Nora Fatehi: స్టార్‌ హీరోహీరోయిన్లు డిప్రెషన్‌లో.. నాకు అలాంటి లైఫ్‌ వద్దు!

22 Mar, 2024 13:40 IST|Sakshi

ఎన్నో దెబ్బలు పడితే కానీ రాయి శిల్పంలా మారదు.. మనిషి జీవితమూ అంతే! ఎన్నో కష్టాలను, ఒడిదుడుకులను అధిగమిస్తే కానీ విజయం సొంతం కాదు. ఇందుకు సెలబ్రిటీలు అతీతం కాదు. ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీకి వచ్చినా.. ఇక్కడ జయాపజయాలతో నిత్యం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఓటమితో ఫేడవుట్‌ అయిపోకుండా తమ స్థానాన్ని పదిలంగా కాపాడుకోవాల్సి ఉంటుంది. అవకాశాల కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది.

ఎవరికీ అంత తీరిక ఉండదు
దీని గురించి డ్యాన్సింగ్‌ క్వీన్‌, హీరోయిన్‌ నోరా ఫతేహి మాట్లాడుతూ.. 'మనకు ఛాన్సులు రాకపోతే అవతలివారిని నిందించడం కరెక్ట్‌ కాదు. ఎందుకంటే వాళ్లు ఒక మూస పద్ధతిలో వెళ్తుంటారు. పెద్ద పెద్ద స్టార్స్‌ను కలవాలని, వారితో పరిచయం పెంచుకోవాలని, వీలు కుదిరితే కలిసి సినిమా తీసి హిట్‌ కొట్టాలని ఆశపడుతుంటారు. వారికి మనల్ని గుర్తించే సమయం ఉండదు. నేను ఎవరినీ బ్లేమ్‌ చేయడం లేదు. నన్ను నేనే అనుకుంటున్నాను. వారు నాకు సమయమిచ్చేలా నన్ను నేను నిరూపించుకోవాలి.

నేనేంటో నిరూపించుకుంటాను
నేనదే చేశాను. నేను ఒక ఆర్టిస్టును.. డ్యాన్స్‌ చేస్తాను, పాటలు పాడతాను, మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ నిర్మిస్తాను, యాక్ట్‌ చేస్తాను, డ్యాన్స్‌ షోలకు జడ్జిగానూ వ్యవహరించగలను. ఇది నా పర్సనాలిటీ! ఎవరో నా టాలెంట్‌ గుర్తిస్తారని ఎదురుచూస్తే ఉండేకన్నా నేనేంటో నేనే నిరూపించుకుంటే బెటర్‌ కదా! అన్నింట్లోనూ ఓ చేయేశాను కాబట్టే అవకాశాలు లేవనో, ఖాళీగా ఉన్నాననో ఎప్పుడూ డిప్రెషన్‌లోకు లోనవలేదు.

వారిలా ఒత్తిడికి లోనవను
పెద్దపెద్ద స్టార్‌ హీరోహీరోయిన్లు ఛాన్సులు రావడం లేదని, సక్సెస్‌ లేదని ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. వారి సినిమా ఆడలేదంటే దాదాపు ఏడెనిమిది నెలల దాకా ఒక్క ఛాన్స్‌ రాదు. దీంతో వారు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతారు. నేను వారిలా ఉండాలనుకోవడం లేదు. జీవితం చాలా చిన్నది. పాజిటివ్‌గా ఉండాలి. ఇండస్ట్రీకి మన మనసును, ధైర్యాన్ని ముక్కలు చేసే శక్తి ఇవ్వకూడదు. మన ప్రతిభకు తగ్గ అవకాశాలు ఆలస్యంగానైనా వస్తాయి. వాటి కోసం ఎదురుచూడాలి' అని నోరా చెప్పుకొచ్చింది.

చదవండి: మెగాస్టార్‌ సాంగ్‌లో కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టిన బ్యూటీ.. తొలిసారి ఇలా

Election 2024

మరిన్ని వార్తలు