'మమ్మల్ని బాధ పెట్టిర్రు.. నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు': ప్రశాంత్ తండ్రి కన్నీటి పర్యంతం

21 Dec, 2023 18:51 IST|Sakshi

రైతుబిడ్డగా బిగ్‌బాస్‌ రియాలిటీ షో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. వంద రోజులకు పైగా సాగిన ఈ షోలో మరో కంటెస్టెంట్ అమర్‌దీప్‌ రన్నరప్‌గా నిలిచాడు. ‍అయితే అంతవరకు బాగానే ఉన్న.. ప్రశాంత్ గెలిచి బయటికొచ్చాక జరిగిన పరిణామాలు తీవ్రమైన చర్చకు దారితీశాయి. అభిమానుల అత్యుత్సాహంతో కార్లతో పాటు ఆర్టీసీ బస్సులు అద్దాలు ధ్వంసం కావడంతో పోలీసులు పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు చేశారు. ట్రోఫీ గెలిచి ఇంటికి వెళ్లిన ప్రశాంత్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు కూడా తరలించారు. తాజాగా ఈ వివాదంపై ప్రశాంత్ తండ్రి సత్యనారాయణ మాట్లాడారు. తన కుమారుడిని అరెస్ట్ మాకు సంతోషం లేకుండా చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. నా భార్యకు ఆరోగ్యం బాగాలేదని.. కుమారుల అరెస్ట్‌తో ఏడుస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 

(ఇది చదవండి: మరికొద్ది గంటల్లో సలార్ రిలీజ్.. సూపర్ సాంగ్ విడుదల!)

అరెస్ట్‌పై ప్రశాంత్ తండ్రి మాట్లాడుతూ.. 'నా కొడుకు బిగ్‌బాస్ గెలిచిండని మురిసిపోయినా. ట్రోఫీ గెలిచిన ఐదు గంటలకే నాకు బాధగా అనిపించింది. మాకు ఇదంతా ఎందుకు? వ్యవసాయం చేసుకుంటే సరిపోయేదనిపించింది. మా ఊర్లో ఉంటేనే బాగుండు. లేని పోనివీ సృష్టించి వార్తలు రాస్తుర్రు. ప్రశాంత్ పక్కనే నేను కూడా ఉన్నా. నాకు వాంతులు కూడా అయ్యాయి. ఈ గొడవతో నా కొడుకుకు ఎలాంటి సంబంధం లేదు. అదే సెలబ్రిటీలు అయితే ఇలానే చేస్తారా?. మావాడు ఎక్కడికి పోలే. కానీ కొందరు కావాలనే పారిపోయిండని రాసిర్రు.'అని వాపోయారు. 

పోలీసులు తీరుపై సత్యనారాయణ మాట్లాడుతూ.. 'బుధవారం సాయంత్రం 6.30కు పోలీసులు వచ్చి ప్రశాంత్‌ను తీసుకెళ్లారు. మాది మారుమూల గ్రామం. బెయిల్ ఇలాంటి వన్నీ నాకు తెల్వదు. నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు. ఆమె ఏడుస్తూ కూర్చుంది. జ్వరం కూడా వచ్చింది. మమ్మల్ని లేని పోనీ ఇబ్బందులు, బాధలు పెట్టిండ్రు సార్. పరేషాన్ చేసిర్రు. బట్టలు మార్చుకుంటానంటే కూడా వినలేదు. ముందుగా మంచిగానే మాట్లాడిర్రు, ఒకాయన అయితే ప్రశాంత్ మెడల మీద చేతులపట్టి నూక్కొచ్చిర్రు. వారెంట్ కూడా ఇయ్యలేదు. దొంగతనం చేసినట్లు ప్రశాంత్‌ను తీసుకెళ్లారు. ప్రజలందరికీ నేను ఒక్కటే వేడుకుంటున్నా. నా కొడుకు దొంగ కాదు. బిగ్ బాస్‌కు పోతానంటే నేను పంపించినా. విన్నర్ అయినడు. కానీ ఆ సంతోషం మాకు లేకుండా పోయింది.' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

 (ఇది చదవండి: పల్లవి ప్రశాంత్ కేసు.. నలుగురు మైనర్లు అరెస్ట్!)


 

>
మరిన్ని వార్తలు