ప్రేమించడం.. అతని చుట్టూ తిరగడం..మధ్యలో టాటూ పోటీ నిర్వహించడం.. క్లైమాక్స్‌ కోసమే అన్నట్లు ఓ విలన్‌ని పరిచయం చేయడం..ఇలా కథనం సాగుతుంది. అసలు హీరోయిన్‌ హీరోని ఎందుకు అంత పిచ్చిగా ప్రేమిస్తుందనేది బలంగా చూపించలేకపోయారు.  హీరో హీరోయిన్ల పెళ్లి తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. ఆటో సీన్‌తో కథ ఎమోషనల్‌ వైపు సాగుతుంది. హీరో ఫ్లాష్‌ బ్యాక్‌ స్టోరీ కూడా భావోద్వేగానికి గురిచేస్తుంది. హీరో ఎందుకు గర్భం దాల్చుతున్నారనేది కన్విన్సింగ్‌గా చూపించారు.ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.

ఇక సెకండాఫ్‌లో కథ ఆసక్తికరంగా, ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. అప్పటివరకు వైవా హర్ష రొటీన్‌ కామెడీతో కాస్త విసిగిపోయిన ప్రేక్షకులకు బ్రహ్మాజీ ఎంట్రీ పెద్ద ఊరటనిస్తుంది. ‘గే’క్యారెక్టర్‌తో బ్రహ్మాజీ చేసే కామెడీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. ఆ తర్వాత వెంటనే కథ ఎమోషనల్‌ టర్న్‌ తీసుకుంటుంది. గౌతమ్‌ గర్భం దాల్చిన విషయం వైరల్‌ కావడం.. ఆ తర్వాత అతను పడే అవమానాలు, భార్య పడే ఇబ్బందులను చాలా బాగా డీల్‌ చేశారు. ఇక క్లైమాక్స్‌లో ఆడవారి గురించి, గర్భం దాల్చిన సమయంలో వారు పడే ఇబ్బందుల గురించి చేప్పే సీన్‌ ఎమోషనల్‌కు గురిచేస్తుంది. భార్యకు సాయం చేస్తే అర్థం చేసుకోవడం కానీ ఆడంగితనం ఎలా అవుతుంది? లాంటి సంభాషణలు ఆలోచింపజేస్తాయి. ఓవరాల్‌గా ఓ డిఫరెంట్ మూవీ చూద్దామనుకుంటే 'మిస్టర్ ప్రెగ్నెంట్' ప్రయత్నించండి. 

ఎవరెలా చేశారంటే.. 
నటీనటుల ఫెర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. గౌతమ్ పాత్రలో సొహెల్ బాగా నటించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో ప్రేక్షకుల్ని కన్నీళ్లు పెట్టించాడు. హీరోయిన్‌గా చేసిన రూపకు మంచి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. వైవా హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్‌ తమదైన కామెడీతో నవ్వించారు. డాక్టర్ వసుధగా సుహాసినికి మంచి పాత్ర దక్కింది. మిగతా యాక్టర్స్ తమ పరిధి మేరకు నటించారు.

ఇక సాంకేతిక విషయాలకొస్తే.. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం సినిమా స్థాయిని పెంచింది. పాటలు పర్వాలేదు. పిక్చరైజేషన్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ సినిమాకు సరిగా సరిపోయింది. సినిమాటోగ్రాఫర్‌ షఫీ.. తన లెన్స్‌తో మిస్టర్ ప్రెగ్నెంట్‌ని అందంగా చూపించారు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్ విషయంలో  నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని మూవీ చూస్తే అర్థమవుతుంది. 

Rating:  
(2.75/5)
మరిన్ని వార్తలు