నేను చనిపోలేదు.. 7 తర్వాత కూడా నిద్రపోయా: పరేశ్‌ రావల్‌

15 May, 2021 13:41 IST|Sakshi

నటుడు పరేశ్‌ రావల్‌ శుక్రవారం 7 గంటలకు చనిపోయాడంటూ ట్విటర్‌లో పోస్ట్‌ వైరల్‌

తను మరణించినట్లు వస్తున్న వార్తలను బాలీవుడ్‌ నటుడు పరేశ్‌ రావల్‌ ఖండించారు. ‘‘నేను చనిపోలేదు ఎక్కువ సేపు నిద్రపోయానంతే’’ అంటు ఆయన స్పష్టత నిచ్చారు. కాగా శుక్రవారం ఉదయం 7 గంటలకు పరేశ్‌ రావల్‌ మరణించినట్లుగా ట్విటర్లో ఓ నెటిజన్‌ పోస్టు షేర్‌ చేశాడు. అది చూసిన రావల్‌ స్పందిస్తూ తన మరణ వార్తపై చమత్కరించారు. ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘అపోహ కలిగించిందుకు మన్నించాలి. ఉదయం 7 దాటాకా కూడా ఎక్కువ సమయం నిద్రపోయానంతే. నేను మరణించలేదు’ అంటూ చేతులు జోడించిన ఎమోజీని జత చేశారు.

దీంతో నెటిజన్లు శతమానం భవతి అంటూ ఆయనను ఆశీర్వదిస్తుంటే మరికొందరు ఇలా తప్పుగా ట్వీట్‌ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొవాలంటూ మండిపడుతున్నారు. కాగా పరేశ్‌ రావల్‌ తెలుగులో చిరంజీవి హిట్‌ మూవీ ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’లో లింగం మామ పాత్రతో గుర్తింపు పొందారు. దీనితో పాటు ఆయన టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ భారత సినీ పరిశ్రమలో కలకలం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, దర్శక-నిర్మాతలు మృత్యువాత పడుతున్నారు.

ఈ క్రమంలో కొందరు బతికున్న నటులు సైతం కరోనాతో మరణించారంటూ ఈ మధ్య సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ సింగర్‌ లక్కీ ఆలీ, నటుడు ముఖేష్‌ కన్నాలు కోవిడ్‌తో మరణించినట్లు వార్తలు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ వార్తలను వారు ఖండిస్తూ తాము చనిపోలేదని, బ్రతికే ఉన్నామంటూ ప్రకటనలు ఇచ్చారు. మేం బతికిఉన్నామంటూ మేమే ప్రకటించుకోవాల్సి రావడం దురదృష్టకరమంటూ  ముఖేష్‌ కన్నా వ్యాఖ్యానించినప్పటికి, తాజాగా పరేశ్‌ రావల్‌పై ఇలాంటి తప్పుడు వార్తలు రావడం గమనార్హం. 

మరిన్ని వార్తలు