Jennifer: నిర్మాత లైంగిక వేధింపులు.. న్యాయం జరగలేదంటున్న జెన్నిఫర్!

26 Mar, 2024 21:11 IST|Sakshi

బాలీవుడ్‌లో ప్రముఖ రియాలిటీ షో తారక్ మెహతా కా ఊల్టా చష్మా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఈ షోలో రోషన్ దారువాలా కౌర్ సోధి పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్న జెన్నిఫర్ మిస్త్రీ బన్సీవాల్ అర్ధాంతరంగా తప్పుకుంది. ఆ తర్వాత షో నిర్మాత అసిత్ కుమార్ మోడీ లైంగిక వేధింపుల గురి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసిత్‌ కుమార్‌ మోడీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అయితే తాజాగా ఈ కేసులో జెన్నిఫర్ మిస్త్రీ విజయం సాధించినట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 15న ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువడిందని తెలిపింది. అయితే ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించవద్దని పోలీసులను కోరినట్లు ఆమె వెల్లడించారు. నాకు కేవలం రూ.5 లక్షలు మాత్రమే పరిహారంగా అందించారని తెలిపారు. ఈ కేసులో నాకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ.25 నుంచి 30 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అదనంగా మరో రూ.5 లక్షలు కోర్టు జరిమానా విధించినట్లు ఆమె వెల్లడించింది. అయినప్పటికీ ఈ కేసులో తనకు ఇంకా పూర్తి న్యాయం జరగలేదని జెన్నిఫర్ మిస్త్రీ వాపోయింది. 

జెన్నిఫర్ మాట్లాడుతూ.." ఈ కేసులో కోర్టు తీర్పు ఇచ్చి 40 రోజులకు పైగా అయింది. ఇంకా నాకు రావాల్సిన మొత్తం పరిహారం రాలేదు. అతన్ని దోషిగా నిరూపించినప్పటికీ.. ముగ్గురు నిందితులకు ఎలాంటి శిక్ష విధించలేదు. సోహిల్ రమణి, జతిన్ బజాజ్‌లను దోషులుగా చేర్చలేదు. ఇది నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ కేసు తీర్పుతో నేను ఎలాంటి ప్రచారాన్ని కోరుకోవడం లేదు. నాపై జరిగిన వేధింపులను గుర్తించినందుకు సంతోషిస్తున్నా. ఈ కేసులో ప్రస్తుతానికి నాకు సరైన న్యాయం లభించలేదని భావిస్తున్నా" అని చెప్పింది. కోర్టు విధించిన పరిహారం చిన్నదని.. ఇలాంటి నేరాలు ఇతరులు చేసేలా ప్రేరేపించవచ్చని నటి పేర్కొంది. 

Election 2024

మరిన్ని వార్తలు