రూ.కోటి అందుకున్న తొలి హీరో! మీరు అస్సలు ఊహించి ఉండరు!

11 Mar, 2024 13:38 IST|Sakshi

కోలీవుడ్‌లో రజనీకాంత్, కమల్ హాసన్ టాప్ నటులుగా ఉన్న సమయంలో కూడా వారి కంటే ముందుగా ఒక సినిమాకు కోటి రూపాయలు రెమ్యునరేషన్‌ అందుకున్న టాప్‌ నటుడి గురించి తెలుసా..? తమిళ చిత్ర పరిశ్రమలో అగ్రనటులుగా ఉన్న విజయ్, అజిత్, రజనీ, కమల్.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగానే రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారు. గత 10 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలోని హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్‌ విపరీతంగా పెరిగింది. ఇప్పుడంటే సరే... సుమారు 20 ఏళ్ల క్రితం కోటి రెమ్యునరేషన్ తీసుకునే నటీనటులకే ఎక్కువ ఇమేజ్‌ అని ఉండేది.

ఆ విధంగా తమిళ సినిమా చరిత్రలో తొలిసారిగా రూ.కోటి రెమ్యునరేషన్ అందుకున్న తొలి నటుడు 'మొహిదీన్ అబ్దుల్ ఖాదర్' ఆయన స్క్రీన్‌ నేమ్‌ రాజ్‌కిరణ్‌. కోలీవుడ్‌లో ఒక సినిమాకు కోటి రూపాయలు అందుకున్న తొలి నటుడిగా ఆయన రికార్డుకెక్కారు. రాజ్‌కిరణ్ 16 ఏళ్ల వయసులో చెన్నైకి వచ్చి దినసరి కూలీగా జీవనం సాగించాడు. అప్పుడు అతని జీతం కేవలం రూ. 5 మాత్రమే. అప్పుడు రాజ్‌కిరణ్ శ్రమ, అతని నిజాయితీకి ముగ్ధుడైన యజమాని గుమాస్తాగా పదోన్నతి కల్పించాడు. అప్పటి వరకు నెలకు రూ. 150  జీతం తీసుకుంటున్న రాజ్‌కిరణ్ ప్రమోషన్ తర్వాత రూ. 170 జీతం తీసుకున్నాడు. ఇదంతా 1988వ సంవత్సరంలో జరిగిన కథ.

రాజ్‌కరణ్‌​ సినిమాలపై ఆసక్తితో సొంతంగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీని ప్రారంభించి, క్రమంగా సినిమా రంగంలో ఎదగడం ప్రారంభించాడు, ఆ తర్వాత అతను దర్శకత్వంతో పాటుగా పలు సినిమాల్లో నటించడం ప్రారంభించాడు. అతని సినిమాలు భారీ హిట్‌గా మారడంతో, హీరోగా నటించమని వివిధ నిర్మాణ సంస్థల నుంచి పిలుపు రావడం జరిగింది. అలాంటి సమయంలో ఒక నిర్మాణ సంస్థ నుంచి రూ. కోటి పది లక్షలు ఇస్తామని ఆయనకు ఆఫర్‌ వచ్చింది. రాజ్‌కిరణ్ తన కష్టానికి గుర్తింపుగా దీన్ని అంగీకరించాడు. రూ.లక్ష జీతం తీసుకున్నప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

రూ.1 కోటి పారితోషికంతో తమిళ్‌లో 'మాణిక్కం' అనే సినిమా తీశారు. 1996లో విడుదలైన ఈ చిత్రానికి కెవి పాండియన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రాజ్‌కిరణ్ సరసన నటుడు విజయకుమార్ కూతురు, బిగ్ బాస్ స్టార్ వనిత జతకట్టింది. అమ్మ క్రియేషన్స్ పతాకంపై డి.శివ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ద్వారా రూ.కోటి రెమ్యునరేషన్ అందుకున్న తొలి తమిళ హీరోగా రాజ్‌కిరణ్ నిలిచాడు. ఆయన తర్వాతే రజనీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్, విజయ్, అజిత్ ఆ స్థాయికి చేరుకోవడం గమనార్హం.

టాలీవుడ్‌లో చిరంజీవి
టాలీవుడ్‌లో మెగాస్టార్‌ చిరంజీవి ఆయనకంటే ముందుగానే ఒక సినిమాకు రూ. 1.25 కోట్ల రెమ్యునరేషన్‌ అందుకొని రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. అత్యధిక పారితోషికం అందుకున్న తొలి భారతీయ నటుడిగా 1992లోనే మెగాస్టార్‌ వార్తల్లో నిలిచారు. ఆపద్బాంధవుడు సినిమాకు గాను ఆయన ఈ భారీ మొత్తాన్ని తీసుకున్నారు. 1992లో వచ్చిన ది వీక్ మ్యాగజైన్ ఫస్ట్ పేజీలో చిరు గురించి ప్రత్యేకంగా పెద్ద ఆర్టికల్ రాశారు. ఆ మ్యాగజైన్ ముందు పేజీలో “బిగ్గర్‌ దెన్‌ బచ్చన్” అనే శీర్షికతో చిరు ఫోటోను ప్రచురించారు.
 

Election 2024

మరిన్ని వార్తలు